నీటిలోనే నెల్లూరు: మళ్లీ భారీ వర్షాలు
నెల్లూరు: భారీ వర్షాలకు నెల్లూరు జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. వందలాది గ్రామాలు, కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని గ్రామాలు ఇప్పుడిప్పుడే వరద నీటి నుంచి బయటపడుతున్నయనుకోగానే.. మళ్లీ సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు డివిజన్ లో ఈ ఉదయం నుంచి కురుస్తున్నవాన జనజీవనాన్నిస్తంభింపజేసింది. గూడురు రూరల్ మండలం ఇందురు వద్ద రెండు కిలోమీటర్ల మేర రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ఉప్పుటేరు కాల్వ పొంగి పొర్లడంతో చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. చిట్టమూరు మండలం పేరపాటితిప్ప, రంగనాథపురం గ్రామాలు కూడా నీటమునిగాయి. ఆయా గ్రామాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికీ కోవూరు, గూడూరు, సూళ్లూరుపేట, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో 54 గ్రామాలు, కాలనీలు వరద నీటిలో చిక్కుకుని ఉన్నాయి. నెల్లూరు నగరంలోని పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి.
అటు తమిళనాడులోనూ మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నెల 22 వరకు విద్యా సంస్థలకు ప్రకటించిన సెలవును పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన మూడు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమిళనాడులో దాదాపు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.