మేలుకుంటేనే కోలుకుంటాం | Dileep Reddy Guest Column On Coronavirus Spreading And Effect On People | Sakshi
Sakshi News home page

మేలుకుంటేనే కోలుకుంటాం

Published Fri, Jun 26 2020 1:20 AM | Last Updated on Fri, Jun 26 2020 1:22 AM

Dileep Reddy Guest Column On Coronavirus Spreading And Effect On People - Sakshi

‘కోవిడ్‌ కొట్టిన దెబ్బ నుంచి మనం కోలుకోవడమెలా?’ ‘ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా మున్ముందెలాగో!’ ‘బతికితే బలుసాకు తిని నెట్టొచ్చు, ముందు బతుకనీయ్‌!’ ‘మన కేం కాదా..? రోజురోజుకూ కేసులు అంతటా పెరుగుతున్నాయట!’ ఇవీ, పదేపదే ప్రస్తావన కొస్తూ.. సగటు మెదళ్లను నిత్యం తొలుస్తున్న మాటలు. ఎవరమేం మాట్లాడినా ఒకోసారి మన మాటలపై మనకే విశ్వాసం కలుగదు. అలా అనుమానం పెరగటానికి కారణం కళ్లెదుట కనిపిస్తున్న వాస్త వాలు. కాలం గడుస్తున్న కొద్ది దయనీయంగా మారుతున్న బయటి వాతావరణం. దెబ్బకొట్టడమే కాకుండా దాదాపు అన్ని రంగాలనూ కోవిడ్‌ ఇంకా కుదిపేస్తూనే ఉంది. లాక్‌డౌన్‌తో సుమారు మూడు నెలలు కార్యకలాపాలు నెమ్మదించాయి లేదా స్తంభించిపోయాయి. విశ్వవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఫలితంగా ఉత్పత్తి, నిర్మాణం, రవాణా, వర్తక–వాణిజ్యం, టూరిజం, విద్య, వైద్యం, హోటల్, సేవలు... ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాలూ ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి.

లెక్కకు మించిన ఉద్యోగాలు ఊడిపోయాయి. ఎందరిదో ఉపాధి చేజారిపోయింది. అంతటా రాబడులు రమారమి తగ్గాయి, జరుగుబాటు జఠిలమైంది. వలసపోయిన చోట కోవిడ్‌ దెబ్బకు వెనుదిరిగిన కోట్లాది కూలీలు, కార్మికులు నానాతంటాలు పడి సొంతూళ్లు చేరుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ–ఉపాధి చేజారిన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలిపుడు దిక్కు తోచని స్థితిలో అల్లాడుతున్నాయి. భవిష్యత్తు... అయితే మినుకు మిను కుమంటో, కాదంటే కారుచీకటిగానో కనిపిస్తున్న జీవితాలెన్నో! కొంద రయితే ‘కోవిడ్‌ తర్వాత..’ అని లెక్కలేస్తున్నారు. ‘ఇదో ఎడతెగని సమస్య, ఇప్పుడప్పుడే మందులు–టీకాలు రాకపోవచ్చు, మనం కరో నాతో సహజీవనం చేయాల్సిందే!’ అనే వాదన బలపడుతుంటే, ఇక ‘కోవిడ్‌ తర్వాత’ అనడానికేముంటుంది? అందుకే, ప్రభుత్వాలు కొన్ని ఉద్దీపన చర్యలు, ప్రత్యేక ఆర్థిక విధానాలూ ప్రకటించి విరుగుడు చర్యలు చేపట్టాయి. కోవిడ్‌ను తట్టుకొని ‘కొత్త సాధారణ స్థితి’ (న్యూ నార్మల్‌) తీసుకొచ్చే యత్నమిది. ఇంతే సరిపోతుందా? అనేది పెద్ద ప్రశ్న! ప్రతి సంక్షోభం మనను సమస్యల్లో ముంచినట్టే కొత్త అవ కాశాలూ తెస్తుందంటారు. అవి అందిపుచ్చుకొని, పాలకులు–పౌర సమాజం వ్యూహాత్మకంగా భవిష్యత్తును చక్కదిద్దుకోవాల్సి ఉంటుంది. 

కళ్లెదుట కఠోర సత్యం
ఈ దేశపు స్థూల జాతీయోత్పత్తి 2020లో మైనస్‌ 4.5కు పడిపోతుం దని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్మెఫ్‌) అంచనా! అదే జరి గితే 135 కోట్ల జనాభా ఉన్న దేశ పరిస్థితి దయనీయం. కొందరికిది అతిశయోక్తిగా కనిపించొచ్చు! ఉదాహరణకు కొన్ని రంగాల గురించే మాట్లాడుదాం. అచ్చంగా టూరిజం మీదే ఆధారపడ్డ దేశాలు ప్రపం చంలో సుమారు 50 వరకుంటే, మన దేశంలోనూ గోవా, కేరళ, హిమా చల్‌ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలదీ అటువంటి పరిస్థితే! టూరిజం ఎప్ప ట్లోగా కోలుకుంటుందో తెలియదు. దానిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉబర్, ఓలా వంటి కారురవాణా (క్యాబ్‌) వ్యవస్థల్లో లక్షల మంది ఉపాధిని కోవిడ్‌ దెబ్బతీసింది. సొంతూర్లో ఆస్తులో, నగా– నట్రో అమ్మి, లేదా అప్పు చేసి కొన్న వాహనంతో క్యాబ్‌ నడిపిన వాళ్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కొన్నేళ్లుగా ఈ దేశంలో ప్రయివేటు విద్యారంగం అపారంగా విస్తరించింది.

అక్కడ ఉపాధి వెతుక్కున్న లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది నేడు వీధినపడి కడగండ్లు చూస్తున్నారు. కోవిడ్‌ నీడన ఇప్పట్నుంచే బలపడుతున్న ‘డిజిటల్‌ విద్యా విధానం’లో వారి పరిస్థితి ఏమిటో? సినిమా, టీవీ, ప్రసార మాధ్యమ రంగాల్లో ఉద్యోగుల పరిస్థితీ డోలాయమానమే! ఐటీ, సేవలు వంటి రంగాల్లో డిజిటలైజేషన్‌ విస్తరణ, కృత్రిమ మేధా (ఏఐ) వనరుల్ని విరివిగా వినియోగించే ఆలోచనలు ఎక్కువమంది ఉపాధికి గండికొట్టేవే! ఒలంపిక్స్‌తో పాటు క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్‌ వంటి ఎన్నో క్రీడావేడుకలు రదై్ద ఆ రంగమూ చిన్నబోయింది. చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, హోటల్, ఆహార పరిశ్రమల్లో ఇప్పటికే ఉద్యో గాలూడాయి. మున్ముందు మరిన్ని ఉద్యోగాల కోత అనివార్యంగా కని పిస్తోంది. అల్పాదాయ వ్యాపార, ఉద్యోగ వర్గాల్లోనూ తీరని ఆందోళన ఉంది. ఒకవైపు జీవన వ్యయం పెరిగి మరోవైపు రాబడి తగ్గిన దయ నీయ స్థితి వారి జీవన ప్రమాణాలపై పెద్ద దెబ్బే!

వలస కూలీలదో ధీనగాథ
గ్రామాల నుంచి నగరాలకు సాగే కోట్లమంది వలసలతో దేశంలో ఈ దశాబ్ది రికార్డు నెలకొల్పనున్నట్టు లోగడ కొన్ని అధ్యయనాలు వచ్చాయి. కానీ, కోవిడ్‌ దెబ్బకు పరిస్థితి తారుమారైంది. సుమారు పది నుంచి పన్నెండు కోట్ల మంది తిరుగు వలసలతో స్వస్థలాలకు చేరారు. లాక్‌డౌన్‌ రోజుల్లో ఉన్నచోట ఉపాధి లేక, పొట్ట గడవక వందలు వేల కిలోమీటర్లు కాలినడకనో, కాళ్లావేళ్లా పడితే దయామ యులెవరో కూర్చిన వాహనాల్లోనో కనాకష్టంగా సొంతూళ్లకు చేరిన వలస కూలీలది నేడో విచిత్ర పరిస్థితి! ఉన్నచోట ఉపాధి లేకే నాడు పొట్టచేత పట్టుకొని పట్టణాలు, నగరాల దారి పట్టారు. కోవిడ్‌ దెబ్బకు విధిలేక అక్కడ్నుంచి వెనుదిరిగి వచ్చారు. ఏ చట్టాలు, ఏ ప్రభుత్వాలు, చివరకు సకాలంలో ఏ న్యాయస్థానాలూ తమ బతుక్కు భరోసా కల్పించలేకపోయాయన్న కోపం వారిలో ఉంది. ‘పరువుగా, పదిలంగా వారిని ఉచితంగానే స్వస్థలాలకు చేర్చండి’ అని సుప్రీంకోర్టు పురమా యించేనాటికే అత్యధిక కూలీలు చావు బతుకుల నడుమ గమ్య స్థానాలు చేరారు.

తగినంత పని ఉండాలి, పనికోసం ఇప్పుడు స్థాని కంగా ఉన్న కూలీలతో వారు పోటీ పడాలి. ఇది అంత ఆశాజనకమైన స్థితేం కాదు! ఆర్థిక పరిస్థితి పుంజుకుంటున్న క్రమంలో తాము వదిలి వచ్చిన చోట్ల అవకాశాలొచ్చి మళ్లీ రమ్మని పిలిచినా వారు వెళ్లే స్థితిలో లేరు. ఎంత మంది ఏయే రాష్ట్రాలకు వలస వెళ్లి, వెనుదిరిగి వచ్చారో ఆయా రాష్ట్రాల్లో సరైన లెక్కపత్రాలు లేవు. ఉండాలని ‘అంతర్రాష్ట్ర వలస కూలీల చట్టం 1979’ నిర్దేశిస్తున్నా పాలకులెవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడొక పునరాలోచనలో పడింది. ‘అసంఘటిత కూలీల గుర్తింపు సంఖ్య’ (యుడబ్లు్యఐఎన్‌) ఇవ్వడం ద్వారా వారి లెక్కలు నిర్వహించాలనుకుంటోంది. తద్వారా వారిలో నైపుణ్యాల వృద్ధి, భాషా గణాంకాలు, పని ఉండే చోట్లకు తరలించే ఆస్కారం ఉంటుందనేది ఆలోచన.

నిట్టూరుస్తున్న నిర్మాణరంగం
కోవిడ్‌ దెబ్బకు ఉత్పత్తి రంగంతో పాటు నిర్మాణరంగం కూలీలను కోల్పోయింది. కష్టకాలంలో కనీస బాధ్యత చూపకుండా వలసకూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు అంతకంత అనుభవిస్తున్నారు. స్వస్థలాలకు తిరుగుముఖం పట్టకుండా వారిని అట్టే పెట్టుకోవడానికి ఏవైనా ప్రత్యామ్నాయాలు ఆలోచించి ఉండాల్సింది. కోవిడ్‌ స్థితిలో నిర్మాణ వనరుల ధరలు పెరగడంతో పాటు కూలీల కొరత ప్రధాన సమస్యగా ఉందిపుడు. ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి హామీ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ‘గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ వంటివి పకడ్బందిగా అమలయితే ఊళ్లకు వెళ్లిన అత్యధిక వలస కూలీలు పట్టణాలు, నగరాలకు మళ్లీ రాకపోవచ్చు. అమల్లో ఉన్న పది పథకాల్ని సమ్మిళితం చేసి 50వేల కోట్లతో ఈ అభియాన్‌ను కేంద్రం ఇటీవలే ప్రకటించింది.

వలస కూలీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాది 6 రాష్ట్రాల్లో పని కల్పించాలనేది యోచన. దేశవ్యాప్తంగా నిర్మాణ కూలీల నుంచి ‘సెస్‌’ రూపంలో వసూలు చేసిన పెద్దమొత్తాలు ఖర్చుకాక ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద మూలుగుతున్నాయి. నిజానికి ఆ నిధుల్ని ఆయా ప్రభుత్వాలు కార్మికబోర్డులకు బదిలీ చేయాలి. కూలీల కుటుంబాల్లో పెళ్లిల్లు, గృహనిర్మాణం, విద్య–వైద్యం వంటి అత్యవ సరాల్లో వారు వాడుకోవచ్చు. కోవిడ్‌ కష్టకాలంలో అదైనా వాడి కూలీ లను ఆదుకొని ఉండాల్సింది. ఇలా 19 రాష్ట్రాల్లో రూ. 6707 కోట్లు వసూలు చేయగా రూ. 2777 కోట్లు మాత్రమే బోర్డులకు బదలా యించారు. అందులోనూ రూ.1632 కోట్లు మాత్రం వ్యయం చేశారు. 

నైపుణ్యాలే భవితకు భరోసా
తిరుగు వలసలు భారత్‌ను పటిష్ట పరిచే ఓ గొప్ప అవకాశం కావాలి. కొత్తగా ఉపాధి వెతుక్కునే క్రమంలో... గ్రామీణ భారతాన్ని పరిపుష్టం చేసే చిన్న పట్టణాల్లో (5వేలకు పైబడ్డ జనాభా) ఉత్పత్తి, సేవా రంగాల్ని వారు సమృద్దం చేయాలి. ఇందుకు యువతలో నైపుణ్యాల వృద్దికి తగు శిక్షణ–ప్రోత్సాహకాలతో ప్రభుత్వాలు చిత్తశుద్దితో కృషి చేయాలి. ఆ పేరుతో ఇప్పటిదాకా చేసిందంతా డొల్ల! ఎక్కువశాతం, పలుకుబడి కలిగిన పైరవీకారుల జేబులు నింపడానికే ఈ శిక్షణా కార్య క్రమాలు దోహదపడ్డాయి. అది కూడా నామమాత్రం. జాతీయ నైపు ణ్యాభివృద్ది సంస్థ (ఎన్నెస్డీసీ) నిద్రలేవాలి. ‘ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన’ (స్కిల్‌ ఇండియా) కింద 2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్యాల వృద్దిలో శిక్షణ ఇవ్వాలన్నది లక్ష్యం. ఇప్పుడున్న కూలీ/కార్మిక శక్తిలో కేవలం 2 శాతమే శిక్షణ పొందారు.

యువతలో నాలుగింట మూడొంతులు అసలు నమోదే చేసుకోలేదు. ప్రపంచం లోనే అత్యధిక యువత ఉన్న దేశం దుస్థితి ఇది! మన నైపుణ్యాలు– ఔత్సాహిక పారిశ్రామికుల వృద్ధి జాతీయ విధానం (ఎన్పీఎస్డీఈ) 2015లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం 2020 నాటికి భారతీయుల సగటు వయసు 29 సంవత్సరాలు. అంటే, అమెరికా (40), ఐరోపా (46), జపాన్‌ (47) కంటే ఎంతో మెరుగైన యువశక్తి ఈ దేశ సంపద! దాన్ని సద్వినియోగ పరచాలి. తగు శిక్షణతో పాటు పరిశ్రమల్లో ఉద్యోగ–ఉపాధి ఆవకాశాలు కల్పించాలి. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలయ్యేలా రుణవసతి కల్పించి ప్రోత్సహించాలి. ఎన్నో దేశాలు ఉత్పత్తి కేంద్రాన్ని చైనా నుంచి తరలించాలనుకుంటున్న తరుణంలో మనం ప్రపంచ పెట్టుబడుల్ని ఆకర్శించాలి. దేశ యువతలో నైపు ణ్యాల్ని వృద్ది చేసి మనను మనమొక ప్రపంచ ఉత్పత్తి–సేవా కేంద్రంగా మలచుకోవాలి. అదే కోవిడ్‌ కొట్టిన దెబ్బకు విరుగుడు అవుతుంది. భారత్‌ ఓ బలమైన శక్తిగా నిలుస్తుంది.

దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement