ముచ్చటైన మార్కులకు..ముత్యాల అక్షరాలు | Good Hand Writing Scores Good Marks In SSC Board Exam | Sakshi
Sakshi News home page

ముచ్చటైన మార్కులకు..ముత్యాల అక్షరాలు

Published Wed, Mar 6 2019 11:22 AM | Last Updated on Wed, Mar 6 2019 11:43 AM

Good Hand Writing Scores Good Marks In SSC Board Exam - Sakshi

ప్రత్యేక తరగతుల్లో టెన్త్‌ విద్యార్థులు

సాక్షి, అచ్చంపేట/పిడుగురాళ్లటౌన్‌:  ప్రస్తుతం కంప్యూటర్‌ యుగంలో ప్రతిది కీబోర్డుల పైనే ఆధారపడుతున్నారు చాలా మంది విద్యార్థులు. ఒక ప్రశ్నకు సమాధానం కావాలంటే ఒకప్పుడు టెస్ట్‌బుక్‌ మొత్తం తిరగేసి ముఖ్యమైన పాయింట్లను నోట్‌ చేసుకుని తరచూ వాటిని మననం చేసుకునేవారు. దానివల్ల చేతి రాత పెరగడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా వృద్ధి చెందుతుంది. కాని ఇప్పుడు కావలసిన ప్రశ్నను సూటికా గుగుల్‌ సర్చ్‌ చేసి, ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం తెలుసుకోవడం, దానిని సేవ్‌ చేసుకుని అవసరమైనపుడు ఉనియోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల చేతికి పని తగ్గిపోతుంది. స్పష్టం రాయగలిగేవారు కూడా అప్పుడప్పుడు మాత్రమే రాయడం వల్ల స్పష్టతను కోల్పోతున్నారు.

ఈ ప్రభావం పబ్లిక్‌ పరీక్షలో విద్యార్థులపై పడి బాగా చదివినా ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నారు. బాగా చదివాం, చదివిన ప్రశ్నలే వచ్చాయి, బాగానే రాశాం, కాని మార్కులు రాలేదని తెగ బాధపడిపోతారు. కారణం తెలుసుకునేందుకు రీవాల్యూషన్‌ పెట్టుకుని, చేతి రాత సక్రమంగా లేకపోవడం, మనం రాసినవి మనకే అర్థంకాకపోవడం వల్లనేనని అప్పుడు తెలుసుకుంటాం. మార్కులు ఎందకు తక్కువ వచ్చాయో.. అప్పుడు చింతించిన ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు.  ముందుగా  కష్టపడి చదవడం ఎంతముఖ్యమో.. చదివిన విషయాన్ని స్పష్టంగా రాయడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
 

  •  చేతి రాత మార్చుకోవాలన్నా, అక్షరాలు గుండ్రంగా, సష్టంగా ఉండాలన్నా సాధన చేయాలి. 
  •  తెలుగు, ఇంగ్లిషు భాషల్లో రాత బాగుండాలంటే అచ్చు అక్షరాలను సవ్వదిశలో కూర్చుని అనుసరించి రాయడం అలవరుచుకోవాలి. ఎలాబడితే అలా కూర్చోవడం, పడుకుని రాయడం వల్ల చేతి   రాత ఎంత మాత్రం మారదు. 
  •  చదివిన ప్రతి ప్రశ్నను రాయడం చేర్చుకోవాలి. అలా చేయడం వల్ల రాత సక్రమంగా, స్పష్టంగా రావడమే కాకుండా చదివిన సమాధానాన్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకునే అవకాశాలుంటాయి. 
  •  ఏ భాషనైనా రాసేటపుడు పదానికి పదానికి మధ్య ఖచ్చితంగా గ్యాప్‌ ఉండాలి. అన్ని పదాలు కలిపి రాయడం వల్ల సమాధానాలు దిద్దేవారికి అర్థమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. 
  • ముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులు అక్షర దోషాలు లేకుండా చూచుకోవాలి, వత్తులు, పల్లులు, కొమ్ములు, దీర్ఘాలు ఎక్కడ ఎలా రాయాలో ఖచ్చితంగా పాటించాలి. ఇంగ్లిషు కలిపి రాత రాసే టప్పుడు కూడా ఖచ్చితత్వం పాటించాలి. 
  • పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఎగ్జామ్‌ ప్యాడ్‌ తీసుకువెళ్లాలి. అలా చేయడం వల్ల మనకు ప్యాడ్‌పై రాసే అలవాటను ముందు నుంచే అలవరచుకునే వెసులుబాటు ఉంటుంది. అదికాక ఎగ్జామ్‌ హాలులో ఉండే డస్క్‌లపై రాయడం ఇబ్బందికరంగా ఉండవచ్చు. 
  • రాత రాసేటపుడు కూర్చునే భంగిమ, పెన్ను పట్టుకునే విధానం, పేపర్‌పై రాసే విధానం ఎప్పుడు ఒకే విధంగా ఉండేలా చూచుకోవడం మంచిది.

‘పది’లో పట్టుకు ప్రణాళిక అవసరం   

గుడ్లవల్లేరు: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలంటే చాలామంది పిల్లల్లో భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టాలంటే ముందు నుంచే ప్రణాళిక అవసరం. అలా చేస్తే అమ్మో పాసవుతామో లేదో అన్న భయం వారిలో పోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌ పిల్లలకు డీ–గ్రేడ్‌ వచ్చిందంటే వారిని తామున్నామంటూ ఉపాధ్యాయులు దత్తత తీసుకుంటున్నారు. అలా చాలా పాఠశాలల్లో పిల్లల్ని దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణులను చేస్తున్నారు. ఆ వివరాలను గుడివాడ డీవైఈవో ఎం.కమలకుమారి వెల్లడించారు. 
టెన్త్‌లో ఉత్తీర్ణతకు నియమాలిలా..

  •  విద్యా సంవత్సరంలో విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూసుకోవటం.
  •  ఉపాధ్యాయులు తమ అనుభవంతో తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ విద్యార్థులకు ఇవ్వాలి.
  •  వందశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులంతా సమష్టిగా కృషి చేయాలి.
  •   స్టడీ అవర్స్‌ ప్రారంభించాలి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు ఉండాలి.
  •  మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం కోసం చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలి.
  •  మానసిక ప్రశాంతత కోసం ఫస్ట్‌ ఫిరియడ్‌లోనే యోగ తరగతుల నిర్వహించాలి.
  •  విద్యార్థుల ఉత్తీర్ణతపై తల్లిదండ్రులతో ప్రతినెలా జరిగే సమావేశంలో చర్చలు జరపాలి.
  •  సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆసక్తి కనబరిచే విధంగా శిక్షణ ఇవ్వాలి.
  •  కంప్యూటర్‌లో బేస్డ్‌ నాలెడ్జ్‌ నుంచే తర్ఫీదు ఇవ్వాలి.
  •  పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ కోసం క్వార్టర్లీ, ఆఫర్లీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు, జవాబులపై ముఖ్యమైన వాటిని విద్యార్థులకు తెలియజేయాలి.
  •  సబ్జెక్ట్‌ కార్నర్‌ పేరుతో ఏ సబ్జెక్ట్‌ టీచర్‌ ఆ సబ్జెక్ట్‌లో అంశాలను క్లాసులోని పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా నోటీసు బోర్డులో  ప్రదర్శించాలి.
  •  ముందు నుంచే డీ గ్రేడ్‌ విద్యార్థునులను గుర్తించాలి. వారిని ఉపాధ్యాయులు దత్తత తీసుకుని చదివించాలి.
  •  హాజరు శాతం కూడా 90 ఉండాలి. శెలవు పెట్టాలంటే విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలలో చెప్పకపోతే అనుమతి ఇవ్వకూడదు. 


- డీవైఈవో కమలకుమారి 

అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాలి
కొంత మంది విద్యార్థులు అడిగిన ప్రశ్నకు కాకుండా అలానే ఉండే మరో ప్రశ్నకు సమాధానాలు రాస్తూ ఉంటారు. అదే ప్రశ్న రాస్తున్నామా లేదా అనే ఆందోళనతో రాస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అక్షరాలు సక్రమంగా రాయలేరు. రాసిన సమాధానంలో స్పష్టత ఉండదు. అక్షర దోషాలు కూడా ఎక్కువగా దొర్లుతాయి. ఫలితంగా ఆశించిన మార్కులను కోల్పోవలసి వస్తుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా ముందునుంచే చేతి రాతపై దృష్టిపెట్టాలి.

– టి.బాలశౌర్రెడ్డి, ఉపాధ్యాయుడు, తాళ్లచెరువు 

చేతి రాత కీలకం
విద్యార్థులు చదవడంతో పాటు బాగా రాయడం కూడా ముందునుంచే సాధన చేయాలి.మనం రాసే అక్షరాలు స్పష్టంగా, గుడ్రంగా అందంగా ఉంటే మన సమాధానం పత్రం దిద్దే ఉపాధ్యాయుడు మరికొన్ని మార్కులను అదనంగా రాసే అవకాశంం ఉంటుంది. పరీక్షల సమయంలో మంచి మార్కులు సాధించాలంటే చేతి రాత కీలకం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. 

– వి.రాజశేఖర్, ఎంఈవో, అచ్చంపేట మండలం 

నిబంధనలు పాటిస్తే మేలు
జవాబులు రాసే విధానంలో దిద్దుబాట్లు లేకుండా జాగ్రత్తపడాలి. వ్యాసరూప ప్రశ్నలకు పాయింట్లవారిగా సమాధానాలు రాస్తూ మధ్యలో ఉపశీర్షికలు ఇవ్వాలి. పదాల మధ్య స్పేస్, కామా, పుల్‌స్టాప్‌ ఇవ్వటం మూలంగా వాక్యాలు అందంగా కనిపిస్తాయి. బిగ్‌ ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు కొట్టి వేతలు ఉండకూడదు. ప్రశ్నలపై సందేహాలుంటే ఇన్విజిలేటర్‌ను అడిగి నివృత్తి చేసుకోవాలి. 

–బి.మల్లికార్జునశర్మ, ఎంఈవో, పిడుగురాళ్ల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement