దాదాపు యాభై ఏళ్ల తర్వాత పొరుగుదేశమైన పాక్ భూభాగంలో వైమానిక దాడులకు తొలిసారిగా పాల్పడిన భారత్ తన వ్యూహాత్మక సంయమనానికి వీడ్కోలు చెప్పింది. దేశ ప్రజానీకం, ప్రపంచ దేశాలు కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై భారతీయ వాయుసేన తలపెట్టిన సైనికేతర దాడులను సమర్థించాయి. ఉగ్రవాద ముసుగు సంస్థల సాయంతో భారత్‌ను వెయ్యి ముక్కలు చేసి ఆటాడించవచ్చని ఇన్నాళ్లుగా భావించిన పాక్ సైనిక యంత్రాగానికి గట్టి దెబ్బ తగిలింది కానీ తనను తాను బాధితురాలిగా పేర్కొంటూ అంతర్జాతీయంగా భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు పాక్ చేసే భవిష్యత్ ప్రయత్నాలను భారత్ సమర్థవతంగా నిలువరించడం చాలా ముఖ్యం.
పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ ప్రాంతంలో కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ నడుపుతున్న అతి పెద్ద ఉగ్రవాద శిక్షణశిబిరాలను భారత వైమానిక బలగానికి చెందిన యుద్ధవిమానాలు ధ్వంసంచేసి క్షేమంగా తిరిగొచ్చాయి. దీంతో మోదీ ప్రభుత్వం ఒక కొత్త వ్యూహా త్మక భద్రతా సూత్రాన్ని ఆవిష్కరించినట్లయింది. వ్యూహాత్మక సంయమనం అని ఇన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన సూత్రాన్ని 5 దశాబ్దాల అనంతరం తొలిసారిగా తోసిపుచ్చిన భారత ప్రభుత్వం, మన భద్రతా వ్యవస్థ మన హద్దుల్ని తిరగరాశాయి. ఈ దాడుల నేపథ్యంలో పుట్టుకొచ్చిన సరికొత్త భావన ఇదే: ‘ప్రభుత్వేతర శక్తులు’ పేరుతో సాగుతున్న పాకిస్తాన్ మిథ్యానాటకం బట్టబయలైపోయింది.
సరిగ్గా 12 రోజుల క్రితం పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై తలపెట్టిన భీకరమైన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి తామే బాధ్యులమని ప్రకటించిన మసూద్ అజర్ నేతృత్వంలోని జైషేకు భారత్ తగిన బుద్ధి చెప్పింది. ఈ క్రమంలో 1971 తర్వాత పాకిస్తాన్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు తొలిసారిగా ప్రవేశించాయి. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత వైమానిక బలగాలు నియంత్రణ రేఖను దాటరాదని నాటి ప్రధాని వాజ్‌పేయి స్పష్టంగా ఆదేశాలిచ్చారు.
సాంప్రదాయిక యుద్ధ వ్యూహంలో తొలినుంచీ ముందంజలో ఉన్న భారత్ దాన్ని ఉల్లంఘించి మరింత దూకుడు విధానాలను ఎంతమాత్రం చేపట్టదని పాకిస్తాన్ ఇన్నాళ్లుగా గట్టి నమ్మకంతో ఉండేది. కానీ కశ్మీరులో సైన్యంపై సరికొత్త ఆత్మాహుతి దాడులకు పథక రచన చేస్తున్న ఉగ్రవాదులను తుడిచిపెట్టడానికి భారత వాయుసేన సైనికేతర దాడులకు పూనుకుందని భారత్ నొక్కి చెప్పింది. జైషే మహమ్మద్ వంటి ముసుగు సంస్థలను ఉపయోగించి భార త్‌ను వెయ్యి ముక్కలు చేసి రక్తమోడించవచ్చని ఇన్నాళ్లుగా పాకిస్తాన్ సైనిక యంత్రాంగం పెట్టుకున్న ప్రధాన విశ్వాసం కూడా మెరుపుదాడుల దెబ్బతో పటాపంచలైపోయింది.
పాక్ భూభాగంపై భారత వాయుసేన దాడుల తర్వాత భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే పత్రికా ప్రకటన చేశారు. ఏ రకంగా చూసినా అది ఒక ప్రామాణికమైన, అత్యంత స్పష్టమైన, అతి క్లుప్తమైన ప్రకటన. భారత్ తన భూభాగాన్ని సంరక్షించుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్న బాధ్యతాయుతమైన, పరిణతి చెందిన దేశమని ఈ ప్రకటన చాటుకుంది. పౌరులకు, సైనికులకు ఎలాంటి గాయాలు తగలకుండా చూడాలని భారత్ ముందుగానే నిర్ణయించుకుందని అందుకే భారీ స్థాయి నష్టం కలిగించడానికి బదులు ఉగ్రవాదుల శిబిరాలపై మాత్రమే సైనికేతర దాడులు సాగించామని తేల్చి చెప్పింది. తమ దాడుల లక్ష్యం పాకిస్తాన్ కాదని, ఉగ్రవాదులే తమ లక్ష్యమని భారత్ చాలా జాగ్రత్తగా ఈ ప్రకటనలో తెలియపర్చింది. ఇది పాకిస్తాన్‌కు దౌత్యపరంగా తనను తాను కాపాడుకోవలసిన క్షణం. ఎందుకంటే ఈ దాడులు ఇరుదేశాల మధ్య యుద్ధానికి ప్రేరేపించేవి కానే కావు.
నేను జర్నలి స్టుగా మన జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై 20 ఏళ్లుగా దృష్టిపెడుతున్నాను. శాంతి యుత అణు విస్ఫోటన అనే మన విధానానికి ప్రస్తుత దాడులు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని కచ్చితంగా చెప్పగలను. ఉగ్రవాదులపై చర్యలను భారత్ ముందునుంచీ కొనసాగిస్తూ వచ్చిందని, పాకిస్తాన్ ప్రభుత్వం 2004 నుంచి మాత్రమే తన భూభాగంలో ఉంటున్న ఉగ్రవాదులపై చర్యలకు కట్టుబడతానని ముందుకొచ్చిందని గోఖలే తన ప్రకటనలో నొక్కి చెప్పారు. మరోవైపున ఈ సరికొత్త భద్రతా వ్యూహాన్ని, మునుపెన్నడూ చూడనివిధంగా భారత్ సంకల్పించిన ప్రతీకార చర్యలను దేశవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ నాయకులు ముక్తకంఠంతో స్వాగతించారు.
మరోవైపున భారత్ తన భూభాగంలో చెప్పాపెట్టకుండానే దురాక్రమణ దాడికి పాల్పడిందని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. దీనికి బదులుగా సరైన సమయంలో, సరైన ప్రాంతంలో స్పందిస్తానని పాక్ ప్రకటించింది. కానీ పాక్ సన్నిహిత దేశంగా ఉంటున్న చైనా కూడా భారత్‌కు ఎత్తుగడలపరమైన మద్దతును ప్రకటిస్తూనే ఇరుదేశాలూ సంయమనం పాటించాల్సిందిగా పిలుపునిచ్చింది. కాగా, పాక్ భూభాగంలోకి భారత్ ప్రవేశించడంపై చైనా ఎలాంటి వ్యాఖ్య చేయకపోవడం గమనార్హం.
పాక్ భూభాగంలో భారత వాయుసేన దాడులను చాలా దేశాలు సమర్థించిన నేపథ్యంలో పాక్‌కి ఉన్నదల్లా ఒకే అవకాశం మాత్రమే. భారత్‌తో శాంతి ఒప్పందాలకు ప్రయత్నించడం లేక మరింత రెచ్చగొట్టే దాడులకు పూనుకోవడం. జైషే మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజర్ నిర్వహిస్తున్న తరహా జిహాదీ సమరాలని అది ఇంకెంత కాలమో కొనసాగించలేదు. గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మసూద్ అజర్ బావమరిది ఉస్తాద్ గౌరీ భారత వాయుసేన దాడిలో మరణించినట్లు తెలుస్తోంది. చివరగా.. పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడి చేసిన భారత్ మిరేజ్ యుద్ధ విమానాలు నిమిషాల్లోపే తిరిగి వచ్చాయి కానీ అవి భారత భద్రతకు సంబంధించిన ఆలోచనాతీరును, దాని వ్యూహాన్ని శాశ్వతంగా మార్చివేశాయనే చెప్పాలి.
వ్యాసకర్త: స్వాతి చతుర్వేది, రచయిత, జర్నలిస్టు
(ఎన్‌డీటీవీ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment