
ఆర్టీసీలో ఎన్నికల కోలాహలం
- ఫిబ్రవరి 18న గుర్తింపు సంఘం ఎన్నికలు
- యూనియన్లకు గుర్తులు ఖరారు చేసిన కార్మిక శాఖ
- వైఎస్సార్ సీపీ మజ్దూర్ యూనియన్‌కి టేబుల్ ఫ్యాన్ గుర్తు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18న అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. సోమవారం బస్‌భవన్‌లో కార్మిక శాఖ అధికారులు, యూనియన్ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించి సమావేశంలో ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేశారు.
ఏపీలోని అన్ని డిపోల్లో ఫిబ్రవరి 18న ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఫలితాల్ని అదే డిపోల్లో ప్రకటించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఫిబ్రవరి 23, 24 తేదీల్లో కార్మిక శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో లెక్కిస్తారు. గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై ఈ నెల 7న తొలిసారిగా సమావేశం జరిగింది. ఏపీ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ సూర్యప్రకాష్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 29న డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టులు యూనియన్లకు అందజేస్తారు. ఫిబ్రవరి 2న ఓటర్ లిస్టులపై అభ్యంతరాల్ని ఆయా డిపోల్లో మేనేజర్లకు తెలియజేయాలి. తుది అభ్యంతరాలపై ఫిబ్రవరి 5న పరిశీలిస్తారు. ఫిబ్రవరి 9న తుది ఓటర్ల జాబితాలను కార్మిక శాఖ కమిషనర్ అన్ని డిపోలు, యూనిట్లకు అందజేస్తారు.
గుర్తింపు ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు సెల్‌ఫోన్లు, కెమెరాలను పోలింగ్ బూత్‌లలోకి అనుమతించరు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎనిమిది సంఘాలు పోటీలో ఉంటాయి. యూనియన్లకు గుర్తులు ఖరారయ్యాయి. వైఎస్సార్ సీపీ మజ్దూర్ యూనియన్‌కు టేబుల్ ఫ్యాన్ గుర్తు కేటాయించారు. ఎంప్లాయిస్ యూనియన్‌కు బస్సు, ఎన్‌ఎంయూకి కాగడా, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు స్టార్, కార్మిక పరిషత్తుకి టైర్, ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్‌కి పావురం, యునెటైడ్ వర్కర్స్ యూనియన్‌కి స్టీరింగ్, కార్మిక సంఘ్ పిడికిలి గుర్తులను కేటాయించారు. డమ్మీ బ్యాలెట్లను ఫిబ్రవరి 9న పోటీలో ఉన్నవారికి అందించనున్నారు.