మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి
పరిపాలనపై సంపూర్ణ అవగాహన, పూర్తి పట్టు ఉన్న చెన్నారెడ్డి 33 ఏళ్లకే మంత్రి కాగలిగారు. సీఎంగా ఉన్నతాధికార వర్గంపై అదుపు, ప్రభుత్వ ఫైళ్లు, పాలనపై లోతైన అవగాహనతో మర్రి పాలన సాగించారు. అధికారులు చెప్పినట్టు సంతకాలు పెట్టకుండా ఫైళ్ళను క్షుణ్ణంగా చదివి, నోటింగ్‌లు రాసి మరీ సంతకం చేసేవారనీ, తనదైన నిర్ణయం తీసుకునేవారనీ ప్రతీతి. అలంకారపూరితమైన గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు సైతం మర్రి నిజమైన అధికారాలున్న నేతగా కనిపించడం, రాజకీయ నేతలా మాట్లాడడం చరిత్రలో భాగమే. ఇంతటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్న చెన్నారెడ్డి శత జయంతి నేడు. ఆయన ఆనవాళ్లు తెలుగునాట ఇంకా సజీవంగా నిలిచే ఉన్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జాడలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ చెక్కుచెదర లేదు. 1969–70 తెలంగాణ ఉద్యమ సారథిగానే మొదట ఆయన తెలుగువారికి పరిచయమయ్యారు. ఉద్యమానికి ముందు, తర్వాత ఆయన కాంగ్రెస్ నేతగా అనేక పదవులు నిర్వహించారు. ఆరో ముఖ్య మంత్రిగా రెండున్నరేళ్లకు పైగా పనిచేసిన పదేళ్ల తర్వాత ఏడాదిపాటు ఇదే పదవి చేపట్టారు. సీఎం పదవిలో కన్నా గవర్నర్ పదవిలోనే ఎక్కువ కాలం పనిచేశారు. పార్టీ నాయకత్వంతో విభేదించి సొంత పార్టీ పెట్టుకోవడానికి వెనుకాడలేదు. ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీతో రాజీపడి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చి ఉన్నత పదవులు స్వీకరించడం కూడా చెన్నా రెడ్డి రాజకీయ జీవితంలో భాగమే.
ఇందిర కేబి నెట్‌లో ఉక్కు, గనుల శాఖా సహాయ మంత్రిగా ఉన్న ఏడాది కాలంలో, సీఎంగా ఉమ్మడి ఏపీని పాలించిన రెండుసార్లూ పాలనాదక్షునిగా పేరు తెచ్చుకున్నారు. చెన్నారెడ్డిని మంత్రివర్గం వెలుపలా, వల్లూరి బసవ రాజుని మంత్రివర్గం లోపలా ఉంచితే చిక్కులు తప్ప వని కాంగ్రెస్‌పార్టీకి చెందిన సీనియర్ నేతలు చెప్పు కునేవారు. పరిపాలనపై సంపూర్ణ అవగాహన, పూర్తి పట్టు ఉన్న చెన్నారెడ్డి 33 ఏళ్లకే మంత్రి కాగలిగారు. అసమ్మతి రాజకీయాల కారణంగా సీఎం పదవిలో ఎక్కువ కాలం నిలబడలేకపోయారు.
తాండూరు ఎన్నికతో ఊహించని మలుపు!
1950 నుంచి సాఫీగా సాగిన ఆయన రాజకీయ జీవితం 1967 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త మలుపు తిరి గింది. తాండూరులో స్వాతంత్య్ర సమరయోధుడు వందేమాతరం రామచంద్రరావును ఓడించి నాలుగో సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వెంటనే కాసు కేబినెట్‌లో మరోసారి మంత్రి పదవి చేపట్టాక మర్రి రాజకీయ జీవితంలో ఊహించని మార్పులు మొద లయ్యాయి. అప్పటి ప్రధాని ఇందిర చెన్నారెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని రాజ్యసభకు నామి నేట్ చేశారు. తాండూరు ఎన్నికల ప్రచారంలో చెన్నా రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయన ఎన్నికను సవాలు చేస్తూ రామచంద్రరావు హైకోర్టుకెక్కారు.
హైకోర్టు మర్రి ఎన్నిక చెల్లదని తీర్పు ఇస్తూ ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హునిగా ప్రకటించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పును సమర్ధించడంతో 1968లో చెన్నారెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి చట్ట సభలకు దూరమయ్యారు. 1956లోనే ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన నేప థ్యం చెన్నారెడ్డిది. తెలంగాణ ఉద్యమం నడపడానికి వచ్చిన అవకాశంతో ఆయన తన సామర్థ్యాన్ని నిరూ పించుకున్నారు. ఈ ఉద్యమకాలంలో హైదరాబా ద్‌లో స్థిరపడిన కోస్తా, రాయలసీమ జిల్లాలకు చెందిన వారిపై చెదరుమదురుగా మొదలైన దాడులు చెన్నారెడ్డి సకాల జోక్యంతో నిలిచిపోయాయని ఆయ నకు పేరొచ్చింది.
1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలం గాణ ప్రజా సమితి(టీపీఎస్) తెలంగాణలోని 14 సీట్లలో పది గెలుచుకోవడానికి చెన్నారెడ్డి నాయ కత్వం తోడ్పడింది. తెలంగాణ ప్రజల మనోభావా లను గమనించిన ఇందిర పిలుపు మేరకు టీపీఎస్‌ను మర్రి కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1974లో అనర్హతా కాలం ముగిశాక ఇందిర సూచన మేరకు గవర్నర్ పదవి చేపట్టారు. ఇందిర పిలుపు మేరకు యూపీ గవ ర్నర్ పదవికి రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్(ఐ) అధ్యక్షుడయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్–ఐ మెజారిటీ సాధించడంతో ఆయన తొలి సారి సీఎం పదవి సాధించారు.
పాలనలో వినూత్న పోకడలు
చెన్నారెడ్డి సీఎంగా ఉండగానే హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి వేగం పెరిగింది. ఎవరూ ఊహించని రీతిలో 40 ఏళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల పనివారం ప్రవేశపెట్టారు. ఆచరణలో ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో పాత పద్ధతిని పునరుద్ధరించడానికి చెన్నారెడ్డి వెనుకా డలేదు. ఇందిరాగాంధీ ప్రధాని పదవిలో లేనప్పుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం చెన్నారెడ్డికి ఎక్కువ అధికారం, స్వేచ్ఛ అనుభవించే అవకాశం కల్పిం చింది. దాంతోపాటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యత కూడా మర్రిపైనే పడింది. ఈ నేపథ్యంలో ఆయన సర్కారుపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
గన్నవరం నుంచి శాసన సభకు ఎన్నికైన సీపీఎం నేత పుచ్చలపల్లి సుందర య్యను రాష్ట్ర డ్రయినేజీ బోర్డు చైర్మన్ పదవి తీసు కునేలా మొదట మర్రి ఒప్పించగలిగారు. తెలుగు నాట వేళ్లూనుకున్న కాంగ్రెస్ వర్గ రాజకీయాలను అధికారం, తెలివితేటలతో ఆయన అదుపు చేయగలి గారు. 1980 జనవరి పార్లమెంటు మధ్యంతర ఎన్ని కల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి ఇందిర మరో సారి ప్రధాని అయ్యాక చెన్నారెడ్డికి ఇబ్బందులు ఎదు రయ్యాయి. రాష్ట్ర కేబినెట్‌లోని, కాంగ్రెస్‌లోని అస మ్మతి వర్గానికి అధిష్టానం అండ దొరికింది. అసమ్మ తివర్గంలో మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరిపో యారు. ఫలితంగా చెన్నారెడ్డి అదే ఏడాది అక్టోబర్‌లో పదవికి రాజీనామా చేశారు.
మళ్లీ గవర్నర్ పదవి
పంజాబ్‌లో ఉగ్రవాదం పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ పదవిని చేపట్టాలని ఇందిర ఆదేశించడంతో చెన్నారెడ్డి చండీగఢ్ వెళ్లిపోయారు. తర్వాత కొన్నా ళ్లకు కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి తన అనుచ రులతో నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించారు. 1984 డిసెంబర్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో అనూహ్యంగా కరీంనగర్ నుంచి పార్లమెంటుకు పోటీచేసి మర్రి చొక్కారావు చేతిలో ఓడిపోయారు. తర్వాత రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాక కాంగ్రెస్‌లో మళ్లీ చేరిపోయారు. 1978లో మాదిరిగానే 1989 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సమ యంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం చెన్నారెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అప్పగించగా ఆయన పార్టీని విజయ పథంలో నడిపించారు.
1989 డిసెం బర్‌లో సీఎం పదవిని రెండోసారి అధిష్టించిన మర్రి ఏడాదికే అసమ్మతి మంటల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత ఎన్నికల రాజకీయాలకు దూరమై మరణించే వరకూ ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ పదవిలోనే కొనసాగారు. సీఎంగా ఉన్నతాధికార వర్గంపై అదుపు, ప్రభుత్వ ఫైళ్లు, పాలనపై లోతైన అవగాహనతో మర్రి పాలన సాగించారు. అధికా రులు చెప్పినట్టు సంతకాలు పెట్టకుండా ఫైళ్ళను క్షుణ్ణంగా చదివి, నోటింగ్‌లు రాసి మరీ సంతకం చేసేవారనీ, తనదైన నిర్ణయం తీసుకునేవారనీ ప్రతీతి. అలంకారపూరితమైన గవర్నర్ పదవిలో ఉన్నప్పుడు సైతం మర్రి నిజమైన అధికారాలున్న నేతగా కనిపిం చడం, రాజకీయ నేతలా మాట్లాడడం చరిత్రలో భాగమే. ఇంతటి విలక్షణ వ్యక్తిత్వం ఉన్న చెన్నారెడ్డి శత జయంతి నేడు. ఆయన ఆనవాళ్లు తెలుగునాట ఇంకా సజీవంగా నిలిచే ఉన్నాయి.
(నేటి ఉదయం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో డాక్టర్ ఎం. చెన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్స్‌లో శత జయంతి ఉత్సవం)
నాంచారయ్య మెరుగుమాల‘ 99121 99385
Comments
Please login to add a commentAdd a comment