ముగిసిన పుష్కర పర్వం
* ఆంధ్రప్రదేశ్‌లో అట్టహాసంగా ముగింపు
* 274 ఘాట్లలో 4.89కోట్ల మంది భక్తుల పుణ్యస్నానం
సాక్షి, రాజమండ్రి: పుష్కర మహాపర్వం ముగియడంతో పన్నెండు రోజులుగా భక్తజనంతో కిక్కిరిసిన గోదావరి తీరం ఒక్కసారిగా బోసిపోయింది. పన్నెండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కర పుణ్యస్నానానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు, ప్రవాస భారతీయులు ఖండాంతరాలు దాటి మరీ వచ్చారు. గోదావరి మాత ఆశీస్సులు అందుకున్న భక్తులు ఒక్కొక్కరుగా తిరిగి ఇళ్లకు వెళుతున్నారు.
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 14 ఉదయం 6.26 గంటలకు రాజమండ్రి పుష్కరఘాట్‌లో గోదావరి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. అక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా గోదావరి మాతకు పూజలు చేసి పుష్కరస్నానమాచరించారు.అదే రోజు అక్కడ జరిగిన తొక్కిసలాట అపశ్రుతితో ప్రారంభమైన పుష్కరాలు శనివారంతో అట్టహాసంగా ముగిశాయి. ఉభయగోదావరి జిల్లాల్లో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా పండుగలా జరిగిన ఈ పుష్కరాలకు శనివారం సాయంత్రం 6.38 గంటలకు ముగింపు పలికారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ముగింపు వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రముఖసినీ దర్శకుడు బోయపాటి శ్రీను పర్యవేక్షణలో పుష్కర ఘాట్‌లో నిత్యహారతికి ప్రత్యేకతను తీసుకువచ్చేలా స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టం, కాంతులీనే లేజర్‌షో, గోదావరిలో రెండు వంతెనల నడుమ కళ్లు మిరిమిట్లు గొలిపేలా భారీ బాణసంచా కాల్పులతో ఈ మహాపర్వానికి ఘనమైన వీడ్కోలు పలికారు.
పుష్కర గడియలు ముగియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు లక్షదీపార్చన ప్రారంభించారు. ఆ తర్వాత సుమారు గంటన్నర వరకు గోదావరిలో లక్షదీపాలు వదిలే కార్యక్రమం కొనసాగింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన సుమధుర గాత్రకచేరీతో శ్రోతలను తన్మయుల్ని చేశారు. పలు గీతాలతో పుష్కర ప్రాశస్త్యాన్ని వివరిస్తూ భక్తులను పులకింపజేశారు.
వెయ్యి మంది కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ముగింపు వేడుకల్లో బాబా రామ్‌దేవ్, సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రసంగించారు. చంద్రబాబు పిలుపు ఇచ్చిన ఇంటింటి దీపారాధనకు స్పందన కరువైంది. కాగా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో డీజీపీ జేవీ రాముడు పుష్కర స్నానమాచరించి, పిండప్రదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు పి.సుజాత, పి.మాణిక్యాలరావు, శిద్దా రాఘవరావు కొవ్వూరులోని ఘాట్‌లను పరిశీలించారు.
ముహూర్తం నుంచి.. నిత్య హారతి వరకు..
పుష్కర ముహూర్తమే వివాదంతో మొదలైంది. పండితులు, వివిధ మఠాధిపతులు భిన్నమైన తేదీలు చెప్పినా ప్రభుత్వం జూలై 14న ప్రారంభించి తన పంతం నెగ్గించుకుంది. గోదావరి నిత్యహారతి సంప్రదాయ విరుద్ధంగా గోదావరికి కాకుండా వీఐపీలకు ఇచ్చినట్టుగా పట్టడం భక్తుల మనోభావాలు దెబ్బతిన్న విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కళ్లు తెరిచిన ప్రభుత్వం 26వ తేదీ నుంచి నిత్యహారతి గోదావరికి అభిముఖంగా నిర్వహించనుంది.
వీఐపీల రాక: పుష్కర స్నానాలకు పలువురు రాజకీయ, సినీ, పీఠాధిపతులు పుష్కర స్నానాలు ఆచరించారు. గవర్నర్ నరసింహన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్‌బాబాసాహెబ్ బొసాలే, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, యోగా గురువుబాబారామ్‌దేవ్, చినజీయర్‌స్వామి తదితరులు పుష్కరాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ముఖ్యమంత్రికి సీడ్ కేపిటల్ ప్లాన్‌ను అందించారు.
29 కుటుంబాల్లో విషాదం
పుష్కరాలు ప్రారంభమైన గంటన్నరలోనే రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందిన ఘటన పుష్కర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. రెండు జిల్లాల్లో పుష్కర స్నానానికి వచ్చి గల్లంతై, రోడ్డు ప్రమాదాల్లో మరో 80 మంది మృతిచెందారు. అలాగే 22వ తేదీ రాత్రి రాజమండ్రిలో సంభవించిన అగ్నిప్రమాదంలో మూడు పోలీసు వాహనాలు దగ్ధమై, పలువురు ఆస్పత్రిపాలైన ఘటన భక్తులను మరోసారి ఉలిక్కిపడేలా చేసింది.
అవరోధాలు ఎదురైనా...
సుదూర ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేయలేక సర్కారు చేతులెత్తేసింది. ప్రణాళిక లేకుండా అనుసరించిన ఏకపక్ష విధానంతో భక్తులు నరకయాతన పడ్డారు. అటు విజయవాడ, ఇటు విశాఖ వరకు జాతీయరహదారిపై పూటలతరబడి ట్రాఫిక్ స్తంభించి ప్రయాణం నరకప్రాయమైంది. దీనికితోడు ముఖ్యమంత్రి రాజమండ్రిలోనే మకాంచేసి మంత్రులు, అధికారగణంతో సమీక్షలు, పర్యటనల పేరుతో కలియతిరగడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ప్రభుత్వ ఏర్పాట్లు అంతంతమాత్రంగానే ఉన్నా భక్తులు సర్దుకుపోయారు. వందలాది స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు, స్థానికులు ముందుకు వచ్చి తలోచేయి వేసి పుష్కరాలను గట్టెక్కించారు.
భళా ‘పుష్కర గోదావరి’
* 1,260 మందితో కూచిపూడి నృత్య ప్రదర్శన
* అలరించిన మంగళంపల్లి
సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరాల చివరి రోజైన శనివారం రాజమండ్రిలో ప్రదర్శించిన భారీ కూచిపూడి నృత్యం ప్రేక్షకులను అలరించింది. 1,260 మంది కూచిపూడి కళాకారులతో ‘పుష్కర గోదావరి’ పేరిట కూచిపూడి నాట్యారామం సమర్పణలో వేదాం తం రామలింగంశాస్త్రి పర్యవేక్షణలో నృత్యరూపకం ప్రదర్శించారు. సీఎం చంద్రబాబు దంపతులు, యోగా గురువు బాబా రాందేవ్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గాత్ర కచేరీ శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది.
అలిగిన పల్లె: ఏపీ సమాచార, ఐటీ శాఖల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అలిగారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి వేదికపైకి ఎక్కుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను వేదిక కిందే ఉంచి సభలో పాల్గొన్నారు.