
'ఎంతసేపూ మీకు పబ్లిసిటీ పిచ్చేనా?'
హైదరాబాద్: తన వల్లే పీవీ సింధుకు ఒలింపిక్స్ లో పతకం వచ్చిందని సీఎం చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఆయనకు ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చేనా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణ నదికి పుష్కరాలు తానే తీసుకొచ్చానని, పుష్కరాలను తానే సాగనంపుతానని చంద్రబాబు చెప్పుకొంటున్నారని, ఆయన పబ్లిసిటీ స్టంట్లు మితిమీరిపోయాయని విమర్శించారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన వల్లే పుష్కరాలు వచ్చాయని చంద్రబాబు చెప్పడమేమిటని ఆయన ప్రశ్నించారు.
రాయలసీమలో కరువుతో రైతులు, నిరుద్యోగం వల్ల యువత అల్లాడుతున్నారని, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ, గోదావరి పుష్కరాల పేరిట దాదాపు రూ. 3,500 కోట్లను అధికార పార్టీ నేతలు దోచుకున్నారని, పుష్కరాల కోసం 10శాతం నిధులను ఖర్చు చేస్తే.. 90శాతం నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆయన విమర్శించారు. పుష్కరాలను భక్తితో నిర్వహించాలని తాము కోరుతున్నామని, కానీ సినీఫక్కీలో నిర్వహిస్తూ ఆ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య గురించి, గ్యాంగ్ స్టర్ నయీం గురించి సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. నయీంను పెంచి పోషించింది చంద్రబాబేనని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు రహస్య అవగాహనతో ఓటుకు నోటు కేసును నీరుగార్చాయని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులపై సీబీఐ విచారణ జరిపించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడే నయీంతో సెటిల్ మెంట్ చేసుకోమన్నాడంటే.. ఇంకెంతమంది ఆంధ్రా మంత్రులతో నయీంతో సంబంధాలు ఉన్నాయో అర్థమవుతోందని చెప్పారు. బిల్లీరావు, తెల్గీ వంటివాళ్లను తయారుచేసింది చంద్రబాబేనని విమర్శించారు.