ఇప్పుడు వీధి సెన్సార్‌షిప్‌దే రాజ్యం. ఎవరు పద్మావతి సినిమా చూసినా, ఈ రౌడీలు వారిని తంతారట. పైగా దర్శకుడి తల తీస్తామని నిర్భీతిగా ప్రసార మాధ్యమాల్లో ప్రకటిస్తుంటే ఆ తాలిబన్లను అదుపు చేసే చట్ట వ్యవస్థే లేకుండా పోయింది.
చట్టాల్ని అతిక్రమిస్తూ వీధిగూండాలు చెలరేగిపోతుంటే ప్రభుత్వాలు మిన్నకుండిపోవడం.. అగ్నిలో ఆజ్యం పోయడం.. ఇవాళ ఇదొక నిత్యకృత్యమైపోయింది. అసలు ఉందో లేదో తెలియని ఓ రాణి. ఆమె ప్రేమ గాథను 16వ శతాబ్దంలో రాశాడొక సూఫీ ఫకీరు మాలిక్ మహమ్మద్ జయసి. సదరు కథలోని విలన్ ఖిల్జీ పాలన ముగిసిన 250 ఏళ్ల తర్వాత రాసిన కథ ఇది. రాజారతన్ సేన్‌ని కానీ, పద్మావతిని కానీ మేవాడ్ రాజు కులం జాబి తాలో చేర్చింది 19వ శతాబ్దంలో. తెల్లవారికి వ్యతిరేకంగా హిందూ రాజ్యభావనను రెచ్చగొట్టడానికి ఈ గాథను మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చారు. రాజపుత్ర స్త్రీల పవిత్రశీలం, పాతి వ్రత్యం, పురుషుడి ఆస్తిగా సతీసహగమనం అతి గొప్పగా కీర్తించడం ప్రారంభించారు.
చారిత్రక వ్యక్తి కూడా కాని ఓ రాణి పవిత్రతను కాపాడటానికి దేశాన్ని తగలబెడతామని రాజపుత్రులు వీరావేశంతో ఊగిపోతున్నారు. భర్త ఎదుటే సామూహిక మానభంగానికి గురై పాతికేళ్ల తర్వాత కూడా న్యాయానికి నోచని భన్వరీ దేవి గురించి ఎవరికీ క్రోధావేశం కలగడం లేదు. శీలం, పవిత్రత అగ్రవర్ణ స్త్రీలకే ఉంటాయి కామోసు. అదే అగ్రవర్ణ మగాళ్ల లైంగిక దాహాల్ని భరించడం పీడిత కులాల మహిళల నుదుటిరాత అని హైకోర్టు ఆవరణలోని మనువు విగ్రహం సాక్షిగా రాజస్తాన్ హైకోర్టు 20 ఏళ్ల క్రితమే ధృవీకరించింది.
చరిత్రలో లేని రాణికి వెండితెరపై కూడా మచ్చపడనీయం అంటూ మంత్రులు, ఎంపీలు జబ్బలు చరుస్తున్నారు. రూప్‌కన్వర్‌కు మత్తుమందిచ్చి భర్త చితిలో వేసి కాల్చి చంపిన ప్రదేశం ఇపుడొక ‘సతి’ ఆలయం. ఇటువంటివే మరో 125 దాకా సతుల చితులు ఆలయాలై సదరు భర్త ఇంటివారికి భుక్తిని కలిగిస్తున్నాయి. ఈ క్రూరాచారాన్ని కొలుస్తూ, కీర్తిస్తూ స్త్రీ స్వేచ్ఛను అథఃపాతాళానికి తొక్కుతున్న రాష్ట్రంలో రాణి పద్మావతి ‘జోహార్’ (రాజపుత్రుడు చనిపోతే జనానా స్త్రీలు చితిపేర్చుకుని మంటల్లో దూకి కాలిపోవడం) క్రతువును సరిగా చూపలేదని ఈ గూండా గుంపుల ఆవేదన.
స్త్రీశరీరాన్ని పురుషుడి ఆస్తిగా భావించి ఆమె అత్తింటి ఆస్తిలో వాటాకు రాకుండా ఆమెను సజీవంగా కాల్చి చంపే ఫ్యూడల్ దారుణాల్ని అద్భుతాలుగా కీర్తించడం ఆధునిక క్రూరత్వం. బానిసత్వాన్ని, కుల అణచివేతను, హింసను రక్తపాతాన్ని మనిషన్నవాడెవడైనా సరే అమానవీయంగానే దృశ్యీకరించాలి. అది ఒక చారిత్రక వాస్తవమైనా సమర్థించరాదు. ఈ పద్మావతి సినిమా ’సతి’ని గ్లోరిఫై చేస్తే దాన్నీ ఖండించాల్సిందే.
అల్లావుద్దీన్ ఖిల్జీ సమర్థుడైన పాలకుడు. రాజ్యం కలవాడెవడైనా అందగత్తెల్ని మోహించడం కొత్త కాదు. (మొదటి భార్య నాగమతి ఉండగా రతన్‌సేన్ పద్మావతిని కాంక్షించాడట) కాని రాజ్యప్రయోజనం చూడకుండా ఖిల్జీ ఆమెకోసమే దండెత్తి పోయాడనటం అతిశయోక్తి. హిందూ కులీన స్త్రీలు అసమాన సౌందర్యవతులు కనుకనే ముస్లిం దురాక్రమణదారుల నుంచి రక్షించుకోవడానికి బాల్య వివాహాలు వచ్చాయన్నంత అబద్ధమిది. ముస్లింలను మొత్తం గానే క్రూరులుగా, దుర్మార్గులుగా చిత్రించడం హిందుత్వ ఎజెండా. బన్సాలీ సినిమాలో ఖిల్జీని పచ్చిమాంసం తినే బర్బరుడిగా చిత్రించారని అంటున్నారు. అలా చిత్రించి వుంటే దాన్ని ఖండించాల్సిందే. ఖిల్జీ ఒక చారిత్రక వ్యక్తి. పద్మావతి కాదు. ఆమె ఒక కల్పన.
ఇంతకీ ఆ సినిమా ఎవరూ చూడలేదు. పద్మావతి ఒక సూఫీ ఫకీరు కల్పించిన ప్రేమ కావ్యం. ఏ ఆధారం లేకుండా దీన్ని చరిత్రగా ఎట్లా భావించాలి? నమ్మకాలు చరిత్ర కాదు కదా! ఆధారాలు లభించిన చరిత్రపైనే విశ్లేషణా రీతినిబట్టి ఒక్కొక్క చరిత్రకారుడికీ ఒక్కో అభిప్రాయం/నిర్ధారణలు ఉంటాయి. కాల్పనిక కావ్యపు రాణి రాజ కుటుంబపు ఆస్తి, గౌరవం ఎట్లా అవుతుంది? పైగా 300ల రామాయణాలు ఉన్నట్టుగానే తరతరాలుగా ఓ వంద రకాలైన పద్మావతి గాథలు ఉన్నాయి. బెంగాలీలో, మయన్మార్‌లో కూడా భిన్న గాథలున్నాయి. వాటన్నింటినీ జానపదులు పాడుతుంటారు. దీనిలో ఒక రకానికి ప్రామాణికత నిర్ధారించి అదే సరైందనే హక్కు రాజపుత్రులకు ఉందా? అనేక గాథల్లో పద్మావతి అసలు రాజరికపు స్త్రీ కూడా కాదు.
దేశ అత్యున్నత న్యాయస్థానం కల్పించుకోము అని తేల్చి చెప్పింది. కానీ ప్రభుత్వానికి ఖాతరు లేదు. ఇపుడు వీధి సెన్సార్‌షిప్ రాజ్యం. ఎవరు పద్మావతి సినిమా చూసినా, ఈ రౌడీలు వారిని తంతారట. అంతేకాదు దర్శకుడి తల తీస్తామని నిర్భీతిగా జాతీయ ప్రసార మాధ్యమాల్లో వారు ఆటవికత ప్రకటిస్తుంటే ఆ తాలిబన్లను అదుపు చేసే చట్ట వ్యవస్థే లేకుండా పోయింది.
కుటుంబాలు పసివాళ్లతో సహా అప్పులు తాళలేక సామూహికంగా మరణిస్తారు. నియంత్రణ లేని లాభాల్తో ఫ్యాక్టరీల్లో, బస్సుల్లో, పడవల్లో జనం పిట్టల్లా రాలిపోతుం టారు. జీఎస్టీ చర్యను పక్కదారి పట్టించడానికి ఊహాజనిత సమస్యతో కృత్రిమ ఆడంబర గౌరవాల భంగం నెపంతో దేశవ్యాపిత బంద్.. దేశాన్ని కిడ్నాప్ చేసి, బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించడం... వీధి గూండాల చేతుల్లో రాజ్యాంగం...
ఏమైతేనేం మనకెందుకు కానీయండి అనుకుంటూ చానల్స్‌లో నిత్యం చౌకబారు కామెడీలు చూసుకుంటూ, ఆన్‌లైన్ షాపింగ్‌లు చేసుకుంటూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ బతికేద్దాం... దేశం ఏమైతేనేం... ఎక్కడికెళ్తేనేం.. కానీ మనం మిగులుతామా.. చివరికి?
దేవి
వ్యాసకర్త సాంస్కృతిక కార్యకర్త
మొబైల్ : 98486 22829
మనుషులుగా మిగులుతామా?
Published Fri, Nov 24 2017 1:22 AM | Last Updated on Fri, Nov 24 2017 4:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment