వాత పెట్టాక కీలు వెతకాలా? | Sekhar Guptha write article on Indian Army | Sakshi
Sakshi News home page

వాత పెట్టాక కీలు వెతకాలా?

Published Sat, Sep 30 2017 12:59 AM | Last Updated on Sun, Oct 1 2017 11:55 AM

Sekhar Guptha write article on Indian Army

జాతిహితం

సైనిక చర్యకు సంబంధించి రెండు అంశాలున్నాయి. అవి ఎత్తుగడల పరమైనవి, వ్యూహా త్మకమైనవి. ఎత్తుగడల పరంగా మెరుపుదాడులు విజయవంతమయ్యాయి. అవతలి పక్షం నుంచి గాయాలు, నష్టాలకు సంబంధించి నిర్దిష్ట ప్రకటన రాకున్నప్పటికీ, అధీన రేఖ పొడవునా అత్యంత వృత్తి నిపుణతతో కూడిన ప్రమాదకరమైన సైనిక దాడులు ఆ ఘటన తర్వాత నుంచి వెల్లువెత్తిన విషయం మనం గుర్తించాలి. అదే సమయంలో మెరుపుదాడులకు సంబంధించిన విస్తృత, వ్యూహాత్మక లక్ష్యం ఏమిటన్నది ఎవరూ ప్రకటించలేదు.

పాకిస్తాన్‌ భూభాగంలో భారత్‌ మెరుపు దాడులు జరిపి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంలో కూడా, ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లు అవి నిజం గానే జరిగాయా లేదా, ఆ దాడులు సాధించినదేమిటి అని మనం ఇప్పటికీ వాదులాడుతున్నట్లయితే, అది మన వ్యూహాత్మక భావాల కుంగుబాటునే చూపిస్తుంది. గత సంవత్సరం జరిగిన మెరుపు దాడులనుంచి భారత్‌కు కలి గిన లాభదాయక ఫలితాన్ని మనం లెక్కిస్తున్నందున, దానికి సంబంధించి రెండు సాక్ష్యాధారాలు మనముందున్నాయి. మొదటిది రాజకీయ నాయకత్వం ఆదేశం మేరకు సైనిక యంత్రాంగం సమర్పించిన సాక్ష్యాధారం. ఇది తెరపై లేజర్‌ పెన్‌తో చిత్రాలను లేక క్షేమంగా వెనక్కు వచ్చిన వారిని సాక్ష్యంగా చూపింది తప్పితే మొత్తం సైనిక చర్యను వర్ణరంజితంగా మీడియా సమావేశంలో వివరించే సాంప్రదాయిక రీతిలో దీన్ని చూపించలేదు. సంప్రదాయక వార్తా మాధ్యమం ద్వారా చూపించారు. భారత్‌ జరిపిన సర్జికల్‌ దాడుల ప్రథమ వార్షికం సందర్భంగా రెండు ముఖ్యమైన పుస్తకాలు విడుదల అయ్యాయి. వీటిని సైనిక–రాజకీయ సమ్మేళనంతో బాగా పరిచయమున్న రక్షణరంగ పాత్రికేయులు రచించారు. వీరిద్దరూ సైనిక వ్యవహారాలను నివేదించడంలో మంచి శిక్షణ పొందారు. కాబట్టి మీరు ఈ రెండు పుస్తకాలను విలువైనవిగా పరిశీలించవచ్చు.

మెరుపుదాడులు కల్పితం కాదు.. నిజమే..!
ఈ రెండు పుస్తకాలూ భారత్‌ మెరుపు దాడులు చేసిందని నొక్కిచెబుతున్నాయి. తమ పేరు ప్రకటించడానికి ఇష్టపడని ప్రత్యేక బలగాలకు చెందిన కొందరు యువ అధికారులతో నేరుగా జరిపిన ఇంటర్వ్యూలనే ఇవి ప్రాథమిక సాక్ష్యంగా చూపించాయి. అందుకే వీటిని మనం నిజమైన విలువైన రచనలుగా తీసుకోవచ్చు. పైగా అగ్రశ్రేణి సైనికాధికారులు, రాజకీయ నాయకత్వం నుంచి తీసుకున్న ఉల్లేఖనలను కూడా ఈ పుస్తకాల్లో పొందుపర్చారు. సర్జికల్‌ దాడుల వెనుక అంతర్గత రాజకీయ ఉద్దేశానికి సంబంధించిన విస్తృత దృక్పథాన్ని మనం వీటిలో చూడవచ్చు. నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి.. ఇది ప్రజాస్వామ్యపు కచ్చితమైన, చట్టబద్ధమైన లక్ష్యం.

మెరుపుదాడులకు సంబంధించిన మరొక సాక్ష్యం కమాండో కామిక్‌ చానల్స్‌ అంటూ మనం తరచుగా పిలుచుకునే టీవీ చానల్స్‌లో నిరంతరాయ వార్తల కవరేజ్‌. అది మనను పెద్దగా ఒప్పించలేకపోవచ్చు, బాల్య చేష్టగా కూడా కనిపించవచ్చు. ఈ చానళ్లలో పూర్తి సైనిక చిహ్నాలతో కనిపిస్తూ ముసుగు ధరించిన పారా–కమాండో అధికారుల ఇంటర్వ్యూలను చూడవచ్చు. ఉడి దాడులపై తామెంత ఆగ్రహంతో ఊగిపోయామో, మెరుపుదాడులకు తామెలా సన్నద్ధమయ్యామో, దాడులను నిర్వహించి ఎలా క్షేమంగా వచ్చామో ఆ ఇంటర్వ్యూలలో వీరు ఉత్సాహంగా చెప్పడాన్ని మనం చూస్తాం.

సైనికాధికారులు వివరిస్తూండగా సైనిక చర్య గురించిన అస్పష్టంగా కనిపించే నైట్‌ విజన్‌ చిత్రాలు టీవీలోని సగం తెరలో మనకు కనిపిస్తుం టాయి. సన్నీడియోల్‌ సినిమాల్లోలాగా మంచి కమాండో కాల్పులు జరపడం, దుర్మార్గుడు బుల్లెట్‌ దాడులకు గురై చక్కగా నేలకూలిపోవడాన్ని కూడా స్పష్టంగా కెమెరా చిత్రీకరించడం మనం చూడవచ్చు. అయితే చిన్న పిల్లలు ఇష్టంగా చూసే కమాండో వీడియోల నుంచే ఈ చిత్రాలను తీసుకుని ఉన్నప్పటికీ, మూడు వాస్తవాలు మాత్రం మారవు. ఒకటి, మెరుపు దాడులని చెబుతున్నవి నిజంగా జరిగాయనేందుకు తగినంత ఆధారం ఉంది. రెండు, తీవ్ర నష్టాలు జరగకుండానే భారత ప్రత్యేక దళాలు సురక్షితంగా తిరిగొచ్చాయి. సైనికుల గాయాలను దాచిపెట్టడం అసాధ్యం. పైగా భారత్‌ అలా చేయదు కూడా. మూడోది, రాత్రివేళ జరిగిన ఈ ప్రతీకార దాడి ఇచ్చిన సంతృప్తిని పక్కనబెడితే ఈ దాడులు ఏం సాధించాయన్నది ఎవరూ చెప్పడం లేదు.

సైనిక చర్యకు సంబంధించి రెండు అంశాలున్నాయి. అవి ఎత్తుగడల పరమైనవి, వ్యూహాత్మకమైనవి. ఎత్తుగడల పరంగా మెరుపుదాడులు విజయవంతమయ్యాయి. అవతలి పక్షం నుంచి గాయాలు, నష్టాలకు సంబంధించి నిర్దిష్ట ప్రకటన రాకున్నప్పటికీ, అధీన రేఖ పొడవునా అత్యంత వృత్తినిపుణతతో కూడిన ప్రమాదకరమైన సైనిక చర్యలు ఆ ఘటన తర్వాతనుంచి వెల్లువెత్తిన విషయం మనం గుర్తించాలి. మన కమాండోలు అత్యంత గోప్యతను పాటించడంతోపాటు అత్యంత నిర్దిష్టంగా మెరుపుదాడులను నిర్వహించి, తిరిగొచ్చారు. కశ్మీర్‌ వంటి కల్లోలభరిత రంగంలో మెరుపుదాడులను నిర్వహించడం చాలా కష్టం. అందుకే దీన్ని మనం విజయంగానే ప్రకటించవచ్చు.

ఫలితాన్ని స్పష్టపరచని సాహస చర్య
అదే సమయంలో మెరుపుదాడులకు సంబంధించిన విస్తృత, వ్యూహాత్మక లక్ష్యం ఏమిటన్నది ఎవరూ ప్రకటించలేదు. ఉడి వంటి ఘాతుక చర్యలకు ఎప్పుడు పాల్పడినా దానికి ప్రతీకార దాడి తప్పదని పాకిస్తానీయులను హెచ్చరించడమా? లేక భవిష్యత్తులో అలాంటి దాడులను తలపెట్టకుండా ద్వేషపూరితమైన ఉగ్ర చర్యల నుంచి పాక్‌ను అడ్డుకోవడమా? గత సంవత్సర కాలంగా ఈ రెండింటిలో ఏదీ చోటు చేసుకోలేదని స్పష్టమైన ఆధారం ఉంది. ప్రత్యేకించి రెండో అంశం అసలు చోటుచేసుకోలేదు.

మన దేశంలో రక్షణరంగంపై రాసే అత్యంత గొప్ప రిపోర్టర్, నా సహచరుడు మను పబ్బీ.. పార్లమెంటులో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలతోపాటు అధికారిక రికార్డులను పరిశోధించి చెప్పిన విషయం ఏమిటంటే, పాక్‌ బుద్ధిగా మసులుకోవడానికి బదులుగా, అధీన రేఖ పొడవునా పాక్‌ బలగాల దుశ్చ ర్యలు ఈ సంవత్సరం బాగా పెరిగాయనే. ఈ ఏడాది జూలై 11 నాటికి పాక్‌ జరిపిన కాల్పుల విరమణ ఉల్లంఘన చర్యల సంఖ్య 228కి చేరుకుంది. 2016 మొత్తంమీద జరిగిన కాల్పుల విరమణ ఉల్లంఘన చర్యల సంఖ్యకు ఇది సమానం. అయితే చొరబాటుదారులను కాల్చి చంపడంలో భారత సైన్యం మరిన్ని విజయాలు సాధించింది. 2016లో 37 మంది చొరబాటుదారులను హతమార్చగా, 2017 జూలై నాటికే 36 మందిని భారత్‌ బలగాలు హతమార్చాయి. అధీన రేఖ నిర్వహణలో మన విజయాన్ని, మెరుగుదలను ఇది సూచిస్తోంది.

అయితే మొత్తం గణాంకాలను చూస్తే ఈ సాహసిక దాడుల లక్ష్యం పాక్‌ను నిరోధించడమే అయితే, ఆ లక్ష్యం ఇప్పటికీ నెరవేరనట్లే.
వ్యూహాత్మక శాస్త్రాలు, సైనిక వృత్తికి సంబంధించిన స్వభావం ఏదంటే, కొత్త సాఫ్ట్‌వేర్‌ లేదా యాప్‌ లాగా కాకుండా, ప్రతి రెండు రోజులకు ఒకసారి మౌలికమైన కొత్త భావాలు ఇక్కడ ఆవిష్కృతం కావు. బ్రిటిష్‌ జనరల్‌ రూపర్ట్‌ స్మిత్‌ రాసిన ‘ది యుటిలిటీ ఆఫ్‌ ఫోర్స్‌’  పుస్తకం ప్రచురణతో 2005లో యుద్ధతంత్రానికి సంబంధించి కొత్త విప్లవం చోటుచేసుకుంది. ఈ పుస్తకం ప్రపంచ ప్రఖ్యాత సైనిక జనరల్‌ కార్ల్‌ వాన్‌ క్లాస్‌విట్జ్‌ ప్రామాణిక రచనలతో సరిసమానమైనదిగా కొందరు ప్రశంసించారు. ఈ పుస్తకంపై ప్రపంచ స్థాయిలో పేరొందిన 10 గొప్ప సమీక్షల్లో 6 సమీక్షలు ఆ పుస్తకంలోని ‘యుద్ధం ఇక ఉనికిలో ఉండదు’ అనే ఉత్తేజకరమైన 4 పదాల వాక్యంతో మొదలయ్యాయి.

పాత తరహా యుద్ధాలకు కాలం చెల్లినట్లేనా?
ఈ వాక్యం అంతగా మింగుడుపడనిది. స్పష్టమైన ఫలితాన్ని ఆశిస్తూ.. మనుషులు, యంత్రాలు వంటి భారీ స్థాయి విభాగాలతో చేసే సాంప్రదాయకమైన ‘పారిశ్రామిక స్థాయి’ యుద్ధాలకు ఇప్పుడు కాలం చెల్లిందని రూపర్ట్‌ స్మిత్‌ ఆ పుస్తకంలో పేర్కొన్నాడు. కొత్తయుద్ధాలు ప్రజలమధ్యే జరుగుతాయని అతడన్నాడు. అంటే ఈ తరహా యుద్ధాలు స్వల్పస్థాయితో, చెల్లాచెదురుగా ఉండే భూభాగాల్లో, వివిధ కాలక్రమాల్లో జరుగుతాయి. అతి పెద్ద, భారీ స్థాయి సైన్యాలతో ఈ తరహా యుద్ధాలను ముగించడం కష్టమనీ, ఇలాంటి భారీ స్థాయి సైన్యంకోసం ఖర్చుపెడుతూ దేశాలు తమ చర్యను సమర్థించుకునేటంత ప్రయోజనం దీనిలో ఉండదని తెలిపింది. తమ పొరుగునే ఉన్న రాజ్యరహితమైన పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌ గ్రహించినట్లుగా, ఇప్పుడు ఆప్ఘానిస్తాన్‌లో అమెరికా గ్రహిస్తున్నట్లుగా ఈ కొత్త తరహా యుద్ధాలు ఎన్నటికీ ముగిసిపోవనీ తెలిపింది.

యుద్ధం చేస్తున్న ప్రజల వ్యవహారంలో దేశాలు జోక్యం చేసుకున్నప్పుడు పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుందని చెప్పింది. లేదా, అధీన రేఖకు ఇరువైపుల ఉన్న ప్రజలతో పాక్‌ జోక్యం చేసుకుంటున్న సందర్భంలో భారత్, పాక్‌లకు ఇది మరింతగా వర్తిస్తుందని వివరించింది. మెరుపుదాడుల వ్యూహాత్మక విజయం ఎత్తుగడల పరంగా మన కమాం డోలు సాధించిన అత్యద్భుతమైన ఫలితంతో ఎందుకు సరిపోవడం లేదని అర్థం చేసుకోవడంలో ఇది మనకు తోడ్పడుతుంది. ఉగ్రవాదులు అపరిమిత వనరుగా విస్తృతస్థాయిలో లభిస్తున్నారు కాబట్టి ఉగ్రవాదుల ప్రాణాలు కోల్పోవడాన్ని పాకిస్తాన్‌ లెక్క చేయదు. ఈ సంప్రదాయేతర యుద్ధంలో వారిని సైనికంగా అడ్డుకోవడానికి, అలాంటి మెరుపుదాడుల్ని తరచుగా ఏకపక్షంగానే నిర్వహించాల్సిన అవసరముంది. సైనికపరంగా

పాకిస్తాన్‌పై ఇలాంటి సానుకూల సౌష్టవం భారత్‌కు ఉందా?
మన దేశంలో రెండు ఉదాహరణలు చాలా ప్రజాదరణ పొందాయి. అవి.. పాలస్తీనా ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడులు, చాలా కాలంగా అఫ్గానిస్తాన్‌–పాక్‌లపై, ఇప్పుడు ఐసిస్‌కు బలమున్న ప్రాంతాలపై అమెరికా చేస్తున్న డ్రోన్‌ దాడులు. సైనికంగా పూర్తి పాటవంతో, గగనతల ఆధిక్యతతో ఉన్న వాతావరణంలో ఇవి పనిచేస్తాయి. అయితే అత్యంత ప్రమాదకరమైన, ఖర్చుతో కూడిన డ్రోన్‌లకు తమవైన పరిమితులున్నాయి. పటిష్టమైన గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలో డ్రోన్‌లు పనిచేయవు. మన సైనిక రక్షణ పాటవం మరింతగా పెరగాలన్న ఆకాంక్ష సరైందే కాని, రక్షణ రంగంపై పెడుతున్న ఖర్చును గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నానా అని భారత్‌ తన్ను తాను ప్రశ్నించుకోవాలి.

జీడీపీలో ఇప్పుడు రక్షణరంగంపై పెడుతున్న 2 శాతంకంటే తక్కువ వ్యయాన్ని అది రెట్టింపు చేయాల్సి ఉంటుంది. రాజీవ్‌ గాంధీ 1987–88లో మన రక్షణ రంగ బడ్జెట్‌ను 3.38 శాతం వరకు తీసుకుపోయారు. అయితే 1990–91లో ఆయన మనకు ఆర్థిక సంక్షోభాన్ని కూడా కానుకగా ఇచ్చారు. పాకిస్తాన్‌ నుంచి ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇదే మార్గమైతే, భారత్‌ గట్టిగా ఊపిరి పీల్చుకుని కృతనిశ్చయంతో ముందుకు సాగాలి. దీనికంటే తక్కువ ఖర్చుతో కూడిన మార్గాలున్నాయా? మెరుపుదాడుల వార్షికోత్సవ తంతును శాస్త్రోక్తంగా జరుపుకోవడం కాకుండా భారత వ్యూహాత్మక నిపుణుల బృందం చర్చించాల్సిన అంశం ఇదే మరి.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement