అత్తాపూర్ (హైదరాబాద్) : సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వాళ్లు జాగ్రత్తగా తమ ఇళ్లకు తాళాలు వేసుకోవాలని, ఇళ్లల్లో విలువైన వస్తువులను ఉంచవద్దని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ వి.ఉమేందర్ కోరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అపార్టుమెంట్‌లలో ఉండేవారు ఊరెళ్లేటప్పుడు వాచ్‌మెన్‌కు చెప్పాలని, తమ ఫ్లాట్ కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బస్తీలు, కాలనీలలో పెరుగుతున్న దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లను నిరోధించడానికి రాజేంద్రనగర్ ఏసీపీ డివిజన్ పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీలను చేపట్టామన్నారు. రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, మొయినాబాద్, నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధుల్లో ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వరుస సెలవులు కావడంతో సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను ఇళ్లలో పెట్టకపోవడం మంచిదన్నారు. తాము వెళుతున్న విషయాన్ని కాలనీ సంఘాలకు, పోలీసులకు తెలియజేస్తే మంచిదని.. దీనివల్ల పెట్రోలింగ్ పోలీసులు గస్తీ చేపట్టే వీలుంటుందని వివరించారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి దొంగతనాల నిరోధానికి చర్యలు తీసుకున్నామన్నారు. బస్తీలలో గస్తీ ముమ్మరం చేయటంతోపాటు దొంగతనాలు, చోరీలు జరిగే ప్రధాన ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తమ నివాస ప్రాంతాలు, కాలనీలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వాహనాల నంబర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ప్రజలకు సూచించారు.
పండక్కి ఊరెళ్తున్నారా..ఇల్లు జాగ్రత్త..!
Published Tue, Jan 12 2016 5:17 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement