ప్రత్యూషకు రూ. 5 లక్షల చెక్కు సిద్ధం
- హైకోర్టుకు నివేదించిన తెలంగాణ ప్రభుత్వం
- ఆమె పేరిట ఫిక్స్‌డ్ చేయాలని సూచించిన ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి చేతుల్లో తీవ్ర హింసకు గురైన ప్రత్యూషకు ఇవ్వాలని నిర్ణయించిన రూ.5 లక్షలను ఆమె పేర బ్యాంకు లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని హైకోర్టు గురువారం టీ సర్కార్‌ను ఆదేశించింది. ప్రత్యూష తల్లికి చెందిన ఇంటి అద్దె కూడా ఇకపై ఆమెకే దక్కేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. తండ్రికి వచ్చే జీతం నుంచి కొంత మొత్తాన్ని అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, ఈ విషయాలన్నింటిపై ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను సవతి తల్లి తీవ్రంగా హింసించి, ఆమె చేత యాసిడ్ తదితర ప్రమాదకర రసాయనాలు తాగించినట్టు పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన పిటిషన్‌ను ధర్మాసనం గురువారం మళ్లీ విచారించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, ప్రత్యూషకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సంబంధించిన చెక్కు సిద్ధంగా ఉందని, కోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు తగిన విధంగా వ్యవహరిస్తామన్నారు. రూ. ఐదు లక్షలను ప్రత్యూష పేర ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలన్న ధర్మాసనం, బాలికల రక్షణ కోసం ఇప్పుడున్న చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించింది. ప్రత్యూష కోసం ఏం చేయాలనుకుంటున్నారో వివరిస్తూ ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.