సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మన లైన్‌లోనే ఉన్నారని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఎవరూ విమర్శలు చేయవద్దని పార్టీ నేతలను ఆదేశించారు. పవన్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని, రాజకీయ సంబంధాలను ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు బయటపెట్టినట్టయింది.
టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో భాగంగా అమరావతిలో చంద్రబాబు గురువారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పట్ల పార్టీ నేతలు అనుసరించాల్సిన వైఖరి పట్ల బాబు స్పష్టత ఇచ్చారు. అవసరమైన సమయంలో పవన్ మనకు అండగా ఉంటారని, ఆయన విషయంలో సున్నితంగా స్పందించాలని బాబు హితబోధ చేసినట్టు సమాచారం. పవన్ తాజాగా ప్రకటించిన జేఎఫ్‌ఎఫ్‌సీతో తమకెలాంటి ఇబ్బంది ఉండదని కూడా తెలిపినట్టు తెలుస్తోంది.
విభజన హామీల సాధన, ప్రత్యేక హోదానే లక్ష్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీల రాజీనామాల అస్త్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడ్డ టీడీపీ.. కార్యాచరణ లేకుండా లీకులతో కాలయాపన చేయాలని భావిస్తోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తామే ఏదో చేస్తున్నామని ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు నానా కష్టాలు పడుతున్నారు. అందులో భాగంగానే పార్టీ సమన్వయ కమిటీ భేటీ పేరిట మీడియాకు లీకులు ఇస్తున్నారు.
ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించినందున.. ప్రత్యేక హోదా గురించి ఇక ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంపై, బీజేపీపై నేరుగా ఆరోపణలు చేస్తే సమస్యలు వస్తాయని, కేంద్రానికి కోపం రాకుండా వ్యవహరించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీకి మైలేజీ రాకుండా ఎదురుదాడి చేయాలని, అదే సమయంలో కేంద్రంతో వివాదం పెట్టుకోకుండా.. రాజీనామాల ప్రకంపనలు చల్లారేదాకా కాలయాపన చేయాలని పార్టీ నేతలకు ఆయన హితబోధ చేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment