జిమ్మి కోసం ఏసీబీ వేట
* అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందం
* మత్తయ్య దారిలో ఏపీలో జిమ్మిబాబు!
* కొత్తగా తెరపైకి వచ్చిన జనార్దన్‌పై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను రెండు రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అప్పగించడంతో.. అధికారులు తదుపరి కార్యాచరణకు దిగారు. ఇప్పటికే నోటీసులు జారీ చేసినా.. బేఖాతరు చేసి తప్పించుకు తిరుగుతున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబుపై దృష్టిపెట్టారు. ఆయన ఆచూకీ తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఇక సండ్ర వాంగ్మూలం, ఫోరెన్సిక్ నివేదిక ద్వారా కొత్తగా వెలుగులోకి వచ్చిన జనార్దన్‌ను కూడా విచారణకు పిలవాలని ఏసీబీ భావిస్తోంది. ఈ కేసులో జనార్దన్ భాగస్వామ్యానికి సంబంధించి పలు కీలక ఆధారాలు లభించాయని, ఆ మేరకు నోటీసులు జారీ చేయాలని ఏసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జిమ్మిని పట్టుకోవాల్సిందే!
సండ్రతో పాటు నోటీసులు జారీచేసినా జిమ్మిబాబు ఇప్పటివరకు ఏసీబీ ఎదుట హాజరు కాలేదు. దీనిని ఏసీబీ తీవ్రంగా పరిగణిస్తోంది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో జిమ్మిబాబు కూడా కీలకంగా వ్యవహరించినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయనను అదుపులోకి తీసుకుని, మరిన్ని వివరాలు రాబట్టాలని ఏసీబీ భావిస్తోంది. అసలు ఈ కేసులో ఏ4 నిందితుడు మత్తయ్య మాదిరిగా.. జిమ్మిబాబు కూడా ఏపీలో ఆశ్రయం పొందుతున్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. మత్తయ్య తెలంగాణ పోలీసులకు వాంటెడ్ అంటూ తమకు అధికారిక సమాచారం లేదని వ్యాఖ్యానించిన ఏపీ పోలీసులు.. ఆయన అరెస్టుకు సహకరించలేదు. ఈ నేపథ్యంలో జిమ్మిబాబు పరారీలో ఉన్నారంటూ ఏపీ పోలీసులకు ముందస్తు సమాచారమిచ్చేలా లేఖ రాయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
మధ్యవర్తి జనార్దనేనా..?
‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ‘బాస్ (చంద్రబాబు)’కు మధ్యవర్తిగా టీడీపీ నేత జనార్దన్ వ్యవహరించినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. సెబాస్టియన్, సండ్ర ఫోన్ సంభాషణల్లో పలుమార్లు జనార్దన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ప్రతీ సందర్భంలోనూ జనార్దన్‌కు చెప్పారా? అంటూ సెబాస్టియన్ అడగడం, ‘సార్’ ప్రస్తావన వచ్చిన ప్రతీసారి జనార్దన్ పేరును సెబాస్టియన్ ఉటంకించిన విషయం కాల్ రికార్డుల విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. సండ్ర కూడా పలుమార్లు ‘ఈ డీల్ జనార్దన్‌కు తెలుసు’ అంటూ మాట్లాడారు. దీంతో ఎమ్మెల్యేల కొనుగోలులో జనార్దన్ పాత్ర ఉన్నట్లు ఏసీబీ అంచనాకు వచ్చింది. సండ్రను విచారించనున్న ఏసీబీ అధికారులు.. కేసులో కీలకాంశాలతో పాటు జనార్దన్ ఎవరనేది నిర్ధారించి, నోటీ సులు జారీ చేయాలని యోచిస్తున్నారు.