
సందర్భం
ఇంటర్మీడియట్ వరకు తెలుగులో విద్యాబోధనను తప్పనిసరి చేయడంపై, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనది. ఏపీలో కూడా పాలకులు ఇదే బాటలో నడవడం ఎంతో అవసరం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న రెండు చారిత్రక నిర్ణయాల వల్ల తెలుగు జాతి మొత్తం ఆయనను అభినందించాల్సి ఉంది. ఒకటి.. రూ.50 కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచ తెలుగు మహా సభలను నిర్వహించడానికి కేసీఆర్ ఆదేశించడం. ఇది చరిత్రకమైన నిర్ణయం ఎందుకైందంటే, తెలంగాణా మేధావులు కొందరు ఈ సభలను ప్రపంచ తెలంగాణ సభలుగా నిర్వహించాలని పట్టుబట్టారు. మనది తెలుగు భాష కాదు.. తెలంగాణ భాష అని వాదిం చారు. అన్నీ విన్న కేసీఆర్ నో అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలుగానే నిర్వహించాలని ఆయన తన రాజ శాసనంతో తెలుగు వారు భూగోళంలో ఎక్కడున్నా అందరినీ ఆనంద సాగరంలో ముంచివేశారు. తెలుగు పట్ల, తెలుగు జాతి పట్ల ఆయనకున్న అపారమైన గౌరవాభిమానాలను ఈ ఒకే ఒక్క శాసనంతో ప్రపంచానికి తేటతెల్లం చేశారు.
ప్రాంతాలుగా విడిపోయినా భాషకు వేరు వేరు పేర్లు పెట్టుకోవలసిన పని లేదని హిందీ భాషా రాష్ట్రాలు మనకు చాటి చెప్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో హిందీ మాతృభాషగా చెలామణి అవుతోంది. అంతే గానీ రాష్ట్రం విడిపోయినప్పుడల్లా హిందీకి ఎవరికి తోచిన పేరు వారు పెట్టుకోలేదు. అందుకు కారణం కబీర్, తులసీదాస్‌ల నుంచి... ప్రేమ్‌చంద్, రాంధారి సింగ్ దినకర్, నిరాళా, కేదార్‌నాథ్ సింగ్ దాకా అల్లుకున్న ఆత్మీయత అంతా హిందీనే కాబట్టి. కనుకనే హిందీ వారందరిలో ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నా ఒక భావైక్యత, భాషైక్యత సుస్పష్టంగా పరిమళిస్తుంది. ఆ ఐక్యతలో ఒక అనుబంధం ఉంటుంది. ఒక తాదాత్మ్యత ఉంటుంది. ఒక గర్వం ఉంటుంది. అది కనిపించకుండా రక్తంలో ప్రవహిస్తూ ఉంటుంది. భాష ద్వారా ఆ భాష మాట్లాడే మనుషులు మనమంతా ఒకటే అనుకునే ప్రేమ సూత్రం అదే. కొన్ని ఆవేశకావేశాలకు.. తాత్కాలిక ఉక్రోషాలకు.. కోపాలకు గురై తరాలుగా భాష పేనే ఈ సూత్రం ముక్కలు ముక్కలుగా తెగిపోకూడదు.
కనీసం ఉన్న భాషను ఉన్నంతకాలమైనా ఉన్నంత శక్తి మేరకు కాపాడుకోవాలి. పోతన అయినా తిక్కన అయినా కాళోజీ అయినా శ్రీశ్రీ అయినా మన ఆస్తిగా భావించుకోవాలి. ఎవరి ప్రాంతంలో వారు తమ తమ ప్రాంతపు కవులను, రచయితలను కళాకారులను ప్రోత్సహిస్తూనే ఉమ్మడి ఆస్తిగా అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగు తేజాల నుంచి ప్రేరణ పొందాలి. తెలుగు వారిని అన్నదమ్ములుగా కలిపి ఉంచే భాషను వేరు చేస్తే అది చారిత్రక ద్రోహంగా నిలిచిపోతుంది. ఈ ప్రమాదాన్ని కేసీఆర్ గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఏం చెప్పినా తెలుగు తెలుగే అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలుగానే నిర్వహించాలని హుకుం జారీ చేశారు. తెలుగు జాతి ఇప్పుడు కాకున్నా ముందు ముందు ఈ నిర్ణయం ఎంత గొప్పదో తెలుసుకుంటుంది.
రెండో నిర్ణయం కూడా చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నది. ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకూ తెలుగు భాష ఒక అంశంగా ఉండాలని, అది తప్పనిసరి అని నిర్ణయించారు. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలన్నింటా ఆ నిర్ణయం అమలు జరగాల్సిందే అని నిర్దేశించారు. తామర తంపరగా ప్రైవేటు విద్యాసంస్థలు వెలిసి, ఇంటర్మీడియట్‌లో తెలుగు లేకుండా చేసి, మార్కుల కోసం సంస్కృత భాషను పెట్టడం వల్ల ఒక చారిత్రక అపరాధం జరిగిపోయింది. నూనూగు మీసాల తరం, రక్తంలోకి భాషా సాహిత్యాల సుగంధం ఇంకే వయసులో తెలుగుకు దూరమైపోయింది. వ్యాపారం చేసుకోవడానికి విద్యాసంస్థలు పెట్టి భాషా సంస్కృతులతో గొప్ప జూదం ఆడారు ఒక వర్గం వారు. మీడియం ఏదైనా తెలుగు ఒక అంశంగా ఉంటే కనీసం పిల్లలు తెలుగు సాహిత్యంతో పరిచయం కలిగి వుంటారు. ఎవరు ఎన్ని భాషల్లో పండితులైనా మాతృ భాషను నరాల్లో ఇంకించుకున్న వారే సృజనాత్మకంగా ఆలోచించగలరు.. మాట్లాడగలరు.. రాయగలరు.
ఉన్నత విద్యలలో, సాంకేతిక విద్యలలో కూడా తెలుగు ఒక అంశంగా బోధిస్తే జరిగే మేలు మాటల్లో వర్ణించలేనిది. దీనివల్ల ఎవరూ నష్టపోయేది ఏం లేదు. రానున్న తరాలు రమణీయమైన భవిష్యత్తును నిర్మిం చుకోవడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాకపోవచ్చు కానీ ఆ దిశగా అడుగులు కదపడానికి ప్రస్తుత నిర్ణయం దోహదపడుతుందని చెప్పవచ్చు. అందుకే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ తెలుగును ఒక విషయంగా బోధించడాన్ని తప్పనిసరి చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఈ నిర్ణయం వెనకున్న పెద్దలను మనసారా అభినందిస్తున్నాను. తెలుగు పట్ల ఆయనకున్న అనంతమైన ప్రేమానురాగాలే దీనికి కారణం కావొచ్చు. ఇక్కడ మరే ఇతర రాజకీయమైన కారణాలను వెదికినా అది పొరపాటే అవుతుంది. ఇదే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పాలకులు తీసుకుంటారని ఆశిస్తున్నాను.
వ్యాసకర్త ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు
మొబైల్ : 84998 66699
డా. ప్రసాదమూర్తి