ప్రత్యూషతో స్వయంగా మాట్లాడతాం
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, కన్నతండ్రి రమేశ్ కుమార్ చేతుల్లో తీవ్ర హింసకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషతో స్వయంగా తాము మాట్లాడదలచామని, ఆమెను సోమవారం తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆమె మేనమామను కూడా కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలంది. ప్రత్యూష భవిష్యత్తు గురించి ఆమెతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈ ఘటనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు లేఖ రాశారు. పత్రిక కథనాల ఆధారంగా ఈ ఘటనను సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారణ జరపాలని కోరారు.
దీనికి అంగీకరించిన జస్టిస్ బొసాలే.. పత్రిక కథనాలను సుమోటో రిట్ పిటిషన్‌గా పరిగణించేందుకు అంగీకరించి, ఆ మేరకు జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. గురువారం నాడు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు తాను స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషతో మాట్లాడానని, ఆమె శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ తెలిపారు.
అంతేకాక ప్రత్యూష పెద్దమ్మ, పెదనాన్న కోర్టు ముందు హాజరయ్యారని వివరించారు. దీంతో ధర్మాసనం వారిద్దరినీ తమ వద్దకు పిలిపించుకుని పలు విషయాల గురించి మాట్లాడింది. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, ప్రత్యూష తండ్రి జీతం ఎంత..? ఆయనకు ఇతర ఆదాయ మార్గాలు ఏవైనా ఉన్నాయా..? ప్రత్యూష పేరు మీద ఉన్న ఇంటి వివరాలను సేకరించి వాటిని తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
‘బేటీ బచావో-బేటీ పడావో’ పథకం గురించి అధ్యయనం చేసి, అది ప్రత్యూషకు ఏ రకంగా ఉపయోగపడగలదో చెప్పాలంది. ప్రత్యూషను తాత్కాలికంగా ప్రైవేటు వసతి గృహాల్లో ఉంచే విషయంపై పరిశీలన చేయాలని శరత్‌కుమార్‌కు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.