సాక్షి, హైదరాబాద్ : ఏపీ ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియాకు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రావి వెంకటరమణ తదితరులు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఓట్ల గల్లంతు వ్యవహారాన్ని వివరించారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో భారీగా ఓట్లను తొలగించారని సిసోడియా దృష్టికి తీసుకువెళ్లారు. గల్లంతైన ఓట్లపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ఎన్నికల అధికారిని కోరారు.
అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ...‘ ఒక్క సత్తెనపల్లిలోనే 15వేల ఓట్లు గల్లంతు అయ్యాయి. గల్లంతు అయిన ఓట్లు అన్నీ వైఎస్‌ఆర్ సీపీ నేతలవే. నరసరావుపేటలోనూ భారీగా అక్రమాలు జరిగాయి. కొంతమంది అధికారులు టీడీపీ నేత కోడెల శివప్రసాదరావుతో కుమ‍్మక్కు అయ్యారు. టీడీపీకి మేలు చేసేందుకే ఓట్లు తొలగించారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి. మా కుటుంబసభ్యుల ఓట్లు తొలగించారు. ఇక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటును మరో వార్డుకు మార్చారు. ఎలాంటి విచారణ లేకుండానే ఓట్లను మాయం చేశారు. కోడెల, ఆయన తనయుడి దురాగతాల వల్లే ఓట‍్లను తొలగించారు. వెంటనే అక్రమాలను సరిచేయకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment