నేప్యితాలో జరిగిన తూర్పు ఆసియా దేశాల సదస్సు సందర్భంగా చైనా ప్రధాని లీకెకియాంగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ
* ఆ రెండిటి మధ్య ఏ సంబంధాన్నైనా ప్రపంచం తిరస్కరించాలి
* ‘తూర్పు ఆసియా సదస్సు’లో ప్రధాని మోదీ పిలుపు
* ఉగ్రవాదంపై పోరులో నిజమైన భాగస్వామ్యం కావాలి
* సైబర్, స్పేస్‌లను అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి
* ఎబోలా నిర్మూలనకు కలసికట్టుగా కృషిచేయాలి
* ఇప్పుడు భారత విధానం ‘లుక్ ఈస్ట్’ కాదు ‘యాక్ట్ ఈస్ట్’
* రష్యా, చైనా సహా పలు దేశాల నేతలతో ప్రధాని భేటీ
నేప్యితా: మతం, ఉగ్రవాదం.. రెండూ వేరువేరని, వాటి మధ్య ఎలాంటి సంబంధాన్నైనా అంతర్జాతీయ సమాజం తిరస్కరించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలపై పోరులో నిజాయితీతో కూడిన అంతర్జాతీయ భాగస్వామ్యం ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మయన్మార్ రాజధాని నేప్యితాలో గురువారం జరిగిన తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో ఆయన ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా ప్రధాని మెద్వదెవ్, చైనా ప్రధాని లీకెకియాంగ్ సహా 18 దేశాల నేతలు ఆ సదస్సులో పాల్గొన్నారు.
సదస్సులో మోదీ మాట్లాడుతూ.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై ఈ సదస్సు ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో, ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిజమైన అంతర్జాతీయ భాగస్వామ్యంతో కూడిన స్పందన అవసరమన్నారు. మానవత్వమున్న అందరూ ఇందులో కలసిరావాలన్నారు. ‘ఉగ్రవాద, తీవ్రవాద సవాళ్లు పెరిగాయి. వాటికి.. ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ అక్రమరవాణా, నగదు అక్రమ చెలామణీకి దగ్గరి సంబంధం ఉంది’ అని పేర్కొన్నారు. సైబర్, అంతరిక్షం.. వీటిని విభేదాలకు కాకుండా అభివృద్ధికి, అనుసంధానతకు ఉపయోగించుకోవాలని సూచించారు.
ఆర్థిక రంగ సహకారంపై మాట్లాడుతూ.. ఈఏఎస్ సదస్సు సభ్యదేశాలు ‘సమతుల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’పై అవగాహనకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వస్తు, సేవల రంగాలకు సమాన ప్రాధాన్యతనిచ్చే ఈ ఒప్పందం వల్ల ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని మోదీ వివరించారు. 2015లోగా విశాల ‘ఆసియాన్ కమ్యూనిటీ’ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యాన్ని ఆయన ప్రశంసించారు. సమగ్ర ఆసియా,పసిఫిక్ ప్రాంత సమైక్యతకు అది దారులు వేస్తుందన్న విశ్వాసం తనకుందన్నారు.
‘లుక్ ఈస్ట్’ టు ‘యాక్ట్ ఈస్ట్’
ఆర్నెళ్ల క్రితం తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత విధానమైన ‘లుక్ ఈస్ట్’ విధానాన్ని మరింత క్రియాశీలంగా మార్చే ఉద్దేశంతో ‘యాక్ట్ ఈస్ట్’గా మార్చామని మోదీ వివరించారు. తూర్పు ఆసియా దేశాల సదస్సు తమ యాక్ట్ ఈస్ట్ విధానానికి ప్రధాన భూమికగా నిలుస్తుందన్నారు. ‘మరే ఇతర అంతర్జాతీయ వేదిక కూడా ఇంత భారీ స్థాయిలో విశ్వ జనాభాను, యువతను, ఆర్థిక, సైన్య సంపత్తిని ప్రతిబింబించదు. అలాగే మరే ఇతర వేదిక కూడా ఈ స్థాయిలో శాంతి, సుస్థిరత, అభివృద్ధి కోసం కృషి చేయదు’ అని ఈఏఎస్‌లోని 18 దేశాల శక్తి సామర్ధ్యాలను మోదీ చాటిచెప్పారు.
గత 8 సదస్సుల్లో అనేక రంగాల్లో పరస్పర సహకారానికి దారులు వేసుకున్నామన్న మోదీ.. ఇంధన రంగంలో.. ముఖ్యంగా స్వచ్చమైన సౌరశక్తి ఉత్పత్తిలో సభ్య దేశాలు భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అంటువ్యాధులను నిర్మూలించడంలో అంతర్జాతీయంగా అవసరమైన పరస్పర సహకారాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఎబోలా నిర్మూలనకు భారత్ 1.2 కోట్ల డాలర్లను అందించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. ఎబోలీ తీవ్రంగా ఉన్న లైబీరియాలో ఐరాస కార్యక్రమంలో భాగంగా భారత్‌కు చెందిన పోలీసులు 251 మంది ఉన్నారన్నారు. సదస్సు సందర్భంగా నేప్యితాలోని మయన్మార్ ఇంటర్నేషనల్ కాన్ఫెరెన్స్ సెంటర్‌లో పలువురు కీలక ప్రపంచ నేతలతో మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు.
మోదీ చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నాం
త్వరలో మోదీ చేయనున్న చైనా పర్యటన కోసం ఎదురుచూస్తున్నామని చైనా ప్రధాని లీ కెఖ్వియాంగ్ పేర్కొన్నారు. నేప్యితాలో గురువారం మోదీ, లీ మొదటిసారి సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ఇరుదేశాల్లోని ఆర్థిక సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరిగింది. చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ భారత పర్యటన తమకు మరపురాని జ్ఞాపకమని ఈ సందర్భంగా మోదీ లీ కెఖ్వియాంగ్‌తో అన్నారు.
భారత్ మాకు విలువైన భాగస్వామి
భారత్ రష్యాకు అత్యంత సన్నిహితమైన, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. గురువారం మోదీతో మెద్వదేవ్ భేటీ అయ్యారు. రెండు దేశాల రాష్ట్రాలు, ప్రాంతాల సమాఖ్య కేంద్రాల అవసరాన్ని మోదీ వివరించారు. దానివల్ల ప్రాంతీయ సహకారం మరింత పెరుగుతుందన్నారు. 2001లో తన రష్యా పర్యటనను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు.
మలేసియా దేశ పనితీరు సమీక్షా విధానం భేష్
బుధవారం మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌తో భేటీ సందర్భంగా.. ఆ దేశ ప్రభుత్వ పనితీరు సమీక్షా విధానాన్ని మోదీ ప్రశంసించారు. భారత్‌లోనూ ఆ తరహా విధానాన్ని అవలంబించే విషయంపై చర్చించారు. భారత గృహనిర్మాణ రంగంలో మలేసియా కంపెనీలు పాలు పంచుకోవాలని కోరారు. ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధాల అక్రమరవాణాలపై ఆసియాన్ దేశాలు, భారత్‌లు కలసికట్టుగా పోరు సాగించాల్సి ఉందన్నారు. ఫిలిపై్పన్స్ అధ్యక్షుడు బెనినో అక్వినో, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విదోడొలతోనూ మోదీ సమావేశమయ్యారు.