సర్దండి..సర్దండి ట్రైన్ టైమవుతోంది..పిల్లలెక్కడ త్వరగా రండి.. ఇలా హడావుడిగా బ్యాగులు భుజానేసుకుని ఇంటిల్లపాదితో స్వగ్రామానికి బయలుదేరాడు గుంటూరు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి శ్రీనివాసరావు. రెండు జిల్లాల అవతల నెల్లూరులోని స్వగ్రామపు మట్టి వాసనలు చూసి పులకించిపోయాడు. బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులతో పాత జ్ఞాపకాల మధురిమలను మదినిండా∙నింపుకుని నాలుగు రోజుల తర్వాత తిరుగుముఖం పట్టాడు. ఇంటికి వచ్చి చూసుకుంటే దొడ్డి తలుపు తాళం పగలగొట్టి ఉంది. ఉంట్లో విలువైన వస్తువులు, నగదు, ఆభరణాలు మాత్రం మాయమయ్యాయి. ఇక లబోదిబో అంటూ పోలీస్‌స్టేషన్ వైపు నడిచాడు. అందుకే మీకూ చెబుతున్నాం..ఇల్లు జాగ్రత్త సుమా..!
సత్తెనపల్లి: జిల్లాలో తరచూ చోరీ ఘటనలు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఇంటిని విడిచి ఒక పూట దూరంగా ఉండాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. సంక్రాంతి రావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు పట్టణాలు వదిలి స్వగ్రామాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో దొంగతనాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అందుకే పోలీసుల సాయం తీసుకుంటే సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలకు అడ్డుకట్ట వేయొచ్చు. జిల్లాలో గతంలో పండుగల సమయాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లిన సంఘటనలు అనేకం. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా చోరీలు అధిక సంఖ్యలోనే జరిగాయి.
పోలీసు రికార్డులకు ఎక్కినవి కేవలం 60 శాతమే.
♦ ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చుట్టుపక్కల వారికి చెప్పాలి. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు యజమానుల సహకారం తీసుకోవాలి.
♦ ఎక్కువ మంది ఉద్యోగులు ఉండే కాలనీల్లో పోలీసుల గస్తీ ఉండేలా కాలనీలో ఏర్పాటు చేసుకోవాలి.
♦ ఇంట్లో విద్యుత్ దీపం వెలిగేలా చూసుకోవాలి. ఇంట్లో ఎవరో ఉన్నారన్న భావన కలిగించాలి.
♦ ఊరికి దూరంగా ఉండే వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వడమేగాక ఇంట్లో విలువైన వస్తువులు లేకుండా జాగ్రత్త పడాలి.
♦ పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఉపయోగించుకోవాలి. పోలీస్ శాఖకు సమాచారం అందిస్తే సీసీ కెమెరాలు అమర్చి నిఘా పెడతారు.
సమాచారం అందిస్తే గస్తీ ఏర్పాటు చేస్తాం
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో రాత్రి గస్తీ ఏర్పాటు చేస్తారు. ఇంటిపక్క వారికి సైతం సమాచారం ఇవ్వాలి. ఇంట్లో నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను ఉంచకండి. పండుగ సందర్భంగా గుంటూరు అర్బన్, జిల్లాల పరిధిలో రాత్రి గస్తీలను పెంచాం. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. – విజయారావు, అర్బన్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment