సండ్రకు రెండ్రోజుల ఏసీబీ కస్టడీ
* ప్రత్యేక కోర్టు ఆదేశం
* న్యాయవాది పర్యవేక్షణలోనే విచారించాలి
* థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదు
* ప్రతిరోజూ సాయంత్రం వైద్య పరీక్షలు చేయించాలి
* ఓటుకు కోట్లు కేసులో సండ్రకు కీలక పాత్ర
* అందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి
* ప్రత్యేక కోర్టులో ఏసీబీ వాదన
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ప్రత్యేక కోర్టు రెండ్రోజులపాటు ఏసీబీ కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు న్యాయమూర్తి లక్ష్మీపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురు, శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.40 గంటల మధ్య న్యాయవాది సమక్షంలో విచారించవచ్చని, అనుచితంగా ప్రవర్తించరాదని, థర్డ్‌డిగ్రీ పద్ధతులు ప్రయోగించరాదని పేర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటల తర్వాత ఏసీబీ కార్యాలయానికి తరలించాలని స్పష్టంచేశారు. కస్టడీ సమయంలో పరిశుభ్రమైన ఆహారం అందివ్వాలని, శుభ్రంగా ఉన్న టాయిలెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేయించాలని, కస్టడీ అనంతరం తిరిగి శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. కస్టడీ సమయంలో సండ్ర రక్షణ బాధ్యత ఏసీబీ అదనపు ఎస్పీ మల్లారెడ్డిదేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు వైద్య పరీక్షల అనంతరం వీరయ్యను ఏసీబీ అదనపు ఎస్పీకి అప్పగించాలని జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. కస్టడీ సమయంలో అవసరమైనన్ని మంచినీళ్లు వీలైతే మినరల్ వాటర్ ఇవ్వాలని, రాత్రి పడుకునే ముందు దిండు, బెడ్‌షీట్ ఇవ్వాలని, లైట్, ఫ్యాన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఆ డబ్బు ఎక్కడుందో తేల్చాలి..
అంతకుముందు తమ కస్టడీకి అప్పగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ స్పెషల్ పీపీ వి.సురేందర్‌రావు వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కుట్ర కేసులో సండ్ర వెంకట వీరయ్య కీలక పాత్ర పోషించారన్నారు. ఆధారాలు మాయం చేసేందుకే దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పోయారని తెలిపారు. రాజమండ్రిలో చికిత్స పొందుతున్నానని లేఖ రాసిన సండ్ర ఏ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో కూడా చెప్పలేదన్నారు. హైదరాబాద్‌లో నిమ్స్ సహా అనేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నా.. విచారణ నుంచి తప్పించుకునేందుకే పక్క రాష్ట్రంలోని రాజమండ్రికి వెళ్లిపోయారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలు తెలిసినా ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా అమాయకుడిలా నటిస్తున్నారని తెలిపారు. మొదట సాక్షిగా సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చామని, అయితే రెండో నిందితుడు సెబాస్టియన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు విశ్లేషించి ఇచ్చిన నివేదిక ఆధారంగా సండ్రకు ఈ కుట్రలో కీలక పాత్ర ఉన్నట్లు నిర్ధారించామన్నారు. స్టీఫెన్‌సన్‌తో ఓటు వేయిస్తే హామీ ఇచ్చిన డబ్బు తాను ఇస్తానంటూ సండ్ర.. సెబాస్టియన్‌తో చెప్పారని, ఈ నేపథ్యంలో ఆ డబ్బు ఎక్కడ ఉందో కనిపెట్టాల్సి ఉందని వివరించారు. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో విచారించి వదిలేశామన్నారు.
సండ్ర పాత్రకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నందునే అరెస్టు చేశామని, అరెస్టు తర్వాత విచారణకు సమయం సరిపోలేదని, కస్టడీకి అప్పగించాలని కోరారు. సండ్రను ఇప్పటికే విచారించారని, కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన నిందితుడే కాదని, స్టీఫెన్‌సన్ ఇచ్చిన ఫిర్యాదులోనూ సండ్ర పేరు లేదన్నారు. స్టీఫెన్‌సన్ 28న ఫిర్యాదు చేస్తే 31న ఏసీబీ ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేసిందని తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద మొదట సాక్షిగా విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినా దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా, మారిన పరిస్థితుల రీత్యా సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఎ) కింద అనుమానిత నిందితునిగా నోటీసులు జారీచేసే అధికారం ఏసీబీకి ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏసీబీ కస్టడీ కోరడం సహేతుకమేనని స్పష్టం చేశారు. మరోవైపు సండ్ర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది.