రోజు కూలీ చేసుకొనే ముస్లింలకు రిజర్వే షన్లు కావాలనే డిమాండ్ దశాబ్దాలుగా తీరని కోరికగానే ఉండేది. సైకిల్ షాప్ నుండి ఆటో గ్యారేజ్ వరకు, టీ కొట్టు నుండి బడా హోటళ్ల లోనూ, బస్టాండ్‌లో మూటలు మోసే పని లోనూ అత్యధిక శాతం ముస్లిం పిల్లలే దర్శన మిస్తారు. ముస్లింలకు విద్యా ఉద్యోగ రంగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి నప్పుడు అది రాజకీయ నినాదం మాత్రమేనని తోసిపుచ్చిన వారు అధికం. కానీ ప్రమాణ స్వీకారం చేసిన 75 రోజులకే 5 శాతం రిజ ర్వేషన్ కల్పిస్తూ వైఎస్ తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైనది. 12–7–2004న జీవో నం. 33 ద్వారా రిజర్వేషన్లు కల్పించినట్లు ప్రక టించడం ముస్లింలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
అయితే అదే సంవత్సరం సెప్టెంబర్ 21న బీసీ కమిషన్‌ను నియ మించకుండా రిజర్వేషన్లు కల్పించడం చెల్లదని ఏపీ సర్వోన్నత న్యాయస్థానం ఆ జీవోను తోసిపుచ్చింది. మైనార్టీలను మోసపుచ్చే చర్య తప్ప దీని ద్వారా ముస్లిం సమాజానికి ఒరగబెట్టింది ఏమీ లేదని పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి. కానీ పట్టు వదలని వైఎస్ బీసీ కమిషన్‌ను పునరుద్ధరించి ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 2005లో మళ్లీ 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. తత్ఫలితంగా ఆ విద్యా సంవత్స రంలో ముస్లిం యువతకు 160 ఎంబీబీఎస్ సీట్లు లభించాయి. ఒక సాధారణ ముస్లిం యువత అన్ని సీట్లు సాధించడం ఊహకందని విషయం.
ముస్లిం రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ మళ్ళీ ఏపీ హైకోర్టుకు వెళ్ళడం, చట్ట ప్రకారం లేదంటూ కొట్టివేయడం, సుప్రీంకోర్టులో కూడా స్టే లభించకపోవడంతో ముస్లిం సమాజం తీవ్ర నైరాశ్యంలో మునిగింది. అయినా వైఎస్ మళ్లీ బీసీ కమిషన్ కాలపరిమితిని పెంచి, ముస్లిం సామాజిక స్థితిగతులపై నివేదిక కోరారు. జస్టిస్ దాళ్వ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఏర్పడ్డ కమిషన్ వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసింది. పి.ఎస్.కృష్ణన్ నివేదికలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా 2007లో ఒక చట్టాన్ని రూపొం దించి, జీవో నంబర్ 23 ద్వారా మత ప్రాతిపదికన కాకుండా సామా జిక, ఆర్థిక, వెనకబాటు దృష్టిలో పెట్టుకొని ముస్లిం వర్గాలలోని 15 గ్రూపులకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. తదుపరి రిజర్వేషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసినప్పటికీ సుప్రీంకోర్టు స్టేతో 2007 నుండి కొన సాగుతున్నాయి.
ఇక ఉపాధి రంగంలో 4 శాతం రిజర్వేషన్లు ముస్లిం సమాజం స్థితిగతులలో గణనీయ మార్పులు తెచ్చాయి. బీసీ–ఈ ద్వారా డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లాంటి కీలక ఉద్యోగాలు ముస్లింలు సాధించారు. ఏపీ మోడల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ ద్వారా వందలాదిమంది ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీలుగా ఎన్నికయ్యారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో దాదాపు 5,000 ఉద్యోగాలు భర్తీ చేయబడ్డాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత 13 సంవత్సరాలుగా మూడు లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయగా దాదాపు 15 వేల మంది బీసీ–ఈ ద్వారా లబ్ధి పొందడం వైఎస్సార్ చలవేనన్నది జగద్విదితం.
ఈ రిజర్వేషన్లు లభించని పఠాన్, సయ్యద్, మొగల్ తదితర ఉప కులాలకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా లబ్ధి చేకూర్చి వేలాది మంది ఉన్నత విద్యకు తద్వారా ఉపాధి లభ్యతకు కారణభూతులైన వైఎస్ ఆచంద్రతారార్కం ముస్లింల హృదయాలలో అంబేడ్కర్‌గా నిలిచిపోతారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను మైనార్టీ సంక్షేమానికి 2,200 కోట్లు కేటాయించి పలు సంక్షేమ పథకాలలో ముస్లింలకు భాగస్వామ్యం కల్పించి తండ్రికి తగ్గ తనయుడని చాటి చెబుతున్నారు.
వ్యాసకర్త: ఎం. బాబర్ ,
సెక్షన్ ఆఫీసర్, ఏపీపీఎస్సీ, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment