సండ్రకు 21 వరకు రిమాండ్
ఐదు రోజులపాటు కస్టడీకి కోరిన ఏసీబీ
విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ అరెస్టు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఈనెల 21 వరకు రిమాండ్‌కు తరలించాలని ఏసీబీ ప్రత్యేక కోర్టు మంగళవారం ఆదేశించింది. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా సండ్రను ఈ కేసులో ఐదో నిందితుడిగా చేర్చిన ఏసీబీ అధికారులు.. సోమవారం సాయంత్రం ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మంగళవారం ఉదయం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట హాజరుపర్చారు. ఈ కేసులో సండ్ర పాత్రకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు ఏసీబీ సమర్పించింది. సండ్ర సూచన మేరకే నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టేందుకు సెబాస్టియన్ ప్రయత్నించినట్లు వివరించింది. ఈమేరకు వీరి మధ్య పలు దఫాలుగా జరిగిన ఫోన్ సంభాషణలను అందజేసింది.
మీడియా ద్వారా తెలిసింది!
‘ఓటుకు కోట్లు’ కేసులో తనకు ఏసీబీ నోటీసులు జారీచేసిన విషయం తెలియదని, విశాఖపట్నంలో చదువుకుంటున్న పిల్లలను చూసేందుకు వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో అస్వస్థతకు గురికావడంతో రాజమండ్రిలో చికిత్స పొందానని సండ్ర ఈ సందర్భంగా న్యాయమూర్తికి చెప్పారు. తాను ఖమ్మంలో ఉంటానని, హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద ఏసీబీ నోటీసులు అంటించిన విషయం తెలియదని పేర్కొన్నారు. రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు హాజరయ్యానని.. 8 గంటలపాటు జరిగిన ఏసీబీ అధికారుల విచారణలో అన్ని విషయాలు వెల్లడించానని అన్నారు. తనకు మొదట సీఆర్‌పీసీ సెక్షన్ 160 (సాక్షిగా) కింద నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు మాత్రం సీఆర్‌పీసీ 41(ఎ) కింద నోటీసులు ఇచ్చారని.. తనను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొన్నారు.
అయితే దీనిపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో ఇన్ని ఆసుపత్రులున్నా.. ఉద్దేశపూర్వకంగా ఏసీబీ విచారణ నుంచి తప్పించుకునేందుకే రాజమండ్రిలోని ఆసుపత్రిలో చేరారని కోర్టుకు తెలిపింది. దీనిపై సంతృప్తి చెందిన న్యాయమూర్తి ‘అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు ఏమైనా ఇబ్బందులకు గురిచేశారా’ అని ప్రశ్నించగా.. అటువంటిదేమీ లేదని సండ్ర సమాధానమిచ్చారు. అనంతరం ఆయనను రిమాం డ్‌కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా తనకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పిం చాలని కోరు తూ వీరయ్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి అనుమతించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సండ్ర పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
ఐదు రోజుల కస్టడీకి ఇవ్వండి
స్టీఫెన్‌సన్ కు ఇస్తామన్న రూ. 5 కోట్లలో రూ. 4.5 కోట్లు ఎక్కడున్నాయో కనిపెట్టాలంటే సండ్రను కస్టడీలో విచారించడం అనివార్యమని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. ఈ మేరకు అదనపు ఎస్పీ మల్లారెడ్డి మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు తర్వాత ఎక్కువ సమయం లేకపోవడంతో ఆయన్ను విచారించలేకపోయామని.. ఐదు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించనుంది. కాగా అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు సండ్ర వెంకట వీరయ్యను చర్లపల్లి జైలుకు తరలించారు. సండ్రకు ఖైదీ నంబర్ 4887ను కేటాయించి, గంగా బ్యారక్‌లో ఉంచినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు.