మంచి పరిణామం
సంపాదకీయం
మౌనం అంగీకారంగా ధ్వనించే పరిస్థితులున్నప్పుడు మాట్లాడకపోవడం అపచారమవుతుంది. అన్యాయమవుతుంది. బాధ్యతను విస్మరించడం అవుతుంది. సారాంశంలో నేరమవుతుంది. అందువల్ల ఆలస్యమైనా సరే మాట్లాడటమే సరైంది. కనుకనే...విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించే ఏ మత బృందాన్నయినా అనుమతించబోమని మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన స్వాగతించదగ్గది. ఎలాంటి ప్రలోభాలకూ, బెదిరింపులకూ లొంగకుండా నచ్చిన మతాన్ని ఎంచుకునే, ఆరాధించే హక్కు, స్వేచ్ఛ అందరికీ ఉంటాయని కూడా ఆయన చెప్పారు. విద్వేషాలను రెచ్చగొట్టే, హింసకు దిగే శక్తులపై కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు ఏర్పడ్డాక సంఘ్ పరివార్ నేతలు, బీజేపీ నేతలు కొందరు చేసిన ప్రకటనలు...మరీ ముఖ్యంగా ఢిల్లీలో చర్చిలపై జరిగిన దాడుల ఘటనలను చూసి ఆందోళనపడుతున్న వారికి మోదీ చేసిన ప్రకటన సాంత్వన చేకూరుస్తుంది. నరేంద్ర మోదీనుంచి ఇలాంటి ప్రకటన రావాలని చాన్నాళ్లుగా ఎందరో కోరుకున్నారు. అందువల్ల పరిస్థితులు చక్కబడతాయని ఆశించారు. ఆ స్థాయి నాయకుడినుంచి స్పష్టమైన ప్రకటన వస్తే సంఘ్ పరివార్ శ్రేణులు తమ ధోరణిని మార్చుకుంటాయని భావించారు.
ప్రార్థనాలయాలను ధ్వంసం చేసిన ఉదంతాలు ఢిల్లీలో గత మూడు నెలలుగా చోటుచేసుకుంటున్నాయి. వీటి వెనక ఎవరున్నారని స్పష్టంగా తెలియకపోయినా ఇవి సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. చర్చిలను ధ్వంసం చేసిన ఉదంతాలు జరిగిన ప్రతిసారీ వాటిని దొంగల పనిగా కొట్టి పారేయడం ఢిల్లీ పోలీసులకు అలవాటైంది. దొంగతనానికి వస్తే డబ్బు జోలికిగానీ, అక్కడున్న ఇతరత్రా విలువైన వస్తువుల జోలికిగానీ ఎందుకు పోలేదన్న ప్రశ్నలకు జవాబులు రాలేదు. నాలుగు రోజులక్రితం క్రైస్తవ సంస్థ ఆధ్వర్యంలోని కాన్వెంట్ స్కూలుపై దాడి జరిగింది. ఇక్కడ రూ. 12,000 పోయాయి గనుక ఇది దొంగలపనేనని పోలీసులు కాస్తంత ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. వీటన్నిటిపైనా ఆందోళనపడుతున్నవారికి ధైర్య వచనాలు చెప్పాల్సిందిపోయి... అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ గత మూడేళ్లుగా నగరంలోని ప్రార్థనాలయాల్లో జరిగిన దొంగతనాల జాబితా ఏకరువుపెట్టారు. మొత్తం ఆరు చర్చిల్లో ఒక పద్ధతి ప్రకారం విధ్వంసం జరిగినట్టు స్పష్టమవుతుండగా ఇలాంటి విశ్లేషణలు చేయడం సమస్య పరిష్కారానికి దోహదపడదని ఆయన గుర్తించలేకపోయారు.
ఈ ఉదంతాలన్నిటి మాట అటుంచి సంఘ్ పరివార్ సంస్థల్లోని ముఖ్యులు కొందరు, బీజేపీకి చెందిన నేతలు కొందరు చేస్తున్న ప్రకటనలు, వాడుతున్న భాష ఆందోళనకర స్థాయికి చేరాయి. ఈ వివాదాల పొడవునా ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడూ మాట్లాడలేదు. కేంద్రమంత్రి నిరంజన్ జ్యోతి ‘ఢిల్లీని పాలించాల్సింది రాముడి సంతానమా...అక్రమ సంతానమా తేల్చుకోవాల’ంటూ ఒక బహిరంగ సభలో మాట్లాడినప్పుడు అప్పటికి సమావేశాలు సాగుతున్న పార్లమెంటులో ఆ ఉదంతం పెను వివాదం సృష్టించింది. మిగిలిన మంత్రులు వివరణనిచ్చినా ప్రధాని మాట్లాడితే తప్ప శాంతించబోమని విపక్షాలన్నీ ఒక్కటై శఠించాయి. చిట్టచివరకు మోదీ జోక్యం చేసుకుని ఆమె వ్యాఖ్యలు తప్పేనని వివరణనివ్వాల్సి వచ్చింది. అది సద్దుమణగక ముందే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మహాత్ముడి హంతకుడు నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడంటూ పొగడ్తల వర్షం కురిపించారు. దానికీ కేంద్రం సంజాయిషీ ఇచ్చుకోవాల్సివచ్చింది. ఇక హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని పిలుపులొచ్చాయి. ఘర్‌వాపసీ పేరుమీద మత మార్పిడులు జరిగాయి. దేశంలో 15 కోట్లమందిని ‘వెనక్కి తీసుకొచ్చేవరకూ’ ఈ కార్యక్రమం ఆగబోదని విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాధ్వీ ప్రాచీ ఆర్య ప్రకటించారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఒబామా వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడా, అమెరికా వెళ్లాకా చేసిన వ్యాఖ్యానాలు ప్రకంపనలు సృష్టించాయి. ‘మత విశ్వాసాల పరంగా చీలిపోనంత కాలమూ మీరు విజయం సాధిస్తార’ంటూ ఆయన చెప్పిన హితవచనాలపై కొందరికి ఆగ్రహం కూడా కలిగింది. సొంతింటిని చక్కదిద్దు కోవడంలో విఫలమైన ఒబామా మనకు నీతులు చెబుతారా అన్నవారున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మోదీ స్పష్టంగా, సూటిగా మాట్లాకపోవడంవల్లే ఒబామా అలా అనాల్సివచ్చిందని కొందరు అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ఆలస్యమైనా మోదీ చేసిన ప్రకటన అలజడులు రేకెత్తించేవారికి ఒక హెచ్చరికే అవుతుంది. అలాగే వారిని అదుపు చేయడంలో తటపటాయిస్తున్న పోలీసు అధికారులకు కూడా స్పష్టమైన సూచన అవుతుంది. అయితే, ఇది ఇక్కడితో సమసిపోదు. ప్రధాని ప్రకటన తర్వాత క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆచరణలో అది ఎలాంటి ఫలితాన్నిచ్చిందో అందరూ గమనిస్తారు. ప్రార్థనాలయాల విధ్వంసమైనా, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలైనా ఆగాలంటే కఠిన చర్యలు తీసుకోవడం ముఖ్యం. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతోనే బీజేపీ అధిక సంఖ్యలో సీట్లు సంపాదించింది. అయితే ఇందుకు భిన్నంగా సాగుతున్న పరిణామాలు చాలామందిలో నిరాశ కలిగించాయి. ఒక గట్టి ప్రత్యామ్నాయాన్ని చూపగలిగిన పక్షం రంగంలోకి దిగితే బీజేపీని ఓడించడం ఖాయమని ఢిల్లీ ఎన్నికలు నిరూపించాయి. ఒబామా అంతటి వ్యక్తి ఇక్కడి పరిస్థితుల గురించి వ్యాఖ్యానాలు చేయడంవల్లనో...ఢిల్లీ ఎన్నికల ఫలితాలవల్లనో నరేంద్ర మోదీ ఇన్నాళ్లకు ఈ ప్రకటన చేశారని కొందరంటున్నారు. అందులో నిజానిజాల సంగతెలా ఉన్నా మోదీ చేసిన ప్రకటన ఒక మంచి పరిణామం. దీంతోపాటు ఇకపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే తమ పార్టీ నేతలపై ఆయన కఠిన చర్యలు తీసుకోగలిగితే ప్రజల్లో ఆయనపై విశ్వాసం ఇనుమడిస్తుంది.