బీసీ జనగణన ఎప్పుడు? | R Krishnaiah Demand For BC Jana ganana | Sakshi
Sakshi News home page

బీసీ జనగణన ఎప్పుడు?

Published Fri, Feb 14 2020 4:28 AM | Last Updated on Fri, Feb 14 2020 4:28 AM

R Krishnaiah Demand For BC Jana ganana - Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులాల అభివృద్ధికి విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు.. ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధికై అనేక స్కీములు అమలు జరుపుతున్నాయి. అలాగే రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరణ చేస్తున్నాయి. కానీ బీసీ జనాభాకు చెందిన లెక్కల వివరాలు లేకపోవడంతో రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయి. బీసీ జనాభా లెక్కలు లేని కారణంగానే సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. జనాభా లెక్కలు సమగ్రంగా లేనందువలన రిజర్వేషన్లను ఎంత శాతం నిర్ణయించాలనే అంశంపై మొదటినుంచి బీసీ కమిషన్లు ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది.

భారత రాజ్యాంగం కులాల ప్రాతిపదికన ఎస్సీ/ఎస్టీ/బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధి పథకాలు పెట్టాలని నిర్దేశించింది. ఇందులో భాగంగా ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ సామాజిక వర్గాల పేరుమీద జనాభా గణన మొదటి నుంచి తీస్తున్నారు. అలాగే లింగ విభజన పేరుమీద మహిళా–పురుష జనాభా గణన ఉంది. కానీ బీసీ కులాల  జనాభా వివరాలు కావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నా, ప్రజా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నా, హైకోర్టు–సుప్రీంకోర్టులు ఆదేశిస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఒక బీసీ కులాల కాలమ్‌ పెట్టడానికి ముందుకు రావడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

కేంద్ర ప్రభుత్వం 2021లో భారతదేశ జనగణన చేపట్టడానికి విడుదల చేసిన నమూనా పట్టికలో వివరాల కోసం 32 కాలమ్స్‌ నమూనా పత్రం విడుదల చేశారు. కేంద్రప్రభుత్వం హోంశాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ/ఎస్టీల వివరాలు కాలం, అలాగే హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ తదితర మతాల వివరాలు ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్‌ నమూనా పత్రాన్ని జారీ చేశారు. కానీ ఈ జనాభా లెక్కల పట్టికలో బీసీ కులాల వివరాలకు సంబంధించిన  కాలమ్‌ పెట్టలేదు. బీసీ జనాభా లెక్కల వివరాలు సేకరించవలసిన ఆవశ్యకత ఉంది. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కేటాయింపు–పంచాయతీరాజ్‌ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా బీసీ జనాభా లెక్కల వివరాలు అవసరం అవుతున్నాయి.
 
జనాభా లెక్కలు లేనందున సుప్రీంకోర్టు–హైకోర్టులు రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడాన్ని కొట్టి వేస్తున్నాయి. ఏయే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటాయించాలనే విషయంలో బీసీ జనాభా లెక్కలు లేక, న్యాయపరమైన చట్టపరమైన కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి జస్టిస్‌ రోహిణి నేతృత్వంలో కమిటీని నియమించింది. బీసీ కులాలవారీగా జనాభా లెక్కలు లేకపోవడంతో ఈ కమిటీ వర్గీకరణ చేసి ఏయే గ్రూపుకు ఎంత శాతం రిజర్వేషన్లు నిర్ణయించాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

కేంద్ర ప్రభుత్వ స్పందన ఏమిటి?
1931లో అంటే 90 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ ప్రభుత్వం కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలు తీయడానికి ఊగిసలాడుతూ వచ్చింది. బీసీ సంక్షేమ సంఘం అనేక వీధి పోరాటాలు న్యాయపోరాటాలు చేసిన తర్వాత స్పందించి 2010లో కులాల వారీ లెక్కలు తీయడానికి నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగీకరించింది. అయితే అప్పటికే జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభమైంది. దీనితో ప్రత్యేకంగా బీసీ జనాభా లెక్కలు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 8 వేల కోట్లు కేటాయించి కులాల వారీ జనాభా లెక్కల్ని ప్రత్యేకంగా తీశారు. ఈ లెక్కలతో సమగ్ర పట్టిక తయారు చేయడానికి మాజీ ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌తో ఒక కమిటీ వేశారు. కానీ ఆ తర్వాత వాటి వివరాలు, జనాభా సంఖ్య ఇంతవరకు ప్రకటించలేదు.
 
గతంలో అంటే 2010లో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా బీసీ జనాభా కులాల వారిగా లెక్కలు తీయాలని భారతీయ జనతాపార్టీ పార్లమెంటులో డిమాండ్‌ చేసింది. బీజేపీ కోరినం దుకే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. కావున కులాలు వారీ లెక్కలు తీయవలసిన బాధ్యత అవసరం–ఆవశ్యకత ఉంది. పైగా దీనికి ప్రత్యేక బడ్జెట్‌ అవసరం లేదు. ఒక రూపాయి ఖర్చు లేకుండా జనాభా లెక్కలు వస్తాయి. 01.08.2018 నాడు అప్పటి హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో జరిపిన హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో జనాభా గణనలో బీసీ కులాల వారీగా లెక్కలు తీయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. కానీ రెండవ సారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ఎందుకు మార్పు వచ్చింది?.

జనాభా లెక్కలు తీస్తే తరాలుగా అణచివేతకు గురైన కులాలు తామే అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిస్తే వారు తిరగబడి.. దేశవనరుల్లో, అధికారంలో తమ వాటా తమకు ఇవ్వాలని అడుగుతారేమోనని పాలకవర్గాలు భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అంతే కాదు.. వేల సంవత్సరాలు తమ అగ్రకులాలకు సేవలు చేస్తున్న ఊడ్చేపని, స్కావెంజర్‌ పని, వంట చేసే పని, బట్టలుతికే వారు, హెయిర్‌ కటింగ్‌ చేసే వారు ఇలా ఇంటి పని, పొలం పనులు చేసే వారు దొరకరని భయపడి జనాభా లెక్కలు తీయడం లేదా!! అలాగే ఇన్ని రోజులు తమ కాళ్ళ కాడ పడి ఉన్న ఈ పేద కులాల వారికి అధికారంలో వాటా ఇస్తే వీరు కలెక్టర్, ఆఫీసర్, ఎమ్మెల్యే, మంత్రులయి తమ పక్కన కూర్చుంటారని భయమా!! అలాగే జనాభా లెక్కలు తేలితే విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లు పెంచాలని అలాగే స్థానిక  సంస్థల్లోనూ రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్‌ బలంగా ముందుకు వస్తుందని భయమా! భయపడవలసిన అవసరం లేదు. మీరు జనాభా లెక్కలలో కులాల వారీ లెక్కలు తీసినంత మాత్రాన ఈ కులాలు తమ డిమాండ్లను తెరమీదకి  తీసుకురావు. ఇప్పటివరకు రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ఏమైనా  అవలక్షణాలు దొర్లాయా?

రాజ్యాంగం రక్షణ సదుపాయాలు 
రాజ్యాంగంలోని 15 (4) (5) మరియు 16 (4) (5) ప్రకారం బీసీ కులాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా ఉంది. జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెడతారు? రాజ్యాంగంలోని 243 డి–(6) 243–టి–6 ప్రకారం స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉంది. కానీ జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్ల శాతం ఎలా నిర్ణయిస్తారు? రాజ్యాంగంలోని 339–బి–ప్రకారం జాతీయ బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. కానీ బీసీల సమగ్రాభివృద్ధికి ఏ సిఫార్సు చేయాలన్నా జనాభా లెక్కలు కావాలి. రాజ్యాంగం కల్పించిన సదుపాయాలు, రక్షణలు, రిజర్వేషన్ల కోసం జనాభా లెక్కలు అవసరం. రాజ్యాంగంలో బీసీ కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి అనేక ప్రోవిజన్స్‌–ఆర్టికల్స్‌ ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే బీసీ కులాల లెక్కలు కావాలి.

కోర్టు తీర్పు ప్రకారం లెక్క తీయాలి
రిజర్వేషన్లు ప్రవేశపెట్టినపుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో హైకోర్టు–సుప్రీంకోర్టులు జోక్యం చేసుకొని జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడతారని లేదా పెంచుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మండల్‌ కమిషన్‌ కేసు సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ల శాతం నిర్ణయిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలో ప్రతీ రాష్ట్రంలో నియమించిన  ప్రతి కమిషన్‌ జనాభా లెక్కలు తీయాలని సిఫారసు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అనేక రాష్ట్రాలు కులాల వారిగా జనాభా లెక్కలు తీశాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపు కోసం, ఇతర రిజర్వేషన్ల కోసం ఇతర అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలు బీసీ జనాభా లెక్కలు తీశాయి. కానీ వీటికి చట్టబద్ధత లేదని కోర్టులు కొట్టివేశాయి.

ఈ దేశంలో అన్ని వర్గాల వివరాలను జనాభా గణన ద్వారా సేకరిస్తున్నారు. చివరకు పులులు–జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కానీ బీసీ కులాల వారిగా జనాభా లేకపోవడం అన్యాయం. బీసీ జనాభా లెక్కలు సేకరిస్తే జరిగే నష్టం ఏమిటి? అనే ప్రశ్నకు జవాబు లేదు. కేవలం ఊహాజనితంగా కులాల వారి లెక్కలు తీయడం వలన కులతత్వం పెరుగుతుందని పసలేని విమర్శలు చేస్తుంటారు. ఇది ఊహమాత్రమే; ఎందుకంటే మతాల లెక్కలు తీస్తున్నారు. మతతత్వం పెరుగుతుందా! 
అలాగే ఎస్సీ/ఎస్టీ కులాల వారి లెక్కలు తీయడం లేదా? ఏమైనా కులతత్వం పెరిగిందా? ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు, రిజర్వేషన్లకు, పరిపాలన సౌకర్యంకోసం కులాల వారీ లెక్కలు ఉపయోగపడుతాయి. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి జనాభా గణనలో బీసీ కులాల వారి  లెక్కలు తీసే విధంగా తగు ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం ఉంది. జనాభా గణన కాలమ్స్‌లో ఒక కాలమ్‌ పెరుగుతుంది. ఒక పైసా అదనంగా ఖర్చు కాదు. పైగా ప్రభుత్వానికి చట్టపరమైన, పాలనాపరమైన, అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి కులాల వారి కాలమ్‌ చేర్చాలని ప్రజలు–అన్ని పార్టీలు కోరుతున్నాయి.


ఆర్‌. కృష్ణయ్య 
వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement