హిందుత్వపై సరికొత్త సమరం | Shekhar Gupta Article On rahul Gandhi Visit Manasarovar | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 8 2018 12:36 AM | Last Updated on Sat, Sep 8 2018 8:26 AM

Shekhar Gupta Article On rahul Gandhi Visit Manasarovar - Sakshi

దేశం అంటే జేఎన్‌యూను దాటి విస్తరించిన ప్రాంతమనీ, ఏ రాజకీయపక్షం కూడా మతానికి దూరంగా ఉండి దేవుళ్లందరినీ రాజకీయ ప్రత్యర్థులకు వదిలివేయదనే తెలివైన అవగాహన రాహుల్‌గాంధీని నడిపిస్తోంది. తమకు పోటీగా భక్తిశ్రద్ధలున్న హిందువుగా కనిపించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు బీజేపీని కంగారుపెడుతు న్నాయి. అందుకే, రాహుల్‌ మానససరోవర్‌ యాత్ర ఫొటోలపై అనుమానాలు రేకెత్తేలా మాట్లాడింది. హిందువులుగా తమ మతంపై తమకున్న గుత్తాధిపత్యాన్ని రాహుల్‌ తాజా యాత్రలతో దెబ్బతీస్తారని బీజేపీ ఊహించలేదు. హిందువులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్‌ కొంత మేరకు బీజేపీ మార్గంలోనే పయనించడం కొత్త పరిణామం.

పరమశివుడి దయ కోసం కైలాస్‌ మానస సరోవర్‌ వెళ్లిన రాహుల్‌ గాంధీ పాలకపక్షంలో గుబులు పుట్టించగలిగారు. ప్రతిపక్ష నాయకులకు ఇంతకన్నా ఏం కావాలి? నిజానికి కాంగ్రెస్‌ అధ్యక్షుని తీర్థయాత్రపై బీజేపీ నేతలు సక్రమంగా అలోచించి ‘ఎంత గొప్ప ఐడియా వచ్చింది, మీకు! భోలేనాథుడు(శివుడు) మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీ ప్రత్యర్థుల కోసం కూడా మీరు శివుడ్ని ప్రార్థించండి’ అని స్పందించి ఉంటే బావుం డేది. శివుడు కూడా బీజేపీని మెచ్చుకునేవాడు. బీజేపీ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. లోక్‌సభలో కాంగ్రెస్‌ కన్నా బీజేపీకి ఆరు రెట్ల బలం ఎక్కువున్నా కాషాయపక్షంలో ఆత్మవిశ్వాసం ఆ స్థాయిలో కనిపిం చడం లేదు. రాహుల్‌ పంపిస్తున్న యాత్ర ఫొటోలు నిజమైనవా, కావా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ట్విటర్‌ వ్యాఖ్యలతో వివాదాల మంటలు సృష్టించే కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఈ వివాదం రేపారు. ఊతకర్రతో దిగిన రాహుల్‌ ఫొటోలు ఫొటో షాప్‌ ద్వారా తయారుచేసినవని, ఆ చిత్రంలో రాహుల్‌ వెనుక నీడ లేదంటే ఫొటో నిజం కాదని ఆయన చెప్పారు. రాహుల్‌ ఎంత తెలివిగా యాత్ర వెళితే, బీజేపీ అంత తెలివి తక్కువగా కైలాస యాత్రపై వ్యాఖ్యానించింది. బీజేపీకి నెహ్రూపై ఎంత వ్యతిరేకత ఉందంటే, దేవుని ఉనికిపై తేల్చి చెప్పలేని ఆయన అజ్ఞేయవాదమే ఆయన వారసులను కూడా నడిపిస్తోందనే పిచ్చి నమ్మకం దాన్ని పీడి స్తోంది. ఇందిరాగాంధీ, రాజీవ్, ఇద్దరూ ఆస్తికులు గానే వ్యవహరించారు. వీరిద్దరూ లౌకికమార్గంలో పయనించారంటే వారు తమ ‘వంశ’ స్థాపకుడు నెహ్రూలా దేవునిపై విశ్వాసం లేనివారని అనుకో వడం తెలివితక్కువతనమే. ఇందిర మెడలో రుద్రాక్ష మాల ఉండేది. ఆలయాలు, బాబాలు, తాంత్రికులను దర్శించడం ఆమెకు అలవాటే. రాజీవ్‌గాంధీ తాను ప్రధానిగా ఉండగా అయోధ్యలో రాముడి గుడి తలుపులు తీయించారు.

ఇక్కడ నిర్మించే ఆలయానికి భూమిపూజకు అనుమతించారు. గెలిస్తే రామరాజ్యం తెస్తానంటూ 1989 లోక్‌సభ ఎన్నికల ప్రచారం అయోధ్య నుంచే ప్రారంభించారు. అయితే కాంగ్రెస్‌ నేతృత్వంలో సాగిన పదేళ్ల యూపీఏ పాలనపై నరేం ద్రమోదీ–అమిత్‌షా నడిపే బీజేపీలో కొంత గందర గోళం ఉంది. మొదటి ఐదేళ్లూ వామపక్షాల మద్ద తుతో మన్మోహన్‌సింగ్‌ సర్కారు నడవడం బీజేపీ అవగాహనలో లోపానికి కారణం. మధ్యేవాద, లెఫ్ట్‌ పార్టీలపై ఆధారపడి నడవడం వల్ల ఈ ప్రభుత్వం మతపరమైన ఎలాంటి ప్రదర్శన లేకుండా సాగింది. అయితే, అమెరికాతో చేసుకున్న అణు ఒప్పందాన్ని సమర్థిస్తూ దూకుడుగా మన్మోహన్‌ జవాబిస్తూ, గురు గోవింద్‌సింగ్‌ పంజాబీలోకి తర్జుమా చేసిన చండీ ప్రార్థన గురించి తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. యుద్ధానికి వెళ్లే ముందు చండీ మాత ‘నేనెప్పుడూ మంచి చేసేలా, నేను శత్రువుతో తలపడినప్పుడు గెలి చేవరకూ పోరాడేలా నన్ను ఆశీర్వదించండి’ అంటూ శివుడిని కోరుతూ చేసిన ప్రార్థనను మన్మోహన్‌ పార్ల మెంటులో గుర్తుచేశారు.

లౌకికత్వంపై బీజేపీకి అవగాహన ఎంత?
నెహ్రూ పాటించిన పకడ్బందీ లౌకికవాదాన్ని కాంగ్రెస్‌ ఎప్పుడో వదిలేసింది. కానీ, కాంగ్రెస్‌ దాన్నే పట్టుకు వేళ్లాడుతోందనే పొరపాటు అవగాహన బీజేపీకి ఉంది. ఇందిర హయాం నుంచీ కాంగ్రెస్‌ అన్ని మతాలవారిని ఏక కాలంలో ఆకట్టుకునే విధా నాలు బాహాటంగా అనుసరించింది. అంటే, హిందు వులకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తూనే, మైనారిటీల పక్షాన గట్టిగా నిలబడుతున్నట్టు ప్రకటించు కుంది. దీన్నే బీజేపీ మైనారిటీలను బుజ్జగించడంగా విమర్శిస్తోంది. అయితే, రాహుల్‌ మరి కొన్ని అడు గులు ముందుకేసి తాను ‘జంధ్యం వేసుకున్న హిందు వు’గా జనం ముందుకొచ్చారు. వాస్తవానికి దేవుని నమ్మే మనలో చాలా మంది జంధ్యాలు ధరించరు. తెల్ల బట్టలతో ఆలయాలకు వెళ్లరు. రాహుల్‌ మాత్రం ముందే గొప్ప ప్రచారంతో టిబెట్‌లోని మానస సరోవర్‌కు తీర్థయాత్ర స్థాయిలో వెళ్లారు. అయితే, ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరూ ప్రదర్శించని విధంగా రాహుల్‌ తాను హిందువుననే విషయాన్ని చాలా దూకుడుగా ప్రదర్శించుకుంటున్నారు.

బీజేపీ తీవ్రవాద హిందుత్వకు విరుగుడుగా ఆయన సుతి మెత్తని హిందుత్వ మార్గంలో పయనిస్తున్నారు. కర డుగట్టిన లౌకిక వామపక్షవాదుల్లో రాహుల్‌కు కొత్తగా మద్దతుదారులైనవారు మాత్రం ఈ పరిణామాలు దిగమింగుకోలేకపోతున్నారు. కానీ దేశం అంటే జేఎన్‌యూను దాటి విస్తరించిన ప్రాంతమనీ, ఏ రాజకీయపక్షం కూడా మతానికి దూరంగా ఉండి దేవుళ్లందరినీ రాజకీయ ప్రత్యర్థులకు వదిలివేయదనే తెలివైన అవగాహన రాహుల్‌గాంధీని నడిపిస్తోంది. తమకు పోటీగా భక్తిశ్రద్ధలున్న హిందువుగా కనిపించ డానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు బీజేపీని కంగా రుపెడుతున్నాయి. అందుకే, ఇటీవల దేవాలయాలు దర్శించినప్పుడు దేవుని విగ్రహాల ముందు హిందువులా సరిగా మోకాళ్లపై కూర్చోలేదంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. రాహుల్‌ మానససరోవర్‌ యాత్ర ఫోటోలపై అనుమానాలు రేకెత్తేలా మాట్లాడింది. హిందువులుగా తమ మతంపై తమకున్న గుత్తాధిపత్యాన్ని రాహుల్‌ తాజా యాత్రలతో దెబ్బ తీస్తారని బీజేపీ ఊహించలేదు. మొత్తంమీద హిందువులను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్‌ కొంత మేరకు బీజేపీ మార్గంలోనే పయనించడం కొత్త పరిణామం.

ఐదుగురి అరెస్టుపై అనూహ్య స్పందన!
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే సాకుతో ఇటీవల బీజేపీ సర్కారు అరెస్టు చేసిన ఐదుగురు ప్రముఖులకు రాహుల్‌ సూచనతో కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా మద్దతు, సానుభూతి ప్రకటించింది. కేంద్ర సర్కారు అరెస్టు చేసిన హక్కుల నేతలు, ‘పట్టణ నక్సల్స్‌’గా ముద్రవేసినవారికి రాహుల్‌ వెంటనే మద్దతు ప్రకటించారు. ఈ విషయంపై పార్టీ వేదికల్లో ఎక్కడా చర్చించలేదు. కాంగ్రెస్‌ రాజకీయ ఆలోచనలో మార్పునకు ఇదో సంకేతం. పైన చెప్పిన ఐదుగురు ప్రముఖుల్లో నలుగురిని ఆయన యూపీఏ ప్రభుత్వమే అరెస్టు చేసి, వేధించింది. వారిలో ఒకరు ఆరేళ్లు, మరొకరు ఏడేళ్లు జైల్లో గడిపారు. చట్టవ్యతి రేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఊపా) సహా అనేక నల్ల చట్టాల కింద వారిపై యూపీఏ ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసి జైళ్లో పెట్టింది. సాయుధ నక్సలైట్లను, వారికి సానుభూతిపరులుగా ఉండే మేధావులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వేటాడింది. అణచి  వేసింది.

మావోయిస్టు నేత కోబాడ్‌ గాంధీని, ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ అధ్యాపకుడు జీఎన్‌ సాయిబాబాను ఆయన యూపీఏ సర్కారు అరెస్టు చేసి, వారు అప్పటినుంచీ జైళ్లలో మగ్గిపోయేలా చర్యలు తీసుకుంది. రాహుల్‌ సొంత ప్రభుత్వానికి చెందిన రహస్య పోలీసు సంస్థలు ఇద్దరు ప్రముఖ మావోయిస్టు నేతలు చెరుకూరి రాజ్‌కుమార్‌ (ఆజాద్‌), మల్లోజుల కోటేశ్వరరావు(కిషన్‌జీ)లను ఎన్‌కౌంటర్ల పేరుతో దారుణంగా చంపించాయి. మరి ఇప్పుడు రాహుల్‌ నక్సల్స్‌ విషయంలో తన వైఖరి మార్చుకుంటున్నారా? వామపక్ష తీవ్రవాదం (నక్సలైట్లు) దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పు అని 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌ ప్రకటించారు. వామపక్షాల మద్దతుపై యూపీఏ ఆధారప డిన మొదటి ఐదేళ్లలో ఇదంతా జరిగింది. వామపక్షాలను, వామపక్ష తీవ్రవాదాన్ని వేరు చేసి మన్మోహన్‌ చాలా తెలివిగానే మాట్లాడారు. అంటే, ఈ వైఖరికి భిన్నంగా రాహుల్‌ భావిస్తున్నారని అనుకోవచ్చా? నక్సల్స్‌ విషయంలో కాస్త మెత్తగా ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా, ఆయన యూపీఏ ప్రభుత్వ వైఖరికి విరుద్ధంగా నడిచే అవకాశాలు లేవు. అయితే, అప్పట్లో ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు మావోస్టుల చేతుల్లో చావు దెబ్బలు తిన్నప్పుడు అప్పటి కేంద్రమంత్రి పి.చిదంబరం కఠిన వైఖరి అవలంబించకుండా రాహుల్‌ తల్లి సోనియా ద్వారా ప్రయత్నించారనే ప్రచారం ఉంది.

1971 యుద్ధం, స్వర్ణాలయంలో ఆపరేషన్‌ బ్లూస్లార్‌ తర్వాత ఈ రాష్ట్రంలోని చింతల్నార్‌లోనే భద్రతాదళాలు ఎక్కువమందిని నష్టపోయాయి. చిదంబరం ఆదేశాలతో బస్తర్‌లో భద్రతాదళాలు నక్సలైట్లపై భారీ స్థాయిలో పోరు ప్రారంభించగానే, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయసింగ్‌ కేంద్ర సర్కారు అను సరిస్తున్న ఈ విధానం ‘ఒంటి కన్ను’దని దుయ్య బట్టారు. అప్పుడే ఒడిశాలో మావోయిస్టు్టలు అపహ రించిన ఓ ఐఏఎస్‌ అధికారిని విడుదల చేయించడానికి ప్రభుత్వం ఓ కీలక నక్సల్‌ నేత భార్యను విడుదల చేయించింది. సోనియా అధ్యక్షతన నడిచిన ఎన్‌ఏసీ సభ్యుడు, మాజీ ఐఏఎస్‌ అధికారి హర్ష మందర్‌ నడుపుతున్న ఓ ఎన్జీఓ సంస్థకు ఈ నక్సల్‌ భార్య అధిపతిగా ఉన్నారు. అలాగే, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు రాజద్రోహ నేరం మోపిన పిల్లల వైద్యుడు బినాయక్‌ సేన్‌ను కోర్టు దోషిగా తేల్చాక బెయిలుపై విడుదలవగానే అప్పటి ప్రణాళికా సంఘంలోని ఆరోగ్యకమిటీ సభ్యునిగా ఆయనను తీసుకున్నారు.

మారనున్న బీజేపీ ఎన్నికల వ్యూహం!
2017 డిసెంబర్‌ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన బీజేపీ అనుభవం దృష్ట్యా ప్రధానంగా ఆర్థికరంగంలో తమ సర్కారు పనితీరు ఆధారంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోరాడకూడ దని మోదీ–షా ద్వయం నిర్ణయించుకున్నట్టు తెలు స్తోంది. వారు ప్రజలకు తమ హిందుత్వ, అవినీతి వ్యతిరేక పోరాటం, తీవ్ర జాతీయవాదం–ఈ మూడు అంశాలకూ సమ ప్రాధాన్యం ఇచ్చి పార్లమెంటు ఎన్ని కల్లో విజయానికి ప్రయత్నిస్తారు. బీజేపీ హిందు త్వకు పోటీగా రాహుల్‌ తన తరహా హిందూత్వతో ప్రయోగాలు ప్రారంభించారు. జాతీయభద్రత విష యంలో మెతకగా వ్యవహరిస్తే భారత ప్రజలు సహించరు. సాయుధ నక్సల్‌ ఉద్యమానికి జనం పల్చగా ఉన్న కొన్ని మారుమూల జిల్లాల్లో తప్ప ఇంకెక్కడా మద్దతు లేదు. హిందుత్వ, జాతీయ వాదాలను పరిమిత స్థాయిలో ఆచరిస్తే కాంగ్రెసే నష్ట పోతుంది. రాహుల్‌ తన పంథా మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి విజయాన్ని స్వయంగా అందించినట్టే అవుతుంది.


శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement