దాచేపల్లి: దాచేపల్లికి ఆరు కిలోమీటర్ల దూరంలోని శంకరపురం– భట్రుపాలెం గ్రామాల మధ్య ఉన్న కొండలో రంగురాళ్ల వేట యథేచ్ఛగా సాగుతోంది. వ్యాపారులు నియమించి మధ్యవర్తుల ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. కొండలో సూమారుగా 100కి పైగా సొరంగాలు తీశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో సొరంగం 50 నుంచి 70 అడుగుల లోతులో ఉండటం విశేషం. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ కిందికి దిగి కొందరు రాళ్ల వేట సాగిస్తున్నారు.
రహస్యంగా రవాణా..
రంగురాళ్లను చాకచక్యంగా గుంటూరు జిల్లా కేంద్రంతో పాటు విజయవాడ, ప్రకాశం జిల్లా తెలంగాణాలోని హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడెం, రాజస్థాన్, హిమచల్‌ప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యపట్టణాలకు చెందిన వ్యాపారులు మధ్యవర్తుల సాయంతో ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. లోకల్ కార్మికులు 10, 20 కిలో చొప్పున రంగురాళ్లను మూటలుగా కట్టి ఆటోలు, కార్లలో తరలిస్తున్నారు. కాట్రపాడు, భట్రుపాలెం గ్రామాల పరిధిలోని కృష్ణా నది నుంచి కూడా తెలంగాణాలోకి రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడికక్కడే కోవర్టులు ఏర్పాటు చేసుకుని రవాణా సాగించడం గమనార్హం. గతేడాది నవంబర్‌లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు.
ఈ రాళ్లకు మస్త్ గిరాకీ..
శంకరపురం కొండలో నుంచి తీసే రంగురాళ్లకు గిరాకీ బాగానే ఉందని తెలుస్తోంది. దొరికిన రాళ్లలో అష్టముఖి, పంచముఖి ఆకారపు రాళ్లు తయారీకి పనికొచ్చేవి ఉంటే ఇక పండగే. వాటి ధర సుమారు రూ.10 వేలకు పైగా ఉంటుందని అంచనా. ఇతర వాటర్‌పీస్, గంజిరాళ్లయితే కిలో రాళ్లు రూ.5 వేల చొప్పున పలుకుతాయని తెలుస్తోంది. కొండ నుంచి తీసే సాధారణ రాళ్లు కూడా కిలో రూ.5 వేల చొప్పున కొనుగోలు చేస్తారని తెలిసింది. ఒకే రాయి 5 కిలోల బరువు ఉంటే దానికి ప్రత్యేక పారితోషికాలట. సదరు రాళ్లను ఇతర ప్రాంతాలకు తరలించి రాతి బొమ్మలు, కొయ్యబొమ్మలు, పూసల దండలు, ఆభరణాల మధ్యలో ధగధగ మెరిసే రాళ్లుగా మారుస్తారని సమాచారం.
అధికారులకు అనధికార సవాల్..
దాచేపల్లి పరిసర ప్రాంతంలోని శంకరపురం, భట్రుపాలెం, దాచేపల్లి, కాట్రపాడు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు తవ్వకాలు చేపడుతూ అధికారులకు అనధికార సవాళ్లు విసురుతున్నారు. అటవీశాఖ పరిధిలో సరిపడా సిబ్బంది లేకపోవడంతోనే తవ్వకాలను కట్టడి చేయలేకపోతున్నామని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉన్న అరకొర సిబ్బందితో నిఘా పెట్టడం కష్టతరంగా మారిందని వాపోతున్నారు. ఒకవేళ తనిఖీ చేసినా తవ్వకాలు చేపడుతున్న కూలీలు దాడులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు దమ్ముంటే తమన పట్టుకోమని సవాల్ విసురుతున్నట్లు అధికారులు చెప్పడం గమనార్హం. ఇది ఇలా ఉండగా మరోవైపు ఆ శాఖ అధికారుల్లో కొందరు మామూళ్లకు అలవాటు పడి నిఘా సంగతి మరచిపోయారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
మరణాలు సంభవించాయి..
రెండేళ్ల క్రితం ఈ ప్రాంతంలో రంగురాళ్ల వేటకు సొరంగంలోకి వెళ్లిన ఓ కూలి మృతి చెందాడు. ఘటన బయటకు రాకుండా మధ్వవర్తులు జాగ్రత్తలు తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ కొండపై వందమందికిపైగా కూలీలు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాత్రిళ్లు టార్చిలైట్లు, జనరేటర్లనూ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఈ మూడేళ్లలో సుమారు వందల టన్నుల రంగురాళ్లు హద్దులు తరలివెళ్లాయనేది ఓ అనధికార అంచనా.
తవ్వకాలు జరిపితే రౌడీ షీట్లు తెరుస్తాం.,.
కొండల్లో అక్రమంగా రంగురాళ్ల కోసం తవ్వకాలు జరిపే ఊరుకోం. సదరు వ్యక్తులు పట్టుబడితే రౌడీషీట్లు తెరుస్తాం. వారి వెనుక ఎంతటి వారైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– అద్దంకి వెంకటేశ్వర్లు, ఎస్సై, దాచేపల్లి
Comments
Please login to add a commentAdd a comment