ఇంగ్లిష్ రాకపోవడాన్ని ఒక భాషా వైకల్యంగా మార్చేసిన యాభై ఏళ్ళ చారిత్రక పరిణామాల్ని సీనియర్ మేధావులు గుర్తించడంలేదు. తాము తెలుగు మీడియంలోనే చదివి గొప్పవాళ్ళయినట్టు ఒక అర్థ సత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. మాతృభాషలకు ఉపయోగపు విలువలు మాత్రమే మిగలగా, ఇంగ్లిష్‌కు మారకపు విలువ కూడా అదనంగా చేరిందన్న వాస్తవాన్ని ముందుగా అందరూ గుర్తించాలి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నది భద్రలోకమే అనేది చాలా స్పష్టం. మరోవైపు, అభద్రలోకం ప్రభుత్వాన్ని చౌక బియ్యం, పక్కా ఇళ్ళు, వృద్ధాప్య పెన్షను, కార్పొరేట్ వైద్యం కావాలని అడిగినట్టు ఇప్పుడు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య కూడా కావాలని అడుగుతోంది. ఇంగ్లిష్ మీడియంలో చదవాలని ఆశిస్తున్న ప్రతి పేద కుటుంబానికీ ఆ అవకాశం కల్పించాలి. అది వారి ప్రజాస్వామిక హక్కు కూడా.
వర్గ సమాజపు సమీకరణలకన్నా కులవర్గ సమాజపు సమీకరణలు సంక్లిష్టంగా వుంటాయి. ఇప్పటి వరకు సంపన్న, ఎగువ మధ్య, మధ్య తరగతులకు చెందినవారిని పాలకవర్గం అంటున్నాం; దిగువమధ్య, పేద సమూహాలని పాలితవర్గం అంటున్నాం. ఇది ఆర్థిక విశ్లేషణ మాత్రమే. సాంఘీకార్థిక (socio& economic) విశ్లేషణకు సాంస్కృతిక అవగాహన కూడా కావాలి. పెత్తందారీ కులాలు, అణగారిన కులాలు రెండూ ఇటు పాలకవర్గంలోనూ అటు పాలిత వర్గంలోనూ వుంటాయి. అంత మాత్రాన అవి రెండూ ఒకటికానేకావు. పాలకవర్గంలో అత్యధిక శాతం పెత్తందారీ కులాలు, అత్యల్ప శాతం అణగారిన కులాలు వుంటాయి. ఈ సమీకరణని భద్రలోకం అనాలి. అలాగే, పాలితవర్గంలో అత్యధిక శాతం అణగారిన సమూహాలు, అత్యల్ప శాతం పెత్తందారీ కులాలు వుంటాయి. ఈ సమీకరణని అభద్రలోకం అనాలి.
రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనతో పాటూ అది తెచ్చిన వలస భాషాసంస్కృతులు పోయివుంటే దేశీయ భాషలు వికసించడానికి అవకాశాలు వుండేవి. కానీ అలా జరగలేదు. ఆర్థిక రంగంలో విదేశీ పెట్టుబడులు గతంకన్నా పెద్ద వరదలా వస్తున్నాయి. విదేశీ కంపెనీలను తీసుకు రాగలిగినవారే రాజకీయ రంగంలో సమర్థులుగా చలామణి అవుతున్నారు. రాజకీయార్థిక రంగంలోని విలువలే సాధారణంగా విద్యా సాంస్కృతిక రంగాల్లోనూ కొనసాగుతాయి. వలస పాలన కాలంలోనూ లేనన్ని విదేశీ వస్తువులు, సాంప్రదాయాలు మన ఇళ్ళు జీవితాల్లోనికి వచ్చేశాయి. పిల్లలు అభివృధ్ధి చెందిన దేశాల్లో స్థిరపడాలనే జీవితాశయం మనలో బలపడుతోంది. ఐటీ ఉద్యోగాలకు విదేశీ ద్వారాలు తెరుచుకున్నాక మన సమాజంలో ఇంగ్లిష్ గిరాకీ మరీ పెరిగిపోయింది. గతం నుండే ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాలు మొదలు పోలీసు స్టేషన్ల వరకు కార్యకలాపాలన్నీ ఇంగ్లిష్‌లోనే సాగుతున్నాయి. అధికారం మొత్తం తన చుట్టూ తిరుగుతుండడంతో మొదట్లో అనుసంధాన భాషగావున్న ఇంగ్లిష్ ఇప్పుడు మనకు అప్రకటిత అధికార భాషగా మారిపోయింది. మాతృభాషలకు ఉపయోగపు విలువలు మాత్రమే మిగలగా, ఇంగ్లిష్‌కు మారకపు విలువ కూడా అదనంగా చేరింది. ఈ వాస్తవాన్ని ముందు అందరూ గుర్తించాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధ శతాబ్దం క్రితం ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళు అరుదుగా వుండేవి. అందువల్ల భద్రలోకం కూడా అభద్రలోకంతోపాటు తెలుగు మీడియం పాఠశాలల్లోనే ‘కంబైన్డ్ స్టడీస్’ చేసేది. భద్రలోకపు స్థాయి, అవసరాలకు అనుగుణంగా అప్పటి తెలుగు మీడియం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా వుండేవి. 1971లో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏర్పడి, కళాశాల విద్యలోనూ తెలుగు మీడియంను అనుమతించాక విద్యారంగంలో కులవర్గ సమీకరణలు చాలా వేగంగా మారిపోయాయి. తెలుగు మీడియంకన్నా ఇంగ్లిష్ మీడియం మెరుగైనదనీ, అందులోనూ స్టేట్ సిలబస్ కన్నా సెంట్రల్ సిలబస్ నాణ్యమైనదనే ఒక కొత్త విలువ బలంగా ముందుకు వచ్చింది. భద్రలోకం మొత్తం ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు స్కూళ్ళకు మారిపోవడంతో తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో క్లాస్ రూంలు, బ్లాక్ బోర్డులు, బెంచీలు, గాలి, వెలుతురు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు సహితం లేకుండాపోయాయి. మరోవైపు, ప్రభుత్వ విద్యారంగంలో అధ్యాపక సంఘాల సంఖ్య పెరిగింది. అధ్యాపకుల జీతాలు పెరిగాయి; విద్యా ప్రమాణాలు మాత్రం ఘోరంగా పడిపోయాయి. అభద్రలోకం మాత్రమే గతిలేక తెలుగు మీడియంలో మిగిలిపోయింది.
ప్రాథమిక పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఇదే పరిస్థితి ఉంది. అల్పాదాయవర్గాలకు చెందిన భవన కార్మికులు, ఆటో డ్రైవర్లు సహితం తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకు పంపించడం మొదలెట్టారు. ప్రమాదం ఏ దశకు చేరిందంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు సహితం తమ పిల్లల్ని తెలుగు మీడియం పాఠశాలల్లో చేర్చడానికి భయపడిపోతున్నారు. ఫలితంగా అభద్రలోకానికి నియత విద్య మీదనే నైరాశ్యం ఏర్పడే ముప్పు వచ్చింది.
ఇంగ్లిష్ రాకపోవడాన్ని ఒక భాషా వైకల్యంగా మార్చేసిన యాభై ఏళ్ళ చారిత్రక పరిణామాల్ని సీనియర్ మేధావులు గుర్తించడంలేదు. తాము తెలుగు మీడియంలోనే చదివి గొప్పవాళ్ళయినట్టు ఒక అర్థ సత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, అభద్రలోకం ప్రభుత్వాన్ని చౌక బియ్యం, పక్కా ఇళ్ళు, వృధ్ధాప్య పెన్షను, కార్పొరేట్ వైద్యం కావాలని అడిగినట్టు ఇప్పుడు తమ పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య కూడా కావాలని అడుగుతోంది. వైఎస్ జగన్ నిర్వహించిన చరిత్రాత్మక పాదయాత్ర సందర్భంగా పేదజనం ఆయనతో చెప్పుకున్న కష్టాల్లో కాన్వెంటు ఫీజుల భారం ఒకటి. ఆ మేరకు ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు మూడు నాలుగు విడతల్లో ఇంగ్లిష్ మీడియంలోనికి మార్చాలని సీఎం జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోనికి రానుంది. ప్రతి తరగతిలోనూ విద్యార్ధుల ఛాయిస్‌ను బట్టి తెలుగు లేదా ఉర్దూ ఒక సబ్జెక్ట్‌గా తప్పనిసరిగా వుంటుంది. ఇది అందరూ ఆహ్వానించవలసిన పరిణామం.
అభద్రలోకానికి ఇంగ్లిష్ మీడియం విద్య అందిస్తారనగానే భద్రలోకం ఉలిక్కి పడింది. పురాతన కాలంలో విద్య నేర్చే శూద్రుల్ని కఠినంగా శిక్షించేవారట. ఇప్పుడు అభద్రలోకానికి ఇంగ్లిష్ దక్కకుండా చేయడానికి మాతృభాషా మాధ్యమ పరిరక్షణ వేదిక నడుం బిగించింది. ప్రతి మనిషికీ పుట్టడానికి ముందే తల్లిగర్భంలోనే మాతృభాష పరిచయం అవుతుంది. పుట్టాక కూడ ఆ వాతావరణంలోనే పెరుగుతాడు కనుక ఎవరికైనా నేర్చుకోవడానికి మాతృభాష చాలా సౌలభ్యంగా వుంటుంది. మనిషి జీవితంలో మాతృభాష అనేది స్కూళ్లకు ముందూ వుంటుంది, ఆ తర్వాతా వుంటుంది. స్కూళ్ళలో మాత్రమే మాతృభాష పుట్టి పెరుగుతుందని అమాయకులు మాత్రమే భావిస్తారు.
మాతృభాష అనగానే తెలుగు, ఉర్దు మాత్రమే గుర్తుకువస్తాయి. తమిళ కన్నడ మలయాళ గుజరాతీ సమూహాలే కాకుండా సవర, జాతాపు తదితర ఆదివాసీ భాషల సమూహాలూ అనేకం వుంటాయి. ఆయా భాషలు మాట్లాడేవాళ్ళకు వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ మాతృభాషలో విద్యా బోధనకు అవకాశాలు లేవు. మాతృభాష పేరుతో అధికార భాషలో విద్యాబోధన సాగిస్తారు. ఆ అధికార భాషా సంఘం ప్రచురించే పుస్తకాల్లోని కృతక ఆంధ్రభాష కన్నా ఇంగ్లిష్ చదవడమే చాలా సులువుగా వుంటుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నది భద్రలోకమే అనేది చాలా స్పష్టం. అప్పట్లో ప్రైవేటు విద్యను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ విద్యను బలహీనపరిచిందీ వీళ్ళే. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల ఔన్నత్యాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్నదీ వీళ్ళే.
సమాజంలో అందరూ ఉద్యోగాల కోసమే చదువుతారుగానీ అందరికీ ఉద్యోగాలు రావు. అత్యుల్లాసమైన (Volatile) ఉపాధిరంగంలో ఒక్కోసారి ఒక్కో సబ్జెక్ట్‌కు గిరాకీ వుంటుంది. 1970లలో కామర్స్ చదివితే చాలు బ్యాంకు ఉద్యోగం వచ్చేస్తుంది అనేవారు. 1990లలో Y2K సమస్య వచ్చినపుడు బీటెక్ మాత్రమే కాదు ఏదో ఒక్క సాఫ్ట్‌వేర్ భాష వచ్చినా ఉద్యోగాలు వచ్చాయి. గిరాకీ సరఫరా సూత్రం అన్నింటా వుంటుంది. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంకు అలాంటి క్రేజ్ వుంది. మార్కెట్లో ఉపాధి అవకాశాలే లేనపుడు ఏ మాధ్యమంలో చదివితే ఏమిటనే? వాళ్ళూ వున్నారు. ‘‘కూటికీ పేదోణ్ణేకానీ; కులానికి కాదు’’ అనే మాట మన సాంస్కృతిక రంగంలో వినపడుతూ వుంటుంది. ఉద్యోగం రాకపోయినా ఇంగ్లిష్ వచ్చినవాళ్ళు అలాంటి సాంస్కృతిక గౌరవాన్ని ఆస్వాదించే వాతావరణం మన సమాజంలో వుంది.
ఆర్థిక రంగంలో అభద్రలోకానికి భద్రలోకానికి మధ్య సాగే ఘర్షణే ఇప్పుడు విద్యారంగంలో తెలుగు మీడియం, ఇంగ్లిష్ మీడియంల వివాదంగా వ్యక్తం అవుతోంది. నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ సంస్థల్లో సామాజిక మైనారిటీ విద్యా మెజారిటీగా మారుతుండగా, సామాజిక మెజారిటీ విద్యా మైనారిటీగా మిగిలిపోతోంది. ఈ అసమానత్వం ఇంకెంత కాలం కొనసాగాలీ? ఇంగ్లిష్ మీడియంలో చదవాలని ఆశిస్తున్న ప్రతి పేద కుటుంబానికీ ఆ అవకాశం కల్పించాలి. ఇప్పుడు అభద్రలోకపు ప్రజాస్వామిక హక్కు ఇంగ్లిష్ మీడియం.
డానీ
(వ్యాసకర్త రచయిత, సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు ‘ మొబైల్ : 90107 57776)
Comments
Please login to add a commentAdd a comment