చంద్రబాబుకు చాలా అనుభవం ఉండవచ్చు కానీ, దాన్ని ఏ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారన్నదే ప్రశ్న! ప్రత్యేకహోదా వదులుకోవడంలోనా? కేంద్ర నిధుల్ని సాధించలేక పోవడంలోనా? ఫిరాయింపుల్లో ఆరితేరిపోవడంలోనా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ ధోరణి రోజు రోజుకు వికృతరూపం దాలుస్తున్నది. అందుకు జన్మభూమి కార్యక్రమాల నిర్వహణ తీరుతెన్నులే అతిపెద్ద ఉదాహరణ. ప్రభుత్వం ప్రజాధనాన్ని వెచ్చించి నిర్వహించే జన్మభూమి కార్యక్రమాల్ని పూర్తిగా పార్టీ కార్యక్రమంగా ఉపయోగించుకోవడం అందరికీ కన్పిస్తూనే ఉంది. రాజ్యాంగ పరంగా గ్రామీణ ప్రాంతంలో అయితే సర్పంచ్, పట్టణ ప్రాంతంలోనైతే కార్పొరేటర్ అధ్యక్షత వహించాల్సిన ‘జన్మభూమి’ కార్యక్రమంలో వారెక్కడా కన్పించడం లేదు. జన్మభూమి సభా వేదికలో బాబు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది?
కడపజిల్లా పులివెందులలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సీఎం బాబు అనుసరించిన వైఖరి ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. జన్మభూమి అభివృద్ధి వేదికలేతప్ప రాజ కీయ వేదికలు కాదని సుద్దులు చెబుతున్న సీఎం ఎందుకు పులివెందులలో జరిగిన జన్మభూమి వేదిక నుంచి రాజకీయాలు మాట్లాడారు? గండికోట ప్రాజెక్టుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే రూపకల్పన జరిగిందని.. రూ. 1,300 కోట్లల్లో రూ. 1,100 కోట్లు ఖర్చు చేశారని కడప లోక్‌సభ సభ్యుడు అవినాష్‌రెడ్డి వివరిస్తుంటే, ఆయనను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది?
బాబు మాట్లాడుతున్న ప్రతిమాట, వేస్తున్న ప్రతి అడుగు రాజ్యాంగ విరుద్ధంగా సాగిపోవడాన్ని ఎవరైనా ఎలా సహించగలరు? వ్యక్తిగత స్వార్థంతో పనిగట్టుకొని పాలనా వ్యవస్థల్ని పతనావస్థకు చేరుస్తుంటే ఏవిధంగా ఉపేక్షించగలం? గత మూడున్నరేళ్లుగా శీతాకాల శాసనసభా సమావేశాల్ని 45 రోజులు మించి నడపని ప్రభుత్వం.. ఈసారి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ సమావేశాల్ని బహిష్కరించడంతో, సభను ఏకపక్షంగా 12 రోజులపాటు నడిపారు. సభలో ఎటువంటి నిర్మాణాత్మకమైన చర్చ లేకుండానే మొత్తం 16 బిల్లులు ఆమోదించుకొన్నారు. ఒక్క రోజు లోనే 10 బిల్లుల్ని చుట్టేశారు.
రాష్ట్రంలో 12%గా ఉన్న ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదు? ఎస్టీలకు మంత్రి ఉండాల్సిన అవసరం లేదా? ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్ని గంపగుత్తగా ఒకటో, రెండో కులాలకు పందేరం చేయకుండా అందరికీ సముచిత భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? కాపులకు 5% రిజర్వేషన్లు అందించే అంశంలో జస్టిస్ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్ నివేదిక అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించక ముందే.. కమిషన్‌లో మెంబర్ సెక్రటరీగా ఉన్న ఓ వ్యక్తి ద్వారా దొడ్డిదారిన నివేదికను తెప్పించుకొని.. దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన తీరు బాబు రాజకీయ ఎత్తుగడగానే కనిపించింది తప్ప కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి గోచరించలేదు. పైగా, అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం కేంద్రానికి ఇప్పటివరకూ అందకపోవడంలో ఆంతర్యం ఏమిటి?
‘పోలవరం’ ప్రాజెక్టును తలకెత్తుకోవడంలో కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యం కంటే, వేలకోట్ల ముడుపులు దండుకోవడానికి ప్రాజెక్టును తానే పూర్తి చేశానని చెప్పుకోవాలన్న బాబు దుర్భుద్ధి కారణంగానే.. నేడు ‘పోలవరం’ వివాదాస్పదంగా మారింది. అయితే.. పోలవరం అంశంలో.. కేంద్ర ప్రభుత్వం.. బాబు రాజకీయ ఉచ్చులో ఇరుక్కోవడానికి సిద్ధంగా లేకపోవడంతోనే.. ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్నట్టుగా తీగతోపాటు డొంకంతా బయటకు వస్తోంది. ప్రభుత్వంలో పెద్దఎత్తున జరుగుతున్న అవినీతిపై కేంద్రానికి స్పష్టమైన సమాచారం అందినందునే.. పోలవరంతో సహా అనేక పథకాలకు కేంద్రం నిధుల మంజూరును నిలిపివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తన వైపునుంచి ఇవ్వాల్సిన యుటిలిటీ సర్టిఫికేట్లు (యుసిలు) అందించకపోవడం, ప్రభుత్వపరంగా చొరవ లోపించడంతో.. పోలవరంతోపాటు అనేక పథకాలకు కేంద్ర నిధులు తగ్గిపోయాయి. మొత్తం 45 కేంద్ర పథకాల్లో 42 పథకాలకు కనిష్టస్థాయి నిధులు కూడా రాబట్టుకోలేకపోవడం బాబు పరిపాలనా వైఫల్యానికి తార్కాణం. రాష్ట్రంలో గాడితప్పిన పరిపాలనకు బాధ్యత వహించాల్సిన బాబు తన వైఫల్యాలను అధికార యంత్రాంగంపై, కొంతమంది ఐఏఎస్ అధికారులపై నెట్టివేసే ప్రయత్నాన్ని ఎంతో తెలివిగా చేస్తున్నారు. తానొక్కడే కష్టపడుతుంటే.. అధికార యంత్రాంగం సహకరించడం లేదని ప్రజలకు పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. నిజానికి, రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని అధికారయంత్రాంగం ప్రయత్నిస్తుంటే గండి కొడుతున్నదే బాబు.
ఇక ‘జనసేన’ పవన్‌కల్యాణ్ అయితే ఇప్పటికీ బాబు అనుభవం గురించి మాట్లాడుతున్నారు. కానీ, దాన్ని ఏ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారన్నదే ప్రశ్న! ఈ మూడున్నరేళ్లల్లో.. బాబు అనుభవం దేనికి పనికొచ్చింది? రాష్ట్రానికి ప్రత్యేకహోదా వదులుకోవడంలోనా? విభజన బిల్లులోని అంశాలను, కేంద్ర నిధుల్ని సాధించలేకపోవడంలోనా? ఫిరాయింపుల్ని ప్రోత్సహించి.. కొందరికి మంత్రి పదవులు కట్టబెట్టి రాజ్యాంగ విలువల్ని పరిహాసం చేసేందుకా? వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షనేతల్ని దబాయించడంలోనా? దేనిలో బాబు అనుభవం పనికొచ్చింది? పుష్కరాల్లో, పడవ ప్రమాదాల్లో, పోలీస్ ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నా.. దానికి ఎవరూ పూచీ వహించరంటే భరించాలా? ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర అభివృద్ధికి అక్కరకు రాని అనుభవం కంటే నిజాయితీ, చిత్తశుద్ధి గల నాయకత్వమే రాష్ట్రానికి మేలు చేస్తుంది.
- సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ ఎంపీ ‘ మొబైల్ : 81069 15555
Comments
Please login to add a commentAdd a comment