మీడియాకు చంద్రగ్రహణం | Ramachandraiah Writes Satirical Comments On Chandrababu Cheap Publicity | Sakshi
Sakshi News home page

మీడియాకు చంద్రగ్రహణం

Published Thu, Mar 7 2019 3:13 AM | Last Updated on Thu, Mar 7 2019 3:13 AM

Ramachandraiah Writes Satirical Comments On Chandrababu Cheap Publicity - Sakshi

‘‘వెయ్యి తుపాకులక్కూడా భయపడనుగానీ.. కలానికి మాత్రం భయపడతాను’’ అని కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పారు అమెరికా తొలి అధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉదార ఆర్థిక విధానాలు మొదలైనాక, పాలక వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ప్రజలలో ప్రభుత్వం పట్ల అనుకూలత పెంచడానికి ‘మేన్యుఫాక్చర్డ్‌ కన్‌సెంట్‌’ విధానాన్ని అనుసరిస్తూ  పాలక వర్గాలు అత్యధిక శాతం మీడియాను తమ చెప్పుచేతల్లోకి తీసుకొని ప్రజలను ప్రభావితం చేసే దుర్మార్గపు దశ మొదలైందని ప్రముఖ ప్రజాస్వామ్యవాది, రచయిత ‘నోమ్‌ చామ్‌స్కీ’ 90 దశకం ప్రారంభంలోనే చెప్పారు. ప్రపంచం మాట ఎలా ఉన్నా.. తెలుగునాట మాత్రం ‘చామ్‌స్కీ’ చెప్పిన ప్రోపగాండ మోడల్‌.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికారపీఠం ఎక్కిన తర్వాత ఉధృతరూపం దాల్చింది.

1984లో అప్పటి రాష్ట్ర సీఎం ఎన్టీఆర్‌పై సహచర మంత్రి నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేసిన ఉదంతంలో ప్రజల్ని చైతన్యపర్చిన వైనాన్ని మీడియాలోని ఒక వర్గం ప్రజాసామ్య పరిరక్షణోద్యమంగా అభివర్ణిస్తుంది. వర్తమాన చరిత్రను పరిశీలిస్తే.. సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో గెలిచిన 23మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో ఫిరాయింపజేసుకొని, అందులో నలుగురిని ఏకంగా మంత్రుల్ని చేశారు. ఈ ఉదంతంపై ఒక వర్గం మీడియా చంద్రబాబును పల్లెత్తుమాట అనలేదు. తహసీల్దార్‌ శ్రీమతి వనజాక్షిపై అధికారపార్టీ ఎమ్మెల్యే పాల్పడిన అమానుషదాడి అంశాన్ని సాధారణ అంశంగానే పరిగణించింది. కేవలం ముడుపుల కోసం చేపట్టిన పట్టిసీమ వల్ల ఒనగూడే నిజమైన ప్రయోజనాలేమిటో నిష్పక్షపాతంగా మీడియా వెల్లడించ లేదు. ఇక, పోలవరం ప్రాజెక్టులో జరిగిన విచ్ఛలవిడి అవినీతికి సంబంధించిన వార్తలు ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టింది.  

కొన్ని మీడియా సంస్థలు గొడుగు పట్టిన కారణంగానే.. ఓటుకు నోటు వంటి సంచలనకేసులో చంద్రబాబు పాత్ర హైలైట్‌ కాలేకపోయింది. బాహ్యప్రపంచం యావత్తూ ఓటుకునోటు కేసులో చంద్రబాబునాయుడి ప్రమేయాన్ని అర్థం చేసుకోగలిగింది. కానీ.. కొన్ని మీడియా సంస్థలకు ఈ కేసులో ఎటువంటి తప్పు కన్పించినట్లు లేదు.  తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల సందర్భంగా మహాకూటమి తరఫున ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. తెలుగుదేశం శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయారని, వారికి తగిన బుద్ధి చెప్పాలంటూ విమర్శించారు. చంద్రబాబు సొంత రాష్ట్రంలో ఏం చేశారో ఆయనకు ఎందుకు గుర్తుకు రావడం లేదని.. మీడియా ప్రశ్నించలేకపోయింది. సీఎం అధికారిక నివాసంలో ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న టెలికాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించడం సరికాదని, ప్రతిరోజూ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని చంద్రబాబు పార్టీ కోసం వాడుకొంటున్నారన్న వాస్తవాన్ని మాత్రం మీడియా ప్రజలకు తెలియపర్చదు.  

ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీ మెరుగు అంటూ చేసిన వాదనలు, చంద్రబాబు లెక్కలేనన్ని ’యు’టర్న్‌లపై అనుకూల మీడియా ఒక్క చర్చ కూడా ఏనాడు తమ ఛానల్స్‌లో పెట్టలేదు. కానీ, అధికారంలోకి వస్తే వైఎస్‌ జగన్‌ అమలు చేస్తామన్న నవరత్నాలుపైన, ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలా సాధ్యం? అంటూ గంటల తరబడి డిబేట్లు పెట్టడం, జగన్‌ అధికారం కోసం అలవికాని హామీ ఇస్తున్నారంటూ అందరితో విమర్శలు చేయించడం ఆంధ్రప్రదేశ్‌లో ఒక వర్గం మీడియాకు నిత్యకృత్యమై పోయింది.

జగన్‌ మీద ఉన్న కేసులపై అనేక అసత్య కథనాల్ని ప్రముఖంగా ప్రచురించడం; జగన్‌ను దూషిస్తూ తెలుగు దేశం మంత్రులు, శాసనసభ్యులు చేసిన విమర్శల్ని పతాక శీర్షికలుగా చేసుకోవడం వంటి నీతిబాహ్యమైన చర్యల్ని అనుకూల మీడియా అనేకం చేశాయి, చేస్తూనే ఉన్నాయి. చంద్రబాబు చేసే విన్యాసాలను ఒక వర్గం మీడియా గొడుగు పడుతున్న తీరు వెనుక ఆర్థిక, వర్గ, కుల ప్రయోజనాలు తప్ప వేరొకటి కనపడదు. చంద్రబాబు వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎంతగా వెనకేసుకొస్తున్నప్పటికీ.. ప్రత్యామ్నాయ మీడియా, ప్రత్యేకించి సోషల్‌ మీడియా ద్వారా ప్రజలు చైతన్యం అయ్యారు. వాస్తవాలు తాత్కాలికంగా మరుగున పడవచ్చునేమోగానీ శాశ్వతంగా గొంతు నొక్కడం ఎవరికీ సాధ్యం కాదు. 

వ్యాసకర్త: సి. రామచంద్రయ్య, మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్సీపీ అధికార ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement