భారతీయ సివిల్ సర్వీసుల తుది ఫలితాలు వెలువడగానే అంతిమవిజేతలకు, ర్యాంకర్లకు ప్రత్యేక అభినందన సభల ఏర్పాటు, మీడియాలో వారి విజయగాథల ప్రసారం వంటి నూతన ధోరణులు చోటుచేసుకోవడం అభినందనీయమే. 2017 సివిల్ సర్వీసుల తుది ఫలితాలలో ప్రథముడిగా నిలిచిన తెలంగాణ అబ్యర్థిని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. పరీక్షలో తెలంగాణ ప్రతిష్టను నిలబెట్టినట్లే విధి నిర్వహణలో కూడా రాష్ట్ర ప్రత్యేకతను చాటాలని అతనికి సూచించారు. సివిల్ సర్వీసుల పరీక్షలు రాసే తెలంగాణ అభ్యర్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను స్థాపించాలని, ఇంటర్వ్యూకు వెళ్లేవారికోసం నిపుణులచే శిక్షణ ఇప్పించాలని కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. అమలైతే ఇదొక ఆదర్శవంతమైన కార్యక్రమం అవుతుంది.
అయితే వర్తమానంలో మన సివిల్ సర్వీసు వ్యవస్థ నడుస్తున్న వాస్తవ తీరును కూడా విశ్లేషించాలి. సివిల్ సర్వెంట్లు ఏయే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు, వారేం సాధించారనే పురోగతికి సంబంధించిన సూదిమొనంత సమాచారం కూడా ప్రజలకు అందలేదు. ఉన్నతోద్యోగుల నిబ ద్ధతతో పాటు వారు వృత్తిగతంగా సాధించిన విజ యాలను కూడా ప్రజలకు తెలియచేయకపోతే సివిల్ సర్వీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో అనుమానాలు తలెత్తే అవకాశముంది. ఐఏఎస్ సాధించాలనే ప్రయత్నంలో ఒక ఐపీఎస్ ట్రెయినీ అవినీతికీ పాల్పడుతూ పరీక్షల్లో రహస్య ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడ్డ ఇటీవలి సంఘటన సివిల్ సర్వీసుల ఎంపిక నిబద్ధతను ప్రశ్నార్థకం చేసింది.
ఏ కొద్దిమందినో మినహాయిస్తే ఎక్కువశాతం అభ్యర్థులు ప్రోత్సాహక పరిసరాలు, వనరుల పరిపుష్టి, పరీక్ష పట్ల స్పష్టమైన అవగాహనం ఉన్నవారు మాత్రమే సివిల్ సర్వీసుల్లో విజయం సాధిస్తున్నారు. ప్రైవేట్ విద్యాలయాలు, కార్పొరేట్ కళాశాలలు, ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో చదివి, సమస్యలు బాధ్యతలు లేని ప్రేరణాత్మక వాతావరణానికి నోచుకున్న వారికి మాత్రమే సివిల్ సర్వీసుల్లో ప్రవేశం సాధ్యపడుతోంది. కానీ విజేతలవుతున్న గ్రామీణ అభ్యర్థులు చాలా కొద్దిమందే. వారు కూడా తమ ఊళ్లనుండి వసతులు లభ్యమవుతున్న ప్రదేశాలకు తరలి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
సిలబస్‌లోని ప్రతి అంశానికి సంబంధించిన విస్తృత సమాచారం, అవగాహన, పరీక్షలో సమాధానాలను ప్రభావవంతంగా రాయగల నేర్పు, లక్ష్యాత్మకంగా అలవర్చుకున్న మానవీయ వ్యక్తిత్వాన్ని ఇంటర్వ్యూలో
ప్రదర్శించే ప్రతిభ వంటి నైపుణ్యాలన్నీ నూరు శాతం గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థుల్లో కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఐతే ప్రోత్సాహక వాతావరణ లేమి, అహగాహనా రాహిత్యం, ఆర్థిక పరిమితులు, సాధనాత్మక ప్రేరణ కొదువల కారణంగా గ్రామీణ అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు నోచుకోవడం లేదు. దీంతో మన దేశంలో సివిల్ సర్వీసులకు సంబంధించి అందుబాటులో ఉన్న వసతుల తోడ్పాటుతో ఎంపికను సాధించి అవకాశాలను పొందుతున్న వారు, వసతులకు నోచుకోక అవకాశాలను కోల్పోతున్న వారనే రెండు వర్గాలు పుట్టుకొచ్చి సంఘర్షణాత్మక అగాథం ఏర్పుడుతోంది.
సివిల్ సర్వీసుల్లలో ప్రవేశానికి గ్రామీణ అభ్యర్థులకు ఇవ్వాల్సిన చేయూతను ఒక మహా యజ్ఞంలా కొనసాగించాలి. 2017 సివిల్ సర్వీసుల పరీక్షలో తొలి 25 ర్యాంకులను సాధిం చివారు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, విశ్వవిద్యాల యాల్లో చదివారు. అయినప్పటికీ 9 మంది ఫిజి కల్లీ ఛాలెంజెడ్, 8 మంది విజువల్లీ ఛాలెంజ్డ్, 12 మంది వినికిడి సమస్య ఉన్న అభ్యర్థులు కూడా ఈసారి విజేతల్లో ఉన్నారనే వాస్తవం తెలిస్తే ఎవరిలోనైనా విశ్వాసం ఉబికి వస్తుంది. కాబట్టి తెలంగాణ సీఎం ప్రతిపాదించిన శిక్షణను కేవలం ఇంటర్వ్యూ అభ్యర్థులకే కాకుండా అన్ని స్థాయిల్లో ఇవ్వాలి. ప్రభుత్వం, విద్యాసంస్థలు దీక్షబూని గ్రామీణ విద్యార్థులకు కూడా సివిల్ సర్వీసుల్లో ఎంపికయ్యేలా శిక్షణ నిస్తే పరిపాలనలో పల్లెటూళ్ల ప్రతిభ మెరుస్తుంది. గ్రామీణ భారతావని పులకరిస్తుంది.
వంగీపురం శ్రీనివాసాచారి, ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ (మొబైల్ : 99480 90051)
Comments
Please login to add a commentAdd a comment