ఆశల పల్లకిలో నేతల సందడి! | Sidharth Bhatia Writes Guest Column About Opposition Unity | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 23 2018 1:40 AM | Last Updated on Sat, Jun 23 2018 11:25 AM

Sidharth Bhatia Writes Guest Column About Opposition Unity - Sakshi

ఇప్పుడు అందరూ అనుకుంటున్న ప్రతిపక్షాల మహా కూటమి నిజంగా అవతరిస్తే అది ఒకరిద్దరు నేతల ప్రధానమంత్రి కావాలనే లక్ష్యానికి ఓ మార్గంలా మాత్రమే చివరికి మారుతుంది. మమత, మాయావతి, చంద్రబాబు నాయుడు, ఎప్పటి నుంచో రంగంలో ఉన్న శరద్‌ పవార్‌–వీరందరికీ ప్రధాని కావాలనే కాంక్ష ఉంది. ప్రధాన మంత్రి పదవి చేపట్టే అవకాశం వస్తే వారు సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారా? వారి పార్టీలు గెలిచే సీట్లకు ప్రాముఖ్యం ఇస్తారా? ఇతరుల నుంచి లభించే మద్దతు కీలకం అవుతుందా? అంటే చెప్పడం కష్టం. గతంలో హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌లను ప్రధానులను చేసిన పరిణామాలు కేంద్రంలో రాజకీయ అస్థిరతకు దారితీశాయి.

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌కు వ్యతిరే కంగా ముఖ్యమంత్రి అర వింద్‌ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు నిరసన చేపట్టినప్పుడు మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్‌ నిరాకరించింది. ఈ విషయమై ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్‌) విన్నపాలను, రాజకీయ పండితుల విమర్శలను కాంగ్రెస్‌ నాయకత్వం ఖాతరు చేయలేదు. కేజ్రీవాల్‌ బృందం బైఠాయింపు ఆందోళన ముగిసింది. అయితే తమదే విజయమని ఆప్‌ ప్రకటించినా, కేజ్రీవాల్‌ ఏం సాధించారో చెప్పడం కష్టం. ఆప్‌ అగ్రనేతల నిరసన సమయంలో ఢిల్లీ వచ్చిన నలుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రుల నుంచి కేజ్రీవాల్‌కు కొంత నైతిక మద్దతు లభించింది. ఇంకా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో కూడా సానుకూల స్పందన ఆప్‌ సర్కారుకు దక్కింది.

పరస్పర అనుమానాలతో ప్రమాదం
కాంగ్రెస్‌ ఈ గొడవలో తలదూర్చకుండా దూరంగా ఉంది. పార్టీ వరకూ ఇది మంచి ఆలోచనతో చేసిన నిర్ణయం. ఆప్‌ను కాంగ్రెస్‌ శత్రుపక్షంగానే పరిగ ణిస్తోంది. అంతేగాక కేజ్రీవాల్‌ పార్టీ బీజేపీ ‘బీ’ టీమ్‌ అనే అనుమానం కాంగ్రెస్‌లో బలంగా పాతుకు పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ప్రత్యక్ష పోటీ ఉన్న రాష్ట్రాల్లో తమ ఓట్లు చీల్చడానికే ఆప్‌ అన్ని సీట్లకు పోటీచేసిందని కాంగ్రెస్‌ నేతలు ఇది వరకే ఆరోపించారు. ఇందులో నిజం ఎంత ఉన్నా గాని ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్‌ను బహిరంగంగా సమర్థించ డానికి కాంగ్రెస్‌ ముందుకొచ్చే అవకాశం లేదు. అదీ గాక, కేజీవాల్‌కు మద్దతు పలకడం వల్ల మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు, పినరయి విజయన్, హెచ్‌డీ కుమారస్వామికి ఢిల్లీలో వచ్చేదిగాని, పోయే దిగాని ఏమీ లేదు. కాంగ్రెస్‌ పరిస్థితి పూర్తిగా భిన్నం. ప్రత్యర్థితో చేతులు కలిపి రాహుల్‌గాంధీ రాజధానిలో తన పార్టీకి కీడెందుకు చేస్తారు? ఇతర పక్షాలు, నేతలు అందరి మెప్పు పొందే పద్ధతిలో సమాఖ్య స్ఫూర్తి, ప్రతిపక్షాల ఐక్యత వంటి మాటలు చెబుతూ ఆప్‌ను సమర్థించారు. దీని వల్ల ప్రతిపక్షాల పోకడల్లో నిజమైన మార్పు ఏదీ రాదు. నరేంద్రమోదీ ప్రభు త్వం ఆప్‌ను అన్ని రకాలుగా దెబ్బదీయడానికి ప్రయ త్నిస్తోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఇంకా ముమ్మ రంగా ఈ పని చేస్తుంది. దీనివల్ల ప్రతిపక్షాల ఐక్యత బలపడుతుందా? ఆప్‌ విపక్ష మహా కూటమిలో చేరడానికి ఇది దారితీస్తుందా? అంటే కాలమే నిర్ణ యిస్తుంది. 

ప్రతిపక్షాల ఐక్యతకు ముందస్తు ప్రయత్నం?
నలుగురు ముఖ్యమంత్రుల ఢిల్లీ యాత్రను లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పా టుకు చేసిన ముందస్తు ప్రయత్నంగా భావిస్తున్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి అనేకమంది ప్రతిపక్ష అగ్రనేతలు బెంగళూరు వెళ్లినప్పుడు తొలి సారి ఇలాంటి ఆలోచన ముందుకొచ్చింది. ఆలింగ నాలు, కరచాలనాలతో ఈ నాయకులు మధ్య కనిపిం చిన ఐక్యత బీఎస్‌ యడ్యూరప్ప రాజీనామా చేశాక అవమానభారంతో కుమిలిపోతున్న బీజేపీకి హెచ్చ రికలా కనిపించింది. మోదీ–అమిత్‌షా ద్వయం ఏక మౌతున్న ప్రతిపక్షాల ఉమ్మడి బలాన్ని రుచి చూడాల్సి ఉంటుందనే సందేశం ఇవ్వగలిగారు. ప్రతి పక్షాలు ఐక్యతకు, అవి మీడియా ప్రచారం పొందడా నికి కేజ్రీవాల్‌ ధర్నా మరో అవకాశం కల్పించింది. కాని, కాంగ్రెస్‌ ఈ వ్యవహారంలో పాలుపంచుకోవ డానికి అంగీకరించలేదు.

అయితే, ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిజంగా ఐక్యత సాధించడానికి ఇంకా చాలా గట్టి కృషి చేయాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు దేని లెక్కలు దానికి ఉన్నాయి. తమ సొంత రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడమే ఈ పక్షాల ప్రధాన లక్ష్యం. వీటి మధ్య పొత్తుకు అవకాశమున్న రాష్ట్రాలే కనిపింవు. అనేక రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్న ఒక్క బీఎస్పీ పరిస్థితి మాత్రమే వీటికి భిన్నంగా ఉంది. కాంగ్రెస్‌ విష యానికి వస్తే ఇది జాతీయ పార్టీ. అనేక ప్రాంతీయ పార్టీలో ఆయా రాష్ట్రాల్లో అధికారం కోసం కాంగ్రెస్‌ ఎన్నో ఏళ్లుగా పోటీపడుతోంది. మరీ బలంగా లేని రాష్ట్రాల్లో సైతం బీజేపీయేతర పార్టీతో ఏర్పడే మహా కూటముల్లో చేరడం కాంగ్రెస్‌కు కుదిరే పని కాదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాల మహా కూటమికి లోక్‌సభ సీట్లలో సగానికి పైగా సీటు లభించే పక్షంలో ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడమే కాంగ్రెస్‌ లక్ష్యం. అందుకు అవసరమై నన్ని సీట్లు గెలవడమే ఈ పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు బలంలేని అనేక రాష్ట్రాల్లో ఈ పార్టీ గెలిచే సీట్లు బాగా తగ్గిపోతేనే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలకు లాభం. బీజేపీకి వ్యతిరేకంగా రూపుదిద్దు కునే ఏ ప్రతిపక్ష కూటమిలోనైనా బలహీనతగా కని పించే ప్రధాన వైరుధ్యం ఇదే. 

ఆప్‌ జాతీయ పార్టీ కాదు!
ఆమ్‌ ఆద్మీ పార్టీ సభ్యులు, అభిమానులు ఎలా అను కున్నా ఇది జాతీయ స్థాయి రాజకీయ పార్టీ కాదు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు సాగే రాజకీయాల్లో దీని పాత్ర చిన్నది. ఇతర ప్రతిపక్షాలను ప్రభావితం చేసే బలం దానికి లేదు. దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కావడం వల్లే అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆయనకున్న రాజకీయ ప్రాముఖ్యానికి మించిన మీడియా ప్రచా రం లభిస్తోంది. పదిహేనేళ్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు షీలా దీక్షిత్‌ను ఓడించడం కూడా కేజ్రీవాల్‌ స్థాయి పెరిగి పోవడానికి ఒక కారణం. అంతేగాక, ఆయన మద్దతు దారులు అనర్గళంగా, దూకుడుగా మాట్లాడతారు. సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా కనిపి స్తారు. అయితే, ఆప్‌ బలాబలాలను, రాజకీయ పోక డలను నిశితంగా పరిశీలిస్తే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ ఇప్పుడున్న నాలుగు సీట్లు కూడా గెలుచు కోవడం చాల కష్టం. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి సీటూ ముఖ్యమే అయినప్పుడు ఏ జాతీయ కూటమి అయినా ఆప్‌కు నాలుగు సీట్లు ఇవ్వడానికి ఎలా సిద్ధపడుతుంది? 

ఫ్రంట్‌ రూపురేఖలు ఎలా ఉంటాయి?
ఒకవేళ అన్ని ప్రధానమైన ప్రాంతీయపక్షాలతో ఏర్పాటయ్యే ఫెడరల్‌ ఫ్రంట్‌ రూపు రేఖలు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు చెప్పడం కష్టమేగాని కొంత సూచనప్రాయంగా అర్థమౌతోంది. ఈ ఫెడ రల్‌ ఫ్రంట్‌లో ఎవరు చేరాలి? ఏఏ పార్టీలను బయటే ఉంచాలి? అనే విషయాలను పెద్ద ప్రాంతీయ పార్టీలే నిర్ణయిస్తాయి. ఒక వేళ మమతా బెనర్జీ పార్టీ (తృణ మూల్‌ కాంగ్రెస్‌) ఈ ఫ్రంట్‌లో ప్రధాన పాత్రలో నిలబడితే వామపక్షాలకు ఇందులో స్థానం దక్కదు. అనేక మంది ప్రతిపక్ష, ప్రాంతీయపక్ష నాయకులతో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరికి ఎంతటి సత్సంబంధాలున్నా లాభం ఉండదు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి వామపక్షాలను తప్పక అడ్డుకుంటారు. గతంలో అనేక రాజకీయ వింతలు చూశాం. సమాజ్‌వాదీ పార్టీ–బీజేపీ మధ్య మంచి సంబంధాలు ఇలాంటి వింతే. అయితే, తృణ మూల్‌ కాంగ్రెస్, సీపీఎం మధ్య రాజీ కుదిరి అవి చేతులు కలిపే అవకాశాలు ఏమాత్రం లేదు. ఇప్పుడు అందరూ అనుకుంటున్న ప్రతిపక్షాల మహా కూటమి నిజంగా అవతరిస్తే అది ఒకరిద్దరు నేతల ప్రధాన మంత్రి కావాలనే లక్ష్యానికి ఓ మార్గంలా మాత్రమే చివరికి మారుతుంది. మమత, మాయావతి, చంద్ర బాబు నాయుడు, ఎప్పటి నుంచో రంగంలో ఉన్న శరద్‌ పవార్‌–వీరందరికీ ప్రధాని కావాలనే కాంక్ష ఉంది. ప్రధాన మంత్రి పదవి చేపట్టే అవకాశం వస్తే వారు సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారా? వారి పార్టీలు గెలిచే సీట్లకు ప్రాముఖ్యం ఇస్తారా? ఇతరుల నుంచి లభించే మద్దతు కీలకం అవుతుందా? అంటే చెప్పడం కష్టం. గతంలో ఇలాంటి సందర్బాల్లో అత్యంత శక్తిమంతమైన ఈ  పదవిని రాజీ అభ్యర్థిగా తొలుత హెచ్‌డీ దేవెగౌడ సాధించారు. ఆయన తర్వాత ఎవరికీ ముప్పులేని, కీడు చేయని అభ్యర్థిగా ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈ రెండు పరిణామాలు కేంద్రంలో రాజ కీయ అస్థిరతకు దారితీశాయి. అలాంటి ఏ ప్రంట్‌లోనైనా కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రముఖ అంశంగా ఉంటుంది. ఇది తనదైన గతిశీలతను కలిగి ఉంటుంది. ఈ తరహా కూట మిలో చంద్రబాబుకు స్థానముంటుందా లేక రాహుల్‌ గాంధీ అధికారానికి చేరువలో ఉన్న వైఎస్‌ జగన్‌తోనే సంప్రదింపులు జరుపుతారా? ఈ రెండు అంశాల్లో రాహుల్‌ వ్యక్తిత్వం దేంట్లో ఇమడగలుగుతుంది?

ఫ్రంట్‌ రాజకీయంలో ఏమైనా జరగొచ్చు..
పై అంశాలన్నీ బీజేపీ క్రియారహితంగా ఉంటుందనే ఊహాపరికల్పనకు దారిస్తుంది. తన కాళ్లకిందే ప్రత్యర్థి బలపడటానికి ఏ పార్టీ అనుమతించదు. బలమైన రాజకీయకూటమి నిజంగా ఏర్పడటాన్ని అది కష్టం సాధ్యం చేస్తుంది. అది కేంద్ర స్థాయిలో అధికారాన్ని అనుభవిస్తూంటుంది. దాని రాజకీయ వ్యూహకర్తలు రెండు లేక మూడు ఎత్తులు జిత్తులను అమలు చేయడంలో సుపరిచితులు. కొంతమంది ప్రతిపక్ష నేతలు తమ మనస్సు మార్చుకునేలా అధికార పక్షం ఒత్తిడి పెంచవచ్చు లేదా ఊరించవచ్చు. సమాజ్‌ వాదీ పార్టీ ఉన్నట్లుండి బహుజన్‌ సమాజ్‌ పార్టీతో తన పొత్తు పట్ల అసౌకర్యంగా భావించదని ఎవరైనా చెప్పగలరా? పైగా ప్రంట్‌ ఏర్పడిన తర్వాత దాంట్లో టికెట్లు పొందలేనివారు కూటమినుంచి జారిపోతే ఎలా ఉంటుంది? 

ఇప్పటికే రాజకీయ కదలికలు, వ్యూహాలు మొదలయ్యాయి. తెరవెనుక సల్లాపాలు జరుగుతున్నాయి కాబట్టి దృష్టికోణం చాలా ముఖ్యమైంది. ఢిల్లీలో నలుగురు ముఖ్యమంత్రులు తనను కలవడం కేజ్రీవాల్‌కి తప్పకుండా నైతిక మద్దతు నివ్వడమే కాకుండా బలమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. తమ తమ సొంత ఎజెండాలు కలిగి ఉన్న ఈ నలుగురూ ఢిల్లీకి వచ్చి సరైన అంశాలనే ప్రస్తావించారు. ఫొటోలు దిగి వెళ్లిపోయారు. అలాంటి మరొక అవకాశం తటస్థించినప్పుడు వారు మళ్లీ ఒకటిగా ముందుకొస్తారు కూడా.


సిద్ధార్థ్‌ భాటియా 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement