ప్రభుత్వం దగ్గర సురక్షితంగా ఉండాల్సిన పౌరుల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే వెంటనే కదిలి విచారణకు ఆదేశించి బాధ్యులైనవారిపై చర్యలు చేపట్టాల్సింది పోయి నా డేటా నాకు పంపాలి కానీ మీరు కేసులు ఎట్లా పెడతారు అని తెలంగాణ పోలీసుల మీద, ప్రభుత్వం మీద చంద్రబాబు రంకెలేస్తున్నారు. పౌరుల వ్యక్తిగత వివరాలు ఏపీ ప్రభుత్వంలోని ఎవరో ఒకరు ఇవ్వకపోతే ఐటీ గ్రిడ్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఎట్లా అందాయి? ఎన్నికలలో గెలవడం కోసం ఇన్నాళ్ళూ అవలంబిస్తున్న పద్ధతులు ఈసారి ఫలితం ఇచ్చేట్టు లేవని అర్థం అయిన చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు వెయ్యిరెట్లు ప్రమాదకరమైన వంచనాత్మక క్రీడలో అదే పద్ధతిలో దొరికిపోయేట్టున్నారు.
‘‘నా సత్తా ఏంటో తెలియాలంటే ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమా చూడమనండి మోదీని, కేసీఆర్‌ని’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రెండు రోజుల క్రితం ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అన్నారు. 1984 ఆగష్టు సంక్షోభంలో నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటు నుంచి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాపాడటంలో చంద్రబాబుదే ప్రధాన పాత్ర అని ఈ సినిమాలో చూపించారు. కాబట్టే చంద్రబాబు తన పార్టీ సమావేశాల్లో, మంత్రివర్గ సమావేశాల్లో బహిరంగ సభల్లో ఈ సినిమా ప్రమోషన్ మొదలు పెట్టారు. 84 తరువాత పుట్టిన వాళ్ళు చాలామందికి ఆనాటి ఆగష్టు సంక్షోభంలో ఏం జరిగిందో తెలిసే అవకాశం తక్కువ, వాళ్ళంతా ఇప్పుడు ఓటర్‌లు అయ్యారు కాబట్టి ఈ సినిమాలో చూపించినదంతా నిజమని నమ్మి తనకు ఓట్లు వేస్తారని ఆయన అభిప్రాయం. నిజంగా అలా జరుగుతుందనే ఆయన అనుకుంటారు, నమ్ముతారు కూడా, ఎందుకంటే ఆయన చరిత్ర చదవరు , చరిత్ర దండగ అనే అభిప్రాయం ఆయనది కాబట్టి తనలాగే ఈ వర్గం ఓటర్లు చరిత్ర చదవకుండా, తెలుసుకోకుండా గుడ్డిగా తనకు ఓట్లు వేస్తారని ఆయన భావిస్తూ ఉండొచ్చు.
ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట 84లో నాదెండ్ల భాస్కర్‌రావును ముందు పెట్టి ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అస్థిర పరి చేందుకు చేసిన కుట్రను భగ్నం చెయ్యడంలో చంద్రబాబు పాత్రే ప్రధానమని చూపించారు ఈ సినిమాలో. ఇది పూర్తిగా అబద్ధం అని ఆనాటి తరం వాళ్ళందరికీ, ముఖ్యంగా ఎన్టీఆర్‌ను ఆయన ప్రభుత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న రాజకీయ పక్షాలకూ, మేధావులకు, పత్రికా సంపాదకులకూ బాగా తెలుసు. ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉన్న వెంకయ్యనాయుడుకు, జైపాల్‌రెడ్డికి తెలుసు. అరుణ్ శౌరి, కులదీప్ నయ్యర్ వంటి ప్రముఖ సంపాదకులకు తెలుసు ఆనాడు చంద్రబాబుది కేవలం ఒక మేనేజర్ పాత్ర అని. చంద్రబాబు అప్పుడప్పుడే కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాడు.
ఆయన బంధుత్వాన్ని ప్రయోగించి మామ పంచన చేరాడే తప్ప సినిమాలో చూపించినట్టు ఎన్టీఆర్ ఏమీ ఆయనను ఆహ్వానించలేదు. రామకృష్ణ స్టూడియోస్‌లో తెలుగుదేశం, దాని మిత్రపక్షాల శాసన సభ్యుల శిబిరంలో అయినా, వాళ్ళందరినీ ట్రైన్‌లో ఢిల్లీకి తరలించే క్రమంలో అయినా, ఢిల్లీ నుంచి వాళ్ళందరినీ బెంగళూరు సమీపంలోని నందిహిల్స్ శిబిరానికి తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు శాసనసభలో బలపరీక్ష కోసం తరలించిన అన్ని సంఘటనల్లో చంద్రబాబుది మేనేజర్ పాత్రే. శాసన సభ్యుల అవసరాలు తీర్చడం, సౌకర్యాలు ఏర్పాటు చెయ్యడం మినహా ఆయన చేసిందేమీ లేదు, రామకృష్ణ స్టూడియోలో, ఎంఎల్‌ఏల ఢిల్లీ ట్రైన్ ప్రయాణంలో, నందిహిల్స్ శిబిరంలో వారి వెన్నంటి ఉండి ప్రత్యక్ష సాక్షులయిన పలువురు పాత్రికేయులలో నేనూ ఒకడిని.
అయితే ఈ సినిమాలో మాత్రం చంద్రబాబు ఫైటింగ్‌లు కూడా చేసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నిలబెట్టినట్టు చూపిస్తారు. ముఖ్యంగా ఎంఎల్‌ఏలను ట్రైన్‌లో ఢిల్లీ తరలించినప్పుడు రివాల్వర్‌తో దాడి చేసిన వాళ్ళతో ఆయన స్వయంగా తలపడినట్టు, దుండగులను తరిమికొట్టినట్టు చూపిస్తారు. ఆనాడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిలబడ్డ వాళ్ళంతా ఎన్టీఆర్‌కు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన ఆయన ప్రభుత్వానికి ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగా నిలబడ్డారు తప్ప చంద్రబాబు సినీ ఫక్కీ ఫైట్‌లతో విజయం చేకూరలేదు.
నెల రోజుల సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర పోలీసు ఐజీని మార్చి మహేందర్ రెడ్డి అనే అధికారిని నియమించారు. రామకృష్ణ స్టుడియోలో ఉన్న శాసన సభ్యులను బలవంతంగా అక్కడి నుండి తరలించి బయటకు తెచ్చి వదిలెయ్యాలన్న భాస్కర్‌రావు ఆదేశాలను అరవిందరావు పాటించి ఉంటే కథ వేరేగా ఉండేది. ఆయన ఆ పని చెయ్యనని కచ్చితంగా తిరస్కరించారు. అట్లాగే రాష్ట్ర ప్రజల మనోగతాన్ని ఇందిరా గాంధీకి వివరించి మళ్ళీ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పునరుద్దరింపచేసిన ఘనత శంకర్ దయాళ్ శర్మది.
ఇప్పుడింత వక్రీకరణలతో కూడిన సినిమా ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం ఆయనది. 84లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ దగ్గరి నుంచి 95లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకూ చంద్రబాబుది మేనేజర్ పాత్రే. ప్రజాస్వామ్యంలో రాజ కీయాలను, ఎన్నికలను ఈవెంట్‌లుగా మాత్రమే చూడటం వాటికి తానూ మేనేజర్‌గా వ్యవహరించడమే ఆయన 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర, అనుభవం. రాజకీయాల్లో మానవీయ కోణం ఉంటుందని కానీ, నైతిక విలువలు ఉంటాయని కానీ ఆయన ఒప్పుకోరు. బాబు నమ్మే సిద్ధాంతం రాజకీయమే దేవాలయం అధికారమే దైవం. రాజకీయాలంటే అధికారం, దానికోసం ఏమైనా చేయొచ్చు అదీ ఆయన సిద్ధాంతం.
అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. 1992లో రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక కోట్ల విజయభాస్కర్ రెడ్డి పాణ్యం నుండి శాసనసభ ఉపఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఆయన మీద టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఉపఎన్నికలో ప్రజల సానుభూతి పొందడానికి చంద్రబాబు ఎటువంటి స్కెచ్ ప్రతిపాదించారో దాన్ని ఎన్టీఆర్, ఇతర నాయకులు ఎట్లా వ్యతిరేకించారో రేణుకా చౌదరిని, దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఆ నాటి టీడీపీ నాయకులను అడిగితే చెపుతారు. ఎన్టీఆర్‌ను దించేసి సీఎం అయిన కొద్ది రోజుల్లోనే 1996లో పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో చంద్రబాబు గాంధీగారిని (కరెన్సీ) ఓటర్లకు బాగా పరిచయం చేసారని ఆ పార్టీ సీనియర్ నాయకులే చమత్కారంగా చెప్పుకునేవారు. ఎన్నికల్లో ధన ప్రభావం మొదలయింది ఆ ఎన్నికల నుంచే, దానికి ఆద్యుడు చంద్రబాబే. 1996లో అత్తిలి నుండి 2017 నంద్యాల ఉపఎన్నికలదాకా చంద్రబాబు డబ్బు ప్రభావాన్ని ఎంత పెంచేసారో, ప్రజాస్వామ్యాన్ని ఎంత అవినీతిమయం చేసేసారో అందరికీ తెలుసు.
రాష్ట్ర విభజన జరిగిన కొత్తలోనే ఓటుకు కోట్లు కేసు ప్రయోగం విఫలం అయి హైదరాబాద్ శాశ్వతంగా వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు అదే హైదరాబాద్‌లో అంతకు వెయ్యిరెట్లు ప్రమాదకరమయిన ఒక క్రీడలో అదే పద్ధతిలో దొరికిపోయేట్టున్నారు. ఎన్నికలలో గెలవడం కోసం ఇన్నాళ్ళూ అవలంబిస్తున్న పద్ధ్దతులు ఈసారి ఫలితం ఇచ్చేట్టు లేవని అర్థమయి ఈ కొత్త క్రీడకు శ్రీకారం చుట్టారు. మూడున్నర కోట్ల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల వ్యక్తిగత వివరాలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గర ఉన్న విషయాన్ని సామాజిక కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ పౌరుడు లోకేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసారు. హైదరాబాద్‌లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా ఆ కంపెనీలో జరిపిన సోదాల్లో అందరూ నిర్ఘాంత పోయే వివరాలు బయటపడ్డాయి.
ప్రభుత్వం దగ్గర సురక్షితంగా ఉండాల్సిన పౌరుల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే ఏపీ ప్రభుత్వం వెంటనే కదిలి ఇదెలా జరిగిందో విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలకు పూనుకోవాల్సిందిపోయి నా డేటా నాకు పంపాలి కానీ మీరు కేసులు ఎట్లా పెడతారు అని తెలంగాణ పోలీసుల మీద, ప్రభుత్వం మీద బాబు రంకెలేస్తున్నారు. పౌరుల వ్యక్తిగత వివరాలు ప్రభుత్వం లోని ఎవరో ఒకరు ఇవ్వకపోతే ఐటీ గ్రిడ్‌కు ఎట్లా అందాయి? ఎట్లా అందాయో తెలియాలంటే ఐటీ గ్రిడ్ యజమానిని ప్రశ్నించాలి. ఆయన పారిపోయి ఏపీలో ప్రభుత్వ ఆశ్రయంలో ఉన్నాడు. ఆయనకు పూర్తి రక్షణ అక్కడి ప్రభుత్వమే కల్పిస్తున్నది అంటే అర్థం ఏమిటి? నిందితుడిని విచారించి నిజాలు బయటపెట్టాల్సిన ప్రభుత్వం అతడికి రక్షణ ఇచ్చి, నేరాన్ని బయటపెట్టిన బాధ్యతగల పౌరుడు లోకేశ్వర్ రెడ్డిని దారినబోయే దానయ్య అని చులకనగా మాట్లాడి ఆయనను హైదరాబాద్ నుంచి ఎత్తుకుపోయే ప్రయత్నం చెయ్యడంలో అర్థం ఏమిటి?
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, ప్రభుత్వమే రాష్ట్ర ప్రజల వ్యక్తిగత వివరాలను ఒక ఐటీ కంపెనీకి ఇచ్చి తన పార్టీకి సంబంధించిన సేవా మిత్ర అనే యాప్ ద్వారా పోలింగ్ బూత్ స్థాయిలోని తన పార్టీ కార్యకర్తలకు అందచేసే ఏర్పాటు చేసింది. సీఎంగా తన దృష్టికి వచ్చే విషయాలను అవసరమయిన మేరకు తప్ప ఎక్కడా వెల్లడించనని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన బాబు ప్రభుత్వం నుంచి టీడీపీ ప్రయోజనాల కోసం ఈ వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోవడమంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్టే. ఈ వివరాల సహాయంతో ఎన్నెన్ని అక్రమాలకూ పాల్పడతారో ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో బాటు ఐటీ రంగ నిపుణులూ, మేధావులూ వివరంగా చెపుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక్క మాట చెప్పాలి.
టీడీపీ ప్రభుత్వ ఘాతుక చర్య కారణంగా మీ ఎవ్వరి వ్యక్తిగత జీవితాలూ భద్రంగా మాత్రం లేవు అని. ఈ వ్యవహా రాన్ని పోలీసులు, న్యాయస్థానాలు తేలుస్తాయి అని రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇది ఓట్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. ఏపీలోని చివరి ఓటు వరకూ భద్రం అని తేలేదాకా, మొత్తం ఓటర్ల జాబితా నూటికి నూరు శాతం సరిగ్గా ఉందని నిర్ధారణ జరిగాకనే అక్కడ ఎన్నికలు జరపాలి. అవీ స్వతంత్రంగా జరపాలి. తీగ అయితే లాగారు డొంక కదులుతుందా లేదా చూడాలి.
వ్యాసకర్త: దేవులపల్లి అమర్
datelinehyderabad@gmail.com
Comments
Please login to add a commentAdd a comment