భారతదేశం నానాటికీ ఆర్ధికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా దిగజారడానికి కారణం అవిద్య, అరాచకత్వం, మతతత్వం, స్త్రీ అణచివేత, కులతత్వం, అస్పృశ్యతాచరణ కొనసాగడమే. మోదీ మాటల్లో అంకెలు కనబడుతున్నంత పెద్దగా అభివృద్ధి లేదు. విపరీతమైన ముస్లిం ద్వేషం, అస్పృశ్యుల మీద తీవ్రమైన దాడులు, రాజ్యాంగ నిరసన, ప్రజాస్వామ్య లౌకికవాద భావజాలానికి గొడ్డలి పెట్టుగా మారాయి. భారతదేశంలో మానవ వనరులకు, ప్రకృతి వనరులకు, వ్యవసాయ భూములకు, విద్యావేత్తలకు, విద్యార్జనాపరులకు కొదవలేదు. వృత్తికారులు, దళితులు, ఆదివాసీయులు, ముస్లింలు, ఉత్పత్తి కారకులు వీరిని కులమత భావాలతో నిర్లక్ష్యం చేయడం వల్ల రాను రాను నిరాశా నిస్పృహలు కలుగుతున్నాయి. అలా కలిగించడమే ప్రభుత్వ ధ్యేయంగా మనకు కనిపిస్తుంది. ఆది భారతీయులైన ఆదివాసులు భారతదేశ ఉత్పత్తి రంగానికి పట్టుగొమ్మలు. అయితే భారత ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవన వ్యవస్థల మీద గొడ్డలి వేటు వేస్తున్నాయి.
అభివృద్ధి పేరుతో మల్టీనేషనల్ కంపెనీలకు ఆదివాసీలు తరాలుగా చేసుకుంటున్న భూములను, ఆవాసాలను ధారాదత్తం చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్లు భారతదేశానికి రాకపూర్వం ఆదివాసీలు స్వతంత్రులుగా ఉండే వారు. వారి భూములను, ఆవాసాలను బ్రిటిష్ వాళ్ళు ఆ తరువాత నల్లదొరలు కొల్లగొట్టడం ప్రారంభించారు. కొండలను, నదులను రక్షించే సంస్కృతి వారిది. కొండలను తవ్వి పడేసి, నదులను కల్మషం చేసే సంస్కృతి పాలక సంస్కృతి, ఈనాడు గంగా, యమునా నదులన్నీ కల్మషమైపోయి వున్నాయి. డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ ప్రధానంగా రాజ్యాంగ నిర్మాణ సభ్యుడయిన జైపాల్ సింగ్ ముండా కృషివలన ఆదివాసుల హక్కులు, వాటి రక్షణకు సంబంధించిన నిబంధనలన్నింటిని రాజ్యాంగంలోని 5వ షెడ్యూలులో చేర్చి, కట్టుదిట్టం చేశారు. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ 1965–66 వరకు భారత పాలక వర్గాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోగా, ఆదివాసుల పట్ల బాధ్యతా రాహిత్యాన్ని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. పర్యావరణ పరిరక్షణలో అద్వితీయమైన కార్యాచరణ రూపొందించిన ఆది వాసుల్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత మరిం తగా అణగదొక్కడమే గాక వారిని హిందుత్వీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం భారతదేశంలో ఉపాధి కూలీలుగా వున్న దళితులకు భూమి హక్కు ఇవ్వడం లేదు. మోదీ ప్రభుత్వంలో దళితులకు ఒక్క ఎకరం భూమి కూడా పంచకపోగా, లక్షలాది ఎకరాల దళితుల భూమిని భూస్వాములు, పారిశ్రామిక వేత్తలు కొల్లగొట్టారు.
ఇకపోతే అన్ని విశ్వవిద్యాలయాల్లో దళిత, ఆదివాసీ, ముస్లిం విద్యార్థుల మీద తీవ్రమైన దమనకాండ జరుగుతుంది. భావజాల పరంగా, భౌతి కంగా విశ్వహిందూ పరిషత్ వారు దళిత విద్యార్థులను హింసిస్తున్నారు. దళితుల హక్కుల్ని కాలరాసే క్రమంలో హిందువులు కాని వారు భారతీయులు కాదని రెచ్చగొట్టి అగ్రవర్ణ విద్యార్థుల్లో హింసా ప్రవృత్తిని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల దళిత విద్యార్థులు సివిల్స్ రాత పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించినా వారిని ఇంటర్వూ్యల్లో తప్పించే అగ్రవర్ణ ప్యానల్స్‌ని రూపొందిస్తున్నారు. దళిత విద్యార్థులను ఇంటర్వూ్యల్లో తప్పించి, మీరు అత్యున్నత అధికార పదవులకు పనికి రారు అనే మనుస్మృతి సూత్రాలను ఆచరణలో పెడుతున్నారు. ఈ విషయాన్ని అఖిల భారతీయ దళిత్ అండ్ ముస్లిం ఫ్రంట్ యు.పి.యస్.సి. అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. అత్యధిక మార్కులు సంపాదించిన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం విద్యార్థులను కుల ద్వేషంతో వర్ణ ద్వేషంతో ఎలా తప్పించిందో ఆ వివరాలన్నీ సమాజం ముందుకు తెచ్చింది.
భారత్‌లో ప్రజలందరిని, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విద్యారంగాల్లో సమపాళ్ళతో చూడవలసిన అవసరం వుంది. ఉత్పత్తి శక్తులపైన బహుజనులను నిర్లక్ష్యం చేయడం వలన దేశం అభివృద్ధి చెందదు. నిన్నటి వరకు సుజనా చౌదరి, రమేష్‌ల మీద సీబీఐ దాడులు నిర్వహించి, ఈ రోజున వారిని బీజేపీలోకి తీసుకోవడంతో బీజేపీ అవినీతి రాజకీయాలకు పతాకలెత్తుతున్నట్టు అర్థం అవుతోంది. అవినీతి కులాధిపత్య కోణంలో ఫిరాయింపుల ప్రోత్సాహంలో కూరుకుపోయిన చంద్రబాబు పరిస్ధితి ఈనాడు ఏమైందో.. అదే రేపు అవినీతి దళిత వ్యతిరేక పాలక వర్గాలకు గుణపాఠం అవుతుంది. నిరక్షరాస్యత దళితుల్లో నేటికీ 70% ఉంది. అనేక గ్రామాల్లో వారిని నీళ్లకోసం చెరువుల్లోకి రానివ్వడం లేదు. దళితులపై అత్యాచారాలు ముమ్మరం అవుతున్నాయి. లౌకిక, సామాజిక శక్తులన్నీ ఏకమై తమ హక్కుల కోసం దేశ ఆర్థిక అభివృద్ధి కోసం పోరాడాల్సిన సందర్భమిది. అప్పుడే అంబేడ్కర్ ఆశయాలు నెరవేరతాయి.
వ్యాసకర్త సామాజిక తత్వవేత్త,
నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
మొబైల్ : 98497 41695
డా: కత్తి పద్మారావు
Comments
Please login to add a commentAdd a comment