బీజేపీ గెలుపుతో.. రూటు మార్చిన చంద్రబాబు | devulapalli amar guest column on gujarat elections | Sakshi
Sakshi News home page

ఆశలు రేకెత్తించని గెలుపు

Published Wed, Dec 20 2017 12:49 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

devulapalli amar guest column on gujarat elections - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

గుజరాత్‌లో బీజేపీ ఓడిపోతుందని గామోసు ఏపీ ముఖ్యమంత్రి కొంచెం స్వరం పెంచి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్, రాజధానికి సాయం విషయాల్లో కేంద్రాన్ని విమర్శిం చడం మొదలుపెట్టారు. పోలవరాన్ని కేంద్రానికి దండం పెట్టి అప్పజెప్తానన్నారు. మిత్రుడు బలహీనపడితే వదిలేసి, కొత్త మిత్రులను వెతుక్కోవడం ఆయనకు అలవాటే. డామిట్‌ కథ అడ్డం తిరిగింది అన్నట్టు బీజేపీ గెలవడంతో ఆయన రూటు మార్చి, బీజేపీని విమర్శించే టీడీపీ తమ్ముళ్లకు నోరు మూసుకోండి అని ఆదేశాలు పంపారు.

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి ఖాయం అన్న అభిప్రాయం మొన్న ఫలితాలు వెలువడే వరకూ చాలా మందిలో ఉండేది. ఏకంగా 22 ఏళ్ళ పాలన అధికార పార్టీ బీజేపీపట్ల ఎంతో వ్యతిరేక తను తెచ్చిపెట్టి ఉంటుంది. దానికి తోడు రాష్ట్ర స్థాయిలో సమర్ధ నాయకత్వం లేదు. జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాల ప్రతికూల ప్రభావం, పెరిగి పోయిన మతపరమయిన అసహనం వెరసి బీజేపీకి ఓటమి తప్పదనే భావ నను కలిగించి ఉండొచ్చు. వీటన్నిటికి తోడు∙కాంగ్రెస్‌ పార్టీ ప్రచార సరళి మెరుగుకావడమూ, ముఖ్యంగా తాజాగా అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన రాహుల్‌ గాంధీలో కొంత రాజకీయ పరిణతి కనిపించడం, అది ఆయన ప్రచార ప్రసంగాలలో ప్రతిబింబించడమూ మొద లైన అంశాలన్నీ కలసి కాంగ్రెస్‌ను గుజరాత్‌లో గెలిపిస్తాయని అనుకున్నారు. మోదీ, అమిత్‌ షా జోడీ కూడా ఒక దశలో ఓడిపోతున్నామనే అనుకున్నారు. అందుకే మోదీ చివరి వారం ప్రచారంలో తన శక్తియుక్తులన్నిటినీ ప్రయో గించాల్సి వచ్చింది. ప్రధాన మంత్రి స్థాయి నుంచి చాలా కిందికి దిగజారి మాట్లాడాల్సి వచ్చింది. చివరి రోజుల్లో ఆయన చేసిన ప్రచారం.. సొంత పార్టీ వారే ముక్కున వేలేసుకునేట్టు చేసింది.

చావు తప్పి కన్ను లొట్టబోయి...
కాంగ్రెస్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు అంటగట్టారు. తనను చంపడానికి కాంగ్రెస్‌ సుపారి ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ వారు ఔరంగజేబు వార సులన్నారు, గుజరాత్‌ అస్మిత (ఆత్మగౌరవం) గురించి పదే పదే మాట్లాడి ప్రాంతీయాభిమానాన్ని రెచ్చగొట్టారు. తనను నీచ జాతి వాడు అని మణి శంకర్‌ అయ్యర్‌ దూషించాడని, అది గుజరాతీలు అందరినీ తిట్టినట్టేననీ రెచ్చగొట్టారు. మణిశంకర్‌ అయ్యర్‌కు హిందీ సరిగా రాదు, అయినా ఆయన మోదీ మీద చేసిన వ్యాఖ్య ఒక కులాన్ని కానీ, జాతిని కానీ ఉద్దేశించి చేసింది కాదు. వ్యక్తిగతంగా మోదీని ఉద్దేశించి చేసింది. అయినా మోదీ దాన్ని వాడు కుంటారని, నష్టం జరుగుతుందనీ తెలుసు కనుక రాహుల్‌ ఆ వ్యాఖ్య చేసి నందుకు మణిశంకర్‌ అయ్యర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించారు. 2014 ఎన్నికల సందర్భంగా కూడా మణిశంకర్‌ అయ్యర్‌ మోదీని ‘చాయ్‌ వాలా’ అని సంబోధించి బీజేపీ నెత్తిన పాలు పోసిన విషయం అందరికీ తెలి సిందే. ఇలా దొరికిన ప్రతిదాన్నీ వాడుకున్నా గుజరాత్‌లో బీజేపీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచింది. 2014 ఎన్నికల నినాదం ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ ఇక అసాధ్యమని గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఫలితాల తదుపరి మోదీ పార్లమెంట్‌లోకి వెళుతూ విజయ సంకేతం ఇచ్చి నప్పుడు సైతం ఆయన ముఖంలో కనిపించినది మేకపోతు గాంభీర్యమే తప్ప, సహజ విజయహాసం కాదు.

మోదీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల వ్యతిరేకత వల్ల కావచ్చు, హార్ధిక్‌ పటేల్, అల్పేష్‌ ఠాకూర్, జిగ్నేష్‌ మెవాని త్రయం తిరుగుబాటు వల్ల వచ్చిన మార్పు కావొచ్చు గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలం పెరిగింది. సరిగ్గా ఎన్నికలకు కొద్దిగా ముందు శంకర్‌సింగ్‌ వఘేలా పార్టీని వీడి కొత్త పార్టీ పెట్టకపోతే కాంగ్రెస్‌కు ఇంకో పది సీట్లు పెరిగి ఉండేవి. గుడ్డిలో మెల్ల అన్నట్టు బీజేపీ హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను ఓడించి అధికారం కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్‌ ముక్త భారత్‌ను సంపూర్ణం చెయ్యడానికి తామిక ఐదు రాష్ట్రాల దూరంలోనే ఉన్నామని బీజేపీ చెప్తున్నది. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అంటే, ఏం చేసైనా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారం కైవసం చేసుకోవడమేనని ఇప్పుడు అందరికీ అర్థం అవుతున్నది. అయినా ఒక రాజకీయ పార్టీని లేకుండా చెయ్య డం ప్రజాస్వామ్యంలో సాధ్యపడదని కమలనా«థులకు గుజరాత్‌ ఫలితాల తరువాత అర్థమై ఉంటుంది.

కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అసాధ్యం
2018 ప్రారంభంలో మరో నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జర గనున్నాయి . వాటిల్లో మూడు చాలా చిన్న రాష్ట్రాలు. కర్ణాటక మాత్రమే పెద్ద రాష్ట్రం, పైగా అది కాంగ్రెస్‌ పాలనలో ఉంది. పంజాబ్‌ తరహా ఎన్నికల వ్యూహాన్నే కనుక కాంగ్రెస్‌ కర్ణాటకలో కూడా అనుసరిస్తే అక్కడ అది మళ్లీ గెలవడం ఖాయం. ఏ ఎన్నికనైనా మోదీకి, రాహుల్‌కు మధ్య పోటీగా చూస్తే కాంగ్రెస్‌ తట్టుకుని నిలబడటం కష్టం. మోదీకి దీటుగా రాహుల్‌ నిలవడానికి ఇంకా కొంత  సమయం కావాలి. పంజాబ్‌లో ఓటర్లు అది కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌కు, బాదల్‌కు మధ్య పోటీగా చూసినందువల్లనే కాంగ్రెస్‌ గెలిచింది. కర్ణాటకలో మోదీ గుజరాత్‌లో లాగా అస్మిత అంటూ ప్రజల్ని రెచ్చగొట్టలేరు. ప్రస్తుతానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు దీటయిన నాయకుడు కర్ణాటక బీజేపీలో కానరాడు. కర్ణాటక విజయాన్ని కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు రాహుల్‌కు బహుమతిగా ఇస్తామని సిద్దరామయ్య ఇప్పటికే ప్రక టించారు.

2018 చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, రాజస్థాన్‌ రాష్ట్రల్లో బీజేపీనే అధికారంలో ఉంది. గుజరాత్‌ అంత  సుదీర్ఘ కాలంగా కాకపోయినా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా మూడుసార్లు గెలిచి అధికారంలో ఉంది. అంతో ఇంతో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కని పిస్తున్నది ఆ రాష్ట్రాల్లోనే. రాజస్థాన్‌లో ఏ పార్టీకీ రెండోసారి అధికారం ఇవ్వడం సాధారణంగా జరగదు. అసలు ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలతోనే పార్లమెంట్‌ ఎన్నికలు కూడా నిర్వహించాలన్న ఆలోచనలో మోదీ ఉన్నట్టు వార్తలు వస్తు న్నాయి. అత్యధిక రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకున్నామన్న సంతోషంలో తలమునకలు అవుతున్న బీజేపీ ఆయా రాష్ట్రాల్లో సహజంగానే ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల వ్యతిరేకత తోడై జమిలిగా దెబ్బ కొడతాయేమో చూసుకోవాలి. ఈ స్థితిలో కాంగ్రెస్‌ ముక్త భారత్‌ కలగానే మిగిలిపోతుందేమో అని గుజరాత్‌ ఎన్నికల ఫలితాల విశ్లేషకుల అభిప్రాయం.

ఈ పరిస్థితుల్లో దక్షిణాదిని కైవసం చేసుకోవాలన్న బీజేపీ కల నెరవేరే అవకాశం కనిపించడం లేదు. కేరళ మీద ఆశలు ఎలాగూ లేవు. జయలలిత మరణం తరువాత తమిళనాడును తమ అదుపులోకి తెచ్చుకోవాలన్న కమల నాథుల ప్రయత్నాలు నెరవేరేట్టు లేవని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తు న్నాయి. ఇక మిగిలినవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు. నమ్మదగని మిత్రుడు చంద్రబాబు నాయుడుతో కలసి అధికారం పంచుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ఒక పక్క, దాగుడు మూతలాగే  చంద్రశేఖర్‌రావు అధికారంలో ఉన్న తెలంగాణ మరో పక్క.

ప్రతిసారీ మేం మిత్ర పక్షం చేతుల్లో మోసపోతూనే ఉన్నాం అని నిన్న బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అన్న మాటలే చంద్రబాబు నమ్మదగ్గ మిత్రుడు కాదనడానికి రుజువు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా పోటీ చేసి నాలుగు పార్లమెంట్‌ స్థానాలు గెలుచుకుని 18 శాతం ఓట్లు  సంపాదించుకున్న చరిత్ర కలిగిన బీజేపీ ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం నీడన గడపాల్సి రావడానికీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పుట్టుక కంటే చాలా ముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా సుష్మాస్వరాజ్‌ వంటి నాయ కులను ముందుంచి నడిచినా, తెలంగాణ ఏర్పాటుకు పూర్తి సహకారం అందించినా గానీ తమ పార్టీ.. నిజాంను కీర్తిస్తూ, మజ్లిస్‌కు పెద్ద పీట వేస్తున్న కేసీఆర్‌ ధాటికి తట్టుకోలేని దుస్థితిలో ఉండటానికీ కారణం ఏమిటో అందరికీ తెలుసు. 1998లో 18 శాతం ఓట్లు తెచ్చుకున్న నాటి నుంచే స్వతంత్రంగా కొనసాగి ఉంటే బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కచ్చితంగా బలమయిన రాజకీయ శక్తిగా ఎదిగి ఉండేది. మిత్రుడి చేతుల్లో ప్రతిసారీ మోసపోతూనే ఉన్నామని వీర్రాజు ఇప్పుడు బాధ పడటం చేతులు కాలాక ఆకులు పట్టు కున్నట్టుంది. 2019 ఎన్నికల్లో సొంతంగా గెలవలేమని భావిస్తే కేసీఆర్‌ బీజేపీతో పొత్తుకు సిద్ధపడతారని తెలిసిందే. బీజేపీ స్థానిక నాయకత్వం కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నట్టుంది. గుజరాత్‌ ఫలితాలు చూసి తెలంగాణలో కూడా మేం గెలుస్తాం అని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రక టించారు సరే, అందుకు అనువైన పరిస్థితులైతే కనిపించడం లేదు.

బెడిసికొట్టిన టీడీపీ అంచనాలు
గుజరాత్‌లో బీజేపీ ఓడిపోతుందన్న అభిప్రాయం ఏపీ ముఖ్యమంత్రికి కూడా కలిగినట్టుంది. అందుకే కొంచెం స్వరం పెంచి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్ట్, రాజధానికి సాయం విషయాల్లో కేంద్రాన్ని విమర్శించడం మొద లుపెట్టారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన పోలవరాన్ని కేంద్రానికి దండం పెట్టి అప్పజెప్తానన్నారు. మిత్రుడు బలహీనపడితే వదిలేసి, కొత్త మిత్రులను వెతుక్కోవడం చంద్రబాబుకు అలవాటే. గెలవడానికి ఆయనకు ఎవరో ఒకరి సాయం కావాలి. ఆయన స్వయం ప్రకాశితుడు కాదని అన్ని ఎన్నికలూ రుజువు చేశాయి. 1999, 2014 రెండుసార్లూ ఆయన అధికారంలోకి వచ్చింది బీజేపీ కారణంగానే.

అవసరం తీరాక బీజేపీ రథం ఎలా దిగిపోయారో కూడా చూసాం. గుజరాత్‌లో బీజేపీ ఓడిపోతే మోదీ బలహీన పడతారు. అప్పుడు తెగదెంపులు చేసుకుని బీజేపీ కారణంగానే రాష్ట్రానికి తాను ఏమీ చెయ్యలేక పోయానని 2019లో ప్రజల ముందుకు వెళ్లాలనేది ఆయన ఆలోచనగా కని పిస్తుంది. పవన్‌కల్యాణ్‌లో ఆయన ఎట్లాగూ కొత్త మిత్రుడిని చూస్తున్నారు. డామిట్‌ కథ అడ్డం తిరిగింది అన్నట్టు గుజరాత్‌లో బీజేపీ మళ్లీ గెలిచి కూర్చుంది. అయితే ఈ విషయాలు టీడీపీ నాయకుడు రాజేంద్రప్రసాద్‌కు ఏం తెలుసు? విశ్రాంతి కోసం అధినేత మాల్దీవులకు వెళ్లే ముందటి వైఖరినే వ్యక్తం చేశారు.  కానీ పథకం మారింది. బీజేపీని విమర్శించే వైఖరి మారింది. నోరు మూసుకోండి అని తెలుగుదేశం తమ్ముళ్లకు మాల్దీవుల నుంచి ఆదేశాలు అందాయి.

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోము వీర్రాజు టీడీపీని, ప్రభుత్వాన్ని కడిగి పారేశాడు. మా దయవల్లే బీజేపీకి ఏపీలో నాలుగు సీట్లు వచ్చాయని రాజేంద్రప్రసాద్‌ అంటే, 2014లో మేం లేకుంటే టీడీపీ గెలిచేదా? అన్నాడు వీర్రాజు. అంతే కాదు నోట్లు రద్దు చేసి మేం గెలు స్తుంటే, నోట్లు పంచి టీడీపీ గెలుస్తున్నది అని ఆయన నంద్యాల ఉప ఎన్ని కను గుర్తు చేశారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి కావడంతో ఆ పార్టీ నాయకులకు స్వేచ్ఛ లభించినట్టుంది. అందుకే ఏపీలో బీజేపీ బలపడకూడదంటే సహించబోం అని హెచ్చరించారు వీర్రాజు. ఆయన టీడీపీ మీద, చంద్రబాబు మీదా ఇంకా చాలా విమర్శలే చేసారు. గుజరాత్‌ ఫలితాల తరువాత బీజేపీతో తెగదెంపుల ఆలోచన పక్కన పెట్టేసిన చంద్రబాబు మాల్దీవుల నుంచి వచ్చాక నష్ట నియం త్రణ కోసం ఏం చేస్తారో చూడాలి.

వ్యాసకర్త, ప్రముఖ పాత్రికేయులు
దేవులపల్లి అమర్‌
datelinehyderabad@gmail.com 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement