దిగజారుతున్న విలువలు | Varun Gandhi article on political values | Sakshi

దిగజారుతున్న విలువలు

Published Thu, Dec 28 2017 1:08 AM | Last Updated on Thu, Dec 28 2017 1:08 AM

Varun Gandhi article on political values - Sakshi

సందర్భం
పార్లమెంట్‌ చర్చలు అంటే శిఖరప్రాయులైన వక్తలు, అద్భుత వాదనా పటిమ, నిఖార్సయిన గణాంకాలు, గౌరవప్రదమైన ముగింపు అనే రోజులు పోయాయి. ఇప్పుడది పరస్పర ఘర్షణగా, దూషణల పర్వంగా దిగజారిపోయింది.

నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ భద్రతకోసం ఒక రోజుకు రూ. 25వేలు ఖర్చుపెడుతున్నారంటూ రామ్‌మనోహర్‌ లోహియా 1963లో ఒక కరపత్రం రాశారు. అప్పట్లో రోజుకు 3 అణాపైసలపై బతుకీడుస్తున్న భారతీయ నిరుపేదల రోజువారీ దుర్భర జీవి తంతో పోలిస్తే ఇది చాలా పెద్ద వ్యత్యాసం. తర్వాత నెహ్రూ దానిపై పార్లమెంటులో చర్చిస్తూ, ప్రణాళికా సంఘం గణాంకాలను ప్రస్తావిస్తూ భారతీయుల రోజు వారీ ఆదాయం 15 అణాపైసలుగా ఎత్తిచూపారు. ఈ సందర్భంగా ఆర్థిక అసమానతలకు సంబంధించి లోహియా, నెహ్రూ గొప్ప చర్చకు నాంది పలికారు. ఈ మేటి చర్చకు ముగింపు పలకడం కోసం ఏంపీలు సీరియస్‌గా చర్చించారు. కానీ ఆ చర్చ అత్యంత నాగరిక రీతిలో సాగింది. శిఖరప్రాయులైన వక్తలు అత్యద్భుత వాదనా పటిమతో, నిఖార్సయిన గణాంకాలతో తమతమ వాదనలను వినిపించారు తప్పితే మొత్తం చర్చాక్రమంలో చిన్న అంతరాయం కానీ, దూకుడుతనాన్ని కానీ ప్రదర్శించడం జరగలేదు. కాని మన రాజకీయ చర్చలు క్రమేణా దిగజారుతూ వచ్చాయి.

అలాగే హిందూ న్యాయ స్మృతి బిల్‌ని చూడండి. 1948లో బీఆర్‌ అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ రూపొందించిన దీని ముసాయిదా అత్యంత వివాదాస్పదమైంది. అది హిందువులు, జైనులు, బౌద్ధులు, ఆదివాసులకు వర్తించే పర్సనల్, స్థానిక పౌర చట్టాలను క్రోడీకరించిన చట్టంతో మార్చడానికి చేసిన ప్రయత్నం. కులానికి ఉన్న చట్టపరమైన ప్రాధాన్యతను తగ్గించడం, విడాకులను సులభతరం చేయడం, వితంతువులకు, మహిళలకు కూడా ఆస్తి హక్కులో భాగం కల్పించడం ఈ బిల్లులో ముఖ్యాంశాలు. హిందూ కోడ్‌ బిల్లుపై చర్చను ప్రారంభించిన మోషన్‌ తీర్మానంపై 50 గంటలపాటు చర్చ జరిగింది. పార్లమెంటులో, డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ వంటి ప్రముఖులు సైతం ఈ బిల్లును రౌలట్‌ చట్టంతో పోల్చారు. కొంతమంది సభ్యులు హిందూ మతమే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అంబేడ్కర్‌ వంటివారు హిందూ సమాజం కాలానుగుణంగా పరిణమించాలని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎంపీలు చేసిన గొప్ప ప్రసంగాలు పార్లమెంటుకే ప్రమాణంగా నిలిచిపోయాయి. 1949 నవంబర్‌లో అంబేడ్కర్‌ ‘అరాజకపు వ్యాకరణం’పై చేసిన ప్రసంగం.. ఇకనుంచి సహాయ నిరాకరణ, సత్యాగ్రహం, శాసనోల్లంఘన వంటి పోరాటరూపాలను పరి త్యజించాలని చెప్పడమే కాకుండా, సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధన కోసం రాజ్యాంగ విధానాలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. తర్వాత భారత్‌ తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించిన సందర్భంలో ప్రముఖ పార్లమెంటేరియన్‌ పీలూ మోడీ, నాటి ప్రధాని ఇందిరాగాంధీని గుచ్చి గుచ్చి అడుగుతూ, ‘మేడమ్‌ ప్రైమ్‌ మినిస్టర్, మన శాస్త్రజ్ఞులు సాంకేతికరంగంలో గొప్ప విజయాలు సాధిస్తున్నారు. కానీ మన టెలిఫోన్లు ఎందుకు పనిచేయడం లేదో మీరు వివరిస్తే మేమంతా కాస్త సంతోషపడతాం’ అన్నారు.

స్వాతంత్య్రానంతర భారత్‌ ఒక రకంగా చూస్తే అదృష్టవంతురాలు అనే చెప్పాలి. నెహ్రూ, పటేల్, లోహియా వంటి దిగ్గజ నేతలు దూషణలకు తావు లేకుండా అనేక అంశాలపై చర్చకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజాస్వామిక అభినివేశాన్ని ప్రోత్సహించాలని చూసేవారు. నెహ్రూ నుంచి వాజపేయి దాకా పార్లమెంటు కార్యకలాపాలను భక్తిభావంతో కొనసాగించడం కోసం అనేక ఉత్తమ సంప్రదాయాలను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి, శాసన సంబంధమైన లక్ష్యాల సాధనపై వీరు ప్రముఖంగా దృష్టి పెట్టేవారు.

ఒకప్పుడు అద్భుత ప్రసంగాలకు, వాదనాపటిమకు తావిచ్చిన మన పార్లమెంటరీ చర్చాప్రక్రియ జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, సమస్యలపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఈ చర్చా సంప్రదాయాన్ని వారసత్వంగా స్వీకరించడానికి బదులుగా, రానురానూ ఎంపీలు వాగాడంబరత్వానికి, అరువుతెచ్చుకున్న పదప్రయోగాలకు దిగజారిపోయారు. మృదు చర్చల స్థానంలో దూకుడుతనం ప్రవేశించింది. మన పార్లమెంటు ఎలాంటి చారిత్రక క్షణాలను ఆస్వాదించిందో ఒక్కసారి చూద్దాం. రాజాజీ ఒకసారి లోక్‌సభలో ప్రవేశపెట్టిన సవరణను సభ తిరస్కరించినప్పుడు నెహ్రూ ప్రసంగిస్తూ, ‘మెజారిటీ నా వైపే ఉంది రాజాజీ’ అన్నారు. దానికి రాజాజీ జవాబిస్తూ, ‘మెజారిటీ మీవైపే ఉండవచ్చు నెహ్రూజీ, కానీ తర్కం నా వైపే నిలిచింది’ అన్నారు.

ప్రస్తుత పార్లమెంటులో ప్రమాణాలు పూర్తిగా అడుగంటిన చర్చాప్రక్రియను చూస్తుంటే పరస్పర ఘర్షణగా, రాత్రి  8 గంటల వార్తాప్రసార పోరాటాల స్థాయికి దిగ జారిపోయినట్లు అనిపిస్తుంది. ఒకప్పుడు పార్లమెంటులో రాకెట్‌ ప్రయోగాల గురించి చర్చ సాగితే ఇప్పుడు పురాతన చరిత్రపై ఏకపక్ష ప్రదర్శన జరుగుతోంది. ఒకప్పుడు గౌరవనీయ కళగా సాగిన రాజకీయ వాక్పటిమ నెహ్రూ, బర్క్, చర్చిల్‌ వంటి గొప్ప వక్తలను రూపొందించింది. ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోవడమే ప్రధానమైపోయింది. ఈ నేపథ్యంలో మురికి రాజకీయ తెట్టును శుద్ధి చేయాలంటే ఉత్తమశ్రేణి పార్లమెంటేరియన్లు మళ్లీ ఆవి ర్భవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వరుణ్‌ గాంధీ
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు
ఈ–మెయిల్‌ : fvg001@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement