ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. కాంగ్రెస్‌లో ఒక్కరికీ నేనెవరో తెలీదు. బీజేపీలోకి వచ్చి ఒక్కరోజైనా కాలేదు. ముప్పై ఏళ్లుగా నేను బీజేపీలో ఉన్నట్లే అంతా నన్ను పలకరిస్తున్నారు సంస్కారవంతమైన పార్టీ. ఎంత చక్కటి సంస్కారాన్ని అలవరిచారు మోదీజీ తన పార్టీకి!! నేనొచ్చాక, నా వెనుకే ఇంకో ఇద్దరు బీజేపీలోకి వచ్చారు. ఎవరో భార్యాభర్తలు. ‘‘ఎవరు వీళ్లు? ఎక్కడా చూడనట్లుందే?’’ అని శ్రీధరన్ పిళ్లైని అడిగాను. కేరళ బీజేపీ ప్రెసిడెంట్ ఆయన. ‘‘ఎవరైనా.. ‘ఎక్కడో చూసినట్లుందే’ అంటారు. మీరు మాత్రం ‘ఎక్కడా చూడన ట్లుందే’ అంటున్నారు. మీ ప్రశ్నలోనే సమా ధానం ఉంది.. వాళ్లెవరో’’ అన్నాడు పిళ్లై. ‘‘గాటిట్’’ అని పెద్దగా అరిచాను. ‘‘ఏమిటి గాటిట్’’ అన్నాడు పిళ్లై. ‘‘ఎక్కడా చూడనట్లుంటే.. వాళ్లు కాంగ్రెస్ వాళ్లై ఉంటారు. అంటే వీళ్లిద్దరూ కాంగ్రెస్ నుంచే కదా వచ్చారు బీజేపీలోకి’’ అన్నాను.
‘‘బ్రిలియంట్’’ అన్నాడు పిళ్లై!
అది నా బ్రిలియన్స్ కాదు. కాంగ్రెస్ పార్టీ బ్రిలియన్స్. రాజీవ్ గాంధీ దగ్గర పని చేశాను. నేనెవరో ఎవరికీ తెలీదు. సోనియా గాంధీ దగ్గర పని చేశాను. నా పేరేమిటో ఎవరికీ తెలీదు. రాహుల్ దగ్గర పని చేశాను. నేనెవరో నేనే మర్చిపోయాను. రాహుల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పుడు.. ఆ సభలో.. ‘ఎక్స్‌క్యూజ్‌మీ.. నా పేరేమిటో చెప్పగలరా?’ అని టెస్టింగ్ కోసం ఇద్దరుముగ్గుర్ని అడిగాను. తెలీదన్నారు! ‘పోనీ, టామ్ వడక్కన్ ఇక్కడెక్కడైనా మీకు కనిపించారా?’ అని అడిగాను. ‘మీపేరేమిటో కనుక్కుని మీకు చెప్పమంటే చెప్పగలం కానీ, టామ్ వడక్కన్ కనిపించాడా అని అడిగితే ఎలా చెప్పగలం? ఆ పేరే వినలేదు’’ అన్నారు!స్టన్ అయ్యాను! ఆ ఇద్దరుముగ్గురికికాస్త దూరంగా వెళ్లి, ఇంకో ఇద్దరుముగ్గుర్ని కదిలించాను. ‘‘చూడండీ.. అక్కడున్న ఆ ఇద్దరుముగ్గురు టామ్ వడక్కన్ పేరే వినలేదంటున్నారు. ఆశ్చర్యంగా లేదూ..’’ అన్నాను.‘‘ఆశ్చర్యం ఏముందీ.. వాళ్లకే కాదు, మాకూ తెలీదు.. టామ్ వడక్కన్ ఎవరో’’ అన్నారు. హర్ట్ అవ్వాలో అవకూడదో తెలీలేదు. ‘‘హర్ట్ అవనవసరం లేదు’’ అనే మాట వినిపించింది! తలతిప్పి చూశాను. ‘‘మీరు వడక్కన్ కదా!’’ అన్నాడు ఆ వ్యక్తి. నివ్వెరపోయాను. నిశ్చేష్టుడినయ్యాను. నాకు నేనే కొత్తగా అనిపించాను.‘‘మీరు టామ్ వడక్కన్ కదా!’’ అన్నాడు ఆ వ్యక్తి మళ్లీ. ఆరాధనగా అతడి వైపు చూశాను.
‘‘మీరెవరు?’’ అని అడిగాను.
‘‘నేనెవరో మీకు తెలియనవసరం లేదు. మీరెవరో ఈ ప్రపంచానికి తెలియాలి. మీది త్రిశ్సూర్ అని తెలియాలి. కార్పొరేట్ ఉద్యోగం మానేసి కాంగ్రెస్‌లో చేరారని తెలియాలి. ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తానని ముప్పై ఏళ్లుగా అడుగుతున్నా కాంగ్రెస్ మీకు టికెట్ ఇవ్వలేదని తెలియాలి. పుల్వామా ఎటాక్‌ల మీద కాంగ్రెస్ పార్టీ యాంటీ–ఆర్మీ కామెంట్స్ మమ్మల్ని బాధించాయని తెలియాలి. అందుకే మీరు బీజేపీలో చేరారని తెలియాలి’’ అన్నాడా వ్యక్తి ఆవేశంగా! కన్నీళ్లొచ్చేశాయి నాకు. ‘‘మీరెవరో చెప్పారు కాదు’’ అన్నాను చేతులు జోడిస్తూ. ‘‘రవిశంకర్ ప్రసాద్ అంటారు నన్ను. మోదీ దగ్గర మినిస్టర్‌ని’’ అన్నాడు. ‘‘కేరళలో మిమ్మల్ని పిళ్లై మీట్ అవుతాడు’’ అని చెప్పాడు. చెప్పినట్లే పిళ్లై నన్ను కలిశాడు.‘‘ఏంటి పిళ్లై.. ఆ చప్పుళ్లు?’’ అని అడిగాను. ‘‘ఆ భార్యాభర్తలు వచ్చారు కదా. వాళ్లను ఆహ్వానిస్తూ డప్పులు కొడుతున్నారు’’ అన్నాడు! నిజంగానే పార్టీకి ఎంత మంచి సంస్కారం నేర్పించారు మోదీజీ!!. మాధవ్ శింగరాజు
రాయని డైరీ.. టామ్ వడక్కన్ (బీజేపీ!)
Published Sun, Mar 17 2019 1:07 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment