నేతన్నల వెతలు తీరేదెన్నడు? | Guest Columns On Problems Of Handloom weavers In India | Sakshi
Sakshi News home page

నేతన్నల వెతలు తీరేదెన్నడు?

Published Wed, Aug 7 2019 2:07 AM | Last Updated on Wed, Aug 7 2019 2:07 AM

Guest Columns On Problems Of Handloom weavers In India - Sakshi

భారతదేశంలో వ్యవసాయం తర్వాత నేత వృత్తిలోనే అధికంగా ప్రజలు ఆధారపడి ఉన్నారన్నది నిర్వివాదాంశం.. రైతన్నలను ఆదరిస్తున్న ప్రభుత్వాలు నేతన్నలపై మాత్రం సవతితల్లి ప్రేమను ఎందుకు కనపరుస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు.. భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు కళా నైపుణ్యాన్ని ప్రతిబింబించే చేనేత వృత్తిని ఆదరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. నేలకొరుగుతున్న నేతన్నలను వారి కుటుంబాలను అక్కున చేర్చుకోవాల్సిన నైతిక బాధ్యతతో బాటు వారికి ఆదరణ అందించాల్సిన ఆవశ్యకత కూడా మనపైనే వుంది.. అద్భుతమైన చేనేత వస్త్రాలను తయారు చేయడంలో నేతన్న పడుతున్న కష్టం మనందరికీ  తెలి సిందే, మానవాళికి అద్భుతమయిన వస్త్రాలను అందిస్తున్న నేతన్న, తాను కప్పుకోవడానికి బెత్తెడు గుడ్డ కూడా లేకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు, జీవనపోరాటంలో ఓడిపోయి చివరకి చనిపోయినా సొంతింట్లో అంతిమ దహన సంస్కారాలకు కూడా నోచుకోలేక పోతున్నాడు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించక ముందు నేతన్నల ఆత్మహత్యలు అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ తోనే ఈ విషమ పరిస్థితులకు పరిష్కారం దొరుకుతుం దని నేతన్నలు భావించారు. నేతన్నల ఆత్మహత్యలు కాస్త కొన్ని పార్టీలకు రాజకీయ అవకాశాలుగా మారాయి. కొత్త తెలంగాణ రాష్ట్రం సిద్ధిం చింది. గంపెడు ఆశలతో వున్న నేతన్నలకు తెలం గాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్లలోపెద్ద ఎత్తున కేటాయింపులు ప్రకటించింది. అయినా గ్రామాల్లో నేతన్నల ఆశలు నెరవేరక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా 350 మంది నేతన్నలు ఆత్మహత్యలు, అనారోగ్య కారణాలతో మృత్యువాతపడ్డారు. రెండు వేల మంది కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. వేలమంది వృత్తిని కోల్పోయారు.. ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలు అటుకెక్కింది. ఎన్నోమార్లు ప్రభుత్వానికి, చేనేత జౌళి శాఖ అధికారులకు సమస్యలను విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. 

తెలంగాణ ప్రభుత్వం గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా రైతన్నల మాదిరిగా నేత కార్మికులందరికి 5 లక్షల రూపాయల  జీవిత బీమాను ఉచితంగా అందించాలి.. కేంద్ర ప్రభుత్వం నేతన్నల ఆత్మహత్యలపై ఎంక్వైరీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. మృతి చెందిన 350 నేత కార్మికులకు పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి.. నేతన్నల ఆరోగ్యాలను పరిరక్షించడానికి ప్రతి నేతన్న కుటుంబానికి రూ. 5 లక్షల విలువైన హెల్త్‌ కార్డ్‌ను ఉచితంగా అందించాలి.. నేతన్నలకు ప్రభుత్వం సాలీనా 30 వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించాలి.. కేంద్ర ప్రభుత్వం నేతన్నలు వినియోగించే నూలు, రంగులు, రసాయనాలపై జీఎస్టీని వెంటనే రద్దుచేయాలి.. ప్రభుత్వం నేతన్నలకు అధిక గిట్టుబాటు ధర కల్పించి ప్రస్తుత కూలీ రేట్లు పెంచాలి.. కేంద్ర ప్రభుత్వ చేనేత జౌళి శాఖ పథకాలన్నీ తెలంగాణలో అమలయ్యేలా చూడాలి. చేనేత వ్యవస్థపై ఆధారపడిన మహిళలకు స్వయం సమృద్ధి పథకాలు రూపొందించి వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రభుత్వాలు శిక్షణ, ఆర్ధిక తోడ్పాటు అందించాలి. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వలసపోయిన లక్షలాది మంది చేనేత కార్మికులకు వరంగల్‌ కేంద్రంగా ఉపాధి కల్పిం చాలి.. దీనికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కావలసిన నిధులు కేటాయించాలి.

తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలకు జీవిత బీమా ఏర్పాటుకు ప్రభుత్వానికయ్యే ఖర్చు కేవలం పది కోట్ల రూపాయలు మాత్రమే.. ఇంత ప్రాముఖ్యత గల విషయాలను పక్కనబెట్టి  ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లో 1,273 కోట్ల రూపాయలు ప్రకటించడం వలన నేతన్నలకు ఒరుగుతున్నదేమిటి..? ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఆత్మ విమర్శ చేసుకోవాలి.. ‘ఆకొన్న కూడె యమృతము తానొంచక నిచ్చు వాడే దాత’ అన్న సుమతి శతకం లోని భావంలా ఆకలితో ఎదురుచూపులు చూస్తున్న నేతన్నలకు ఇప్పుడు కావాల్సింది కడుపు నింపే మాటలు కాదు.. చేతిలో రెండు అన్నం ముద్దలు, వారి కుటుంబాలలో చిరునవ్వులు, ఇది గమనించకుండా తమ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించే  ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు  వ్యవహరిస్తే ఎప్పటికయినా తగిన మూల్యం చెల్లిం చుకోక తప్పదు. ప్రభుత్వాలు సహకరిస్తే నేతన్నలు వారి ఋణం వుంచుకోరు. వారిని ఆదరిస్తే తప్పకుండా పాలకులను నిండు మనస్సుతో తిరిగి దీవిస్తారు.. (నేడు చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా)

వ్యాసకర్త: దాసు సురేష్‌; చైర్మన్, చేనేతల ఐక్య కార్యాచరణ కమిటీ  
మొబైల్‌ నంబర్‌:  91773 58286

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement