రైతు రక్షకుడే రాజు | K Ramachandra Murthy Guest Column On Telangana Formation Day | Sakshi
Sakshi News home page

రైతు రక్షకుడే రాజు

Published Sun, Jun 3 2018 12:52 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

K Ramachandra Murthy Guest Column On Telangana Formation Day - Sakshi

తెలంగాణ రాష్ట్రం నాలుగేళ్ళు నిండి అయిదో సంవత్స రంలో అడుగుపెడుతున్న శుభసందర్భంలో చెప్పుకోదగిన సకారాత్మకమైన పరిణామాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేక  రాష్ట్ర సాధనకోసం సాగిన సుదీర్ఘమైన ఉద్యమానికి సమర్థ నాయకత్వం వహించి, అనితరసాధ్యమైన రాజకీయ చాతు ర్యం ప్రదర్శించి, లక్ష్యం సాధించడమే కాకుండా కొత్త  రాష్ట్రా నికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) పగ్గాలు చేపట్టి చరిత్రాత్మక పాత్ర పోషిస్తున్నారు. దీక్షాదక్షతలు, తెలివితేటలు, చొరవతో పాటు అదృష్టం కలిసి రావడంతో ఆయన కత్తికి ఎదురు లేకుండా జైత్రయాత్ర సాగి స్తున్నారు.

కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకొని ఒంటరిగా పోరాడి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం, హైదరా బాద్‌ మునిసిపల్‌ ఎన్నికలలో ఘనవిజయం సాధించడం, హైదరాబాద్‌లో పదేళ్ళు దర్జాగా ఉండవలసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆదరాబాదరాగా అమరావతి పంపించడం కేసీఆర్‌ విజయాలలో కొన్ని. ఒక ముఖ్యమంత్రి లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వ సాఫల్యవైఫల్యాలను అంచనా వేయడంలో రెండు పద్ధతులు పాటించడం ఆనవా యితీ. ఒకటి, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలలో ఎన్నింటిని, ఎంత బాగా అమలు చేశారనే ప్రాతిపదికగా పరిశీలించడం. రెండు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల లేదా ప్రభుత్వాల తీరుతెన్నులతో పోల్చి ఒక ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం స్థానం ఏమిటో నిర్ణయించడం.

రైతుపైనే దృష్టి  
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందులో ప్రస్తావిం చని అంశాలూ అమలు చేస్తున్నది. ఇటీవల ఎక్కువగా ప్రచా రంలో ఉన్న పథకం రైతుబంధు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్ప టికీ రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టకపోవడం అంద రికీ ఆందోళన కలిగిస్తున్న అంశం. నిజానికి ఇది జాతీయ సమస్య. అన్నదాతను ఆదుకోవడానికి తగినంత కృషి జరగ లేదన్నది వాస్తవం. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై స్వామి నాధన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను  కమిషన్‌ను నియమిం చిన యూపీఏ సర్కార్‌ పట్టించుకోలేదు. తాము చేస్తామని వాగ్దానం చేసిన బీజేపీ కూడా అధికారంలోకి వచ్చాక చేయ డం లేదు.  రాష్ట్రం నాలుగేళ్ళ సంబురాలు జరుపుకుంటున్న  సందర్భంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రచారాంశాలలో ప్రధా నంగా ప్రస్తావించేవి రైతులోకానికి చేసిన వాగ్దానాలే.

ప్రతి ఎకరానికి ఖరీఫ్, రబీ పంటలకు నాలుగు వేల రూపాయల వంతున ఏడాదికి రూ. 8 వేలు సాయం అందించే సంక్షేమ  కార్యక్రమానికి ఇటీవలే శ్రీకారం చుట్టారు. అనారోగ్యం వల్ల లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల జీవిత బీమా చెల్లించే విధంగా ప్రతిరైతుకూ బీమా సౌకర్యం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా బాండ్‌ సర్టిఫికేట్లు జారీ చేస్తామని అంటున్నారు. 24 గంటల విద్యుచ్ఛక్తి సరఫరా కొన్ని మాసాలుగా అమలు జరుగు తోంది. రైతుకు ఎన్ని వరాలు ప్రసాదించినా సొంత కాళ్ళ పైన నిలబడే పరిస్థితులు కల్పించే వరకూ అతడికి నిజమైన  రక్షణ లేదు.

ఎన్‌డీఏ ప్రభుత్వం నిరుడు ఆహారధాన్యాల ఎంఎస్‌పి ప్రకటించినప్పుడు లెక్కలు సరిగా లేవంటూ స్వామినాధన్‌ ఆక్షేపించారు. సేద్యానికి పెట్టిన ఖర్చు, వ్యవ సాయక్షేత్రంలో పని చేసిన కుటుంబసభ్యుల వేతనాలు కలిపి మొత్తం ఖర్చుగా లెక్కవేయాలని (ఏ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌– ఫ్యామిలీ లేబర్‌) ఒక సూత్రం చెబుతున్నది. ఈ ఖర్చులకు భూమి కౌలు కింద చెల్లించే మొత్తం కూడా కలపాలని (కాంప్రెహెన్సీవ్‌ మెజర్‌ ఆఫ్‌ కల్టివేషన్‌ కాస్ట్‌–సీ2) మరో సూత్రం చెబుతుంది. ఆ విధంగా లెక్కకట్టి దానిపైన 50 శాతం లాభం వేసి ఎంఎస్‌పి నిర్ణయించాలని సిఫార్సు.

ఎన్‌డీఏ ప్రభుత్వం మొదటి సూత్రాన్ని పరిగణనలోకి తీసు కొని మద్దతు ధర నిర్ణయించడంతో రైతులకు గిట్టుబాటు కాలేదు. కేంద్రం మద్దతు ధర నిర్ణయించిన వెంటనే ప్రభుత్వ సంస్థలు రంగంలోకి దిగలేదు. రైతుల నుంచి ఎంఎస్‌పి కంటే తక్కువ ధరకు  దళారులు కొన్న తర్వాత ఎంఎస్‌పి చెల్లించి వారి నుంచి ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేసిన సందర్భాలు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నాయి. మార్కెట్‌లో రైతుకు దగా జరగకుండా ప్రభుత్వం నిరోధించాలి. అదే విధంగా ఎకరానికి నాలుగు వేల  రూపా యల సాయంపైన కూడా విమర్శలు ఉన్నాయి. నాలుగైదు ఎకరాల లోపు కమతం ఉన్న  రైతు తన పొలం తాను దున్ను కుంటే ఎకరానికి నాలుగు వేలు కాదు పది వేలు ఇచ్చినా నష్టం లేదు. ఉద్యోగాలో, వ్యాపారాలో చేసుకుంటూ హైదరా బాద్‌లో నివసిస్తున్న భూముల యజమానులకు రైతుబంధు పథకం అనవసరం.

మాజీ కేంద్ర మంత్రి ఎస్‌ జైపాల్‌రెడ్డికి దాదాపు రెండు లక్షల సాయం ఎందుకు? ఆయన చెక్కు వాపసు చేశారు. అది వేరే విషయం. ఆ విధంగా ఎంత మంది చేస్తారు? హైదరాబాద్‌లో ఉంటున్నవారి భూము లను కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్న కౌలురైతుకు సాయం చేస్తే అర్థవంతంగా ఉండేది. కౌలు రైతులే శక్తికి మించిన పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నారు. యజమాను లకు కౌలు మొత్తం చెల్లిస్తున్నారు. బ్యాంకు రుణం సదు పాయం లేక ప్రైవేటు వడ్డీవ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు.

అప్పులపాలవుతున్నారు. కౌలు రైతు ఇంటికి  వడ్డీవ్యాపారి వెళ్ళి భార్యాపిల్లల ఎదుట అనరాని మాటలంటే అవమానభారంతో పొలానికి వెళ్ళి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్న కౌలు రైతులే అధికం. వారిని ఆదుకోవడానికి ఏదైనా పథకం ఆలోచిస్తే కేసీఆర్‌ చరితార్థుడయ్యేవారు. వ్యవసాయ సంక్షో భానికి దేశంలో ఎవ్వరూ పరిష్కారం కనుక్కోలేకపోతు న్నారు. భూమి రికార్డులు సరి చేయించడం, రైతులకు పాస్‌ పుస్తకాలు ఇప్పించడం వంటి కార్యక్రమాలు స్వాగతించవల సినవే. రైతుల బతుకులు పూర్తిగా బాగుపడాలంటే స్వామి నాధన్‌ కమిషన్‌ సిఫార్సులలో ఏ పంట పండించే రైతుకు ఏ సూత్రం లాభదాయకమో దానిని నిజాయితీగా అమలు చేయాలి. సేద్యం విషయంలో వ్యవసాయ విస్తరణాధికా రులు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చే విధంగా నియం త్రించి, మార్కెట్‌ వ్యవస్థను పటిష్ఠంగా నిర్మించి, పంటకు లాభసాటి ధర లభించేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసు కుంటే రైతు ఆత్మహత్యలు నిలిచిపోతాయి. వ్యవసాయ రంగం క్రమంగా శక్తి పుంజుకుంటుంది. ఆ పని కేసీఆర్‌ చేయగలిగితే ఆయన దేశానికి ఆదర్శంగా నిలుస్తారు.

సంక్షేమరాజ్యం
రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా పన్నుల ద్వారా వచ్చే ఆదా యంలో 20 శాతం వృద్ధి ఉంది. జీఎస్‌టీ ద్వారా కేంద్రం నుంచి అందే మొత్తం కూడా  క్రమంగా పెరుగుతోంది. ఐటీ, ఇతర సేవారంగంలోని వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతోంది. అందుకే సాలీనా సంక్షేమంపైన రూ. 40 వేల కోట్లు, నీటిపారుదల రంగంపైన రూ. 37 వేల కోట్లు ప్రభు త్వం ఖర్చు చేయగలుగుతోంది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ ప్రాజె క్టులను ప్రారంభించడం అభినందనీయం.

ఉద్యమ ఆకాం క్షలు నెరవేరడానికి తోడ్పతాయి. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం లోనే అత్యంత క్లిష్టమైనది. ఒకానొక ఇంజనీరింగ్‌ అద్భుతం.  కాళేశ్వరం ప్రాజెక్టుపైన చూపెడుతున్న శ్రద్ధ అవిభక్త మహ బూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మించే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపైన పెట్టడంలేదనే విమర్శ ఉంది. తెలంగాణ ప్రాంతం, ప్రజలు, కులాలు, వృత్తుల వంటి సమస్త అంశాలూ కేసీఆర్‌కు క్షుణ్ణంగా తెలుసు కనుక  వివిధ వృత్తులవారికి సాయం చేసే పలు పథకాలు చేపట్టారు. సంక్షేమరంగంలో చాలా పథ కాలు అమలు చేస్తున్నారు. ఉద్యమకాలంలో కేసీఆర్‌ పరుష పదజాలంతో బెదిరిపోయిన సీమాంధ్ర సంతతివారి భయాలు ఈ నాలుగేళ్ళలో తొలగిపోయాయి. అది మంచి పరిణామం. ఇందుకు కూడా కేసీఆర్‌నే అభినందించాలి. 

ప్రశంసించవలసిన అంశాలు అనేకం ఉన్నప్పటికీ విమ ర్శించవలసిన విధానాలు సైతం లేకపోలేదు. ఉద్యమాలపైన ఉక్కుపాదం మోపడం ఊహించని పరిణామం. ఇందిరా పార్క్‌ దగ్గర ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం అప్రజాస్వామికం. శాసనసభలో మెజారిటీ ఉన్నా విపక్షంనుంచి ఫిరాయింపు లను ప్రోత్సహించడం ఆక్షేపణీయం. ఖమ్మంలో మిర్చి రైతుల చేతులకు బేడీలు వేయడం తప్పు. పోయిన బడ్జెట్‌ సమావేశాలలో కాంగ్రెస్‌కి శాసనసభ్యులందరినీ సస్పెండ్‌ చేయడం కఠినమైన చర్య. సచివాలయానికి వెళ్ళకుండా ప్రగతిభవన్‌ నుంచే పరిపాలన సాగించడం ఎందుకో ప్రజ లకు అర్థం కాదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొదటి రోజు నుంచీ పోలీసు వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు తీసు కున్నది. శాంతిభద్రతలు మెరుగుపడినాయి.

కానీ కొన్ని నేరాలపైన దర్యాప్తు సాగుతున్నదో, ఆగిపోయిందో, ఆగి పోతే ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు తెలిసే అవకాశం లేదు. నయీం కేసు ఏమైందో, కోట్లకు ఓటు కేసులో దర్యాప్తు ఎందుకు నత్తనడక నడుస్తున్నదో, భూకుం భకోణాలపైన గట్టిచర్యలు ఎందుకు తీసుకోవడం లేదో తెలియదు. కాంగ్రెస్‌ నాయకులు బస్సు యాత్రలు చేస్తు న్నారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పార్టీ నెలకొల్పారు. వారికి లభిస్తున్న స్పందన టీఆర్‌ఎస్‌కు ఆందోళన కలిగిస్తున్న దాఖలా లేదు. టీఆర్‌ఎస్‌ అధినేత, ఇతర నాయకులు 2019లో తమదే విజయం అన్న ధీమాలో ఉన్నారు. ప్రజల మనస్సులో ఏమున్నదో తెలుసుకోవడం అంత తేలిక కాదు.  2004లో ‘ఇండియాషైనింగ్‌’ (భారత్‌ వెలుగుతోంది) ఇతి వృత్తంగా సాగిన ప్రచారార్భటి కారణంగా వాజపేయి నాయ కత్వంలోని ఎన్‌డీఏ గెలవడం తథ్యమని చాలామంది భావిం చాం. కానీ కాంగ్రెస్‌ గెలిచి యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది.

దక్షిణాది అధ్వానం  
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోల్చుకుంటే కేసీఆర్‌ తానే దేశంలో నంబర్‌ ఒన్‌ సీఎం అని చెప్పుకుంటే ఆక్షేపిం చనక్కరలేదు. ముఖ్యంగా దక్షిణాదిలో పరిస్థితి అధ్వానం.  తమిళనాడులో జయలలిత మరణం అనంతరం రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో బాబు ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తోంది. నాలుగేళ్ళలో చేసింది చూపించడానికి ఒక్కటీ లేదు. కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు ఇప్పుడే కుదుటపడుతున్నాయి. ఐటీ రంగం నుంచి తెలంగాణ కంటే చాలా అధికంగా కర్ణాటకకు ఆదాయం ఉన్నప్పటికీ సంక్షేమరంగంలో తెలంగాణ (తల సరి) ఖర్చు చేసినంతగా  కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయలేదు. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో తెలంగాణ ప్రభుత్వం అగ్రగామిగానే ఉంది. రాష్ట్రంలో రథం ఒడి దుడుకులు లేకుండా నడుస్తున్న కారణంగానే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషించాలనే ఉబ లాటంతో పావులు కదుపుతున్నారు. ఈ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయాణం ఎంత వరకూ ఎటువైపు సాగుతుందో స్పష్టత లేదు.

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి కనుక 1996–98 నాటి అనిశ్చిత పరిస్థితులలో నేషనల్‌ ఫ్రంట్‌ సమన్వయకర్తగా చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పగలిగారు. 2004లో, 2009లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎంపీలను వైఎస్‌ రాజ శేఖరరెడ్డి ప్రసాదించగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలం గాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో తెలుగు ముఖ్యమంత్రులకు మునుపటి ఆదరణ లభించడం కష్టం. 80 స్థానాలు కలిగిన యూపీలో అఖిలేశ్, మాయావతి, 42 సీట్లున్న పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ మర్యాదగా మాట్లాడుతారు కానీ వారు అంతిమంగా ఇచ్చే గౌరవం సంఖ్యాబలానికి తగ్గట్టే ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రమేయం లేకుండా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రస్తుతానికి సాధ్యం కాదు.

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవశ్యకతపై అంతగా మాట్లాడిన దేవెగౌడ చివరికి కాంగ్రెస్‌ మద్దతుతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు దోహదం చేశారు. ఉద్యమకాలంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగిన కేసీఆర్‌ అధికారం లోకి వచ్చిన తర్వాత ఎవ్వరినీ కలవకుండా, తనకు అవస రమైనవారితో మాత్రమే సంప్రదించి నిర్ణయాలు తీసుకుం టున్నారు. మంత్రులు, ఎంఎల్‌ఏలు సైతం ముఖ్యమంత్రిని కలవలేకపోవడం, మనసు విప్పి మాట్లాడలేకపోవడం మంచి వాతావరణం కాదు. వైఖరి మార్చుకుంటే  మరిన్ని వాస్తవాలు తెలుస్తాయి. పూర్తి అవగాహనతో నిర్ణయాలు చేయడం వల్ల  కేసీఆర్‌కీ, తెలంగాణ ప్రజలకూ మేలు జరుగుతుంది.

- కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement