మాస్టర్‌ప్లానంతా వ్యాపారమే
సాక్షి, హైదరాబాద్: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించామంటూ సీఎం చంద్రబాబు ప్రజల్ని మభ్యపెడుతున్నారని, వాస్తవానికి అందులో ఉన్నదంతా వ్యాపారమేనని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గద్దెనెక్కినప్పటినుంచే రాజధానిపై సింగపూర్‌లోని ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఎపుడో మాట్లాడేసుకున్నారని చెప్పారు.
రాజధానికి సంబంధించి ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగలేదని, అవన్నీ సింగపూర్ సంస్థలతోనే అనే విషయం ఇపుడు స్పష్టంగా తేలిపోయిందన్నారు. రాజధాని నిర్మాణంకోసం ప్రత్యేక సంస్థనొకదాన్ని ఏర్పాటు చేస్తామని, స్విస్ చాలెంజింగ్ పద్ధతిలోనే పనులప్పగిస్తామని ఓవైపు చెబుతూనే మళ్లీ దేశంలోని ఇతర సంస్థలకూ టెండర్లలో పాల్గొనే అవకాశమిస్తామంటూ నిష్పాక్షికంగా ఉన్నట్లు చంద్రబాబు ప్రజలముందు నటిస్తున్నారని ధర్మాన విమర్శించారు.
కాగా కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేసిన వ్యవహారంలో ఆమెదే తప్పని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు అభిప్రాయపడటం అప్రజాస్వామికమని ధర్మాన ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ వ్యవహారంలో సీఎం ఓ ఐఏఎస్ అధికారితో దర్యాప్తు చేయిస్తానని హామీఇచ్చినా ఇంతవరకూ రూపుదాల్చలేదన్నారు.
తొక్కిసలాటలో కుట్ర ఉందని మంత్రులతో చెప్పిస్తారా?
పుష్కరాల్లో తొక్కిసలాటకు కారణాలు వేరే ఉన్నాయంటూ మంత్రులతో కేబినెట్ భేటీలో చెప్పించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ధర్మాన అన్నారు. చంద్రబాబు చేసిన తప్పువల్ల పుష్కరాల్లో 30మంది ప్రాణాలు కోల్పోయిన విషయం స్పష్టంగా అందరికీ తెలిసిపోతోంటే మంత్రులతో ఇలా మాట్లాడించడం తగదన్నారు.