‘‘కొందర్ని కొన్నిసార్లే మోసగించగలం, అందర్నీ అన్నిసార్లు మోసపుచ్చడం కష్టం!’’ అన్నది ఓ పాత నానుడి. అందర్నీ అన్ని వేళలా మోసపుచ్చవచ్చని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరూపించే సాహసం చేస్తోంది. యూపీఏ హయాంలో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100–140 డాలర్ల మధ్య ఊగిసలాడినపుడు భారతీయులు లీటర్ పెట్రోలుకు చెల్లించిన ధర రూ. 70 నుంచి రూ. 75 మధ్యనే ఉంది. 2014 మేలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అంతర్జాతీ యంగా క్రూడాయిల్ ధరలు గణనీయంగా పతనమయ్యాయి. ధరలు తగ్గించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం మరింత పెంచుకున్నాయి. క్రూడాయిల్ బ్యారెల్ ధర 40 డాలర్ల కనిష్ట స్థాయికి దిగినప్పుడు కూడా వినియోగదారులు లీటర్ పెట్రోల్‌కు రూ. 70 చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుతం రూ. 80 దాటిపోయింది. డీజిల్ ధర రూ. 75కి పైనే. 2014 మేలో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ చమురు ధర.105 డాలర్లు ఉండగా 2018 మే చివరి వారానికి రూ.74 డాలర్లకు తగ్గింది. అయినా, చమురు ధరలు 2014 నాటికన్నా ఎందుకు ఎక్కువగా ఉన్నాయన్నది అంతుబట్టని రహస్యం.
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ఎక్కడా లేనంతగా 34 శాతం ఉంది. దీనికి అదనంగా ప్రత్యేక పన్ను రూపంలో లీటర్‌కు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా బాబు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే వ్యాట్ తగ్గిస్తామని, డీజిల్‌పై రాయితీలు ఇస్తామని ప్రకటిం చారు. ఆయన ప్రకటనలు, హామీలు అసెంబ్లీ రికార్డుల్లో పదిలంగా ఉన్నాయి తప్ప కార్యరూపం దాల్చ లేదు. ఢిల్లీ, బొంబాయి, బెంగుళూరు చివరకు హైదరాబాద్‌లో కంటే ఏపీలోని ప్రధాన నగరాల్లో అమ్ముతున్న పెట్రో ధరలు లీటర్‌కు రూ.5 కంటే ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను గరిష్టంగా 34 శాతం వడ్డిస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 18 శాతం మాత్రమే. ఈ ఏడాది మే ఒకటి నాటికి దేశంలో వివిధ రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న సేల్స్ టాక్స్/వ్యాట్ పరిశీలిస్తే పెట్రోలుపై మహారాష్ట్ర 39.79 శాతంతో మొదటి స్థానంలో నిలిస్తే, 36.06 శాతంతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. డీజిల్‌పై పన్ను విషయంలో ఏపీ 28.47 శాతంతో ప్ర«థమ స్థానంలో ఉంది.
అంతర్జాతీయంగా బ్యారల్ ధర ఒక డాలర్ పెరి గితే రాష్ట్రాలన్నింటికి కలిపి అదనంగా రూ.18,728 కోట్లు ఆదాయం పెరుగుతోందని ఎస్.బి.ఐ. నివేదిక వెల్లడించింది. పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరి ధిలోకి తేకుంటే దేశ ఆర్థికాభివృద్ధికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పలు వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్యలు చేస్తున్న హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన పద్మవ్యూహంలో సామాన్యులే సమిధలై విలవిల్లాడుతున్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సంస్థలకు సగటున రూ. 680 కోట్లు అదనపు భారం పడినట్లు అంచనా.
సామాన్యులపై పెట్రో ఉత్పత్తుల భారాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక ప్రత్యామ్నాయాలున్నాయి. 2004–2009 మధ్య కాలంలో ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ రాజ శేఖరరెడ్డి వంటగ్యాస్ ధర పెరిగినపుడు ఆ భారం పేద, మధ్య తరగతి వర్గాలపై పడకుండా సిలిండర్‌కు రూ. 50 మేర పెరిగిన ధరను సబ్సిడీ రూపంలో అందించారు. నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పుడైనా మోదీ చమురు ధరల విషయంలో ఏదైనా తీపికబురు చెబుతారేమోనని ఎదురు చూసినవారికి నిరాశే మిగిలింది. ఈ నాలుగేళ్లల్లోనే కేంద్రం కేవలం ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా రూ.10 లక్షల కోట్లకు పైగా ఆర్జించిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యాట్ గరిష్టంగా వసూలు చేస్తున్న రాష్ట్రాలు కూడా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్లు వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆఖరుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఖాతరు చేయలేదు. ‘పెంచడం రూపాయల్లో... తగ్గిం చడం పైసల్లో’ అనే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరిస్తూ ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేస్తున్నాయి.
వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
మొబైల్ : 99890 24579
Comments
Please login to add a commentAdd a comment