సాక్షి, హైదరాబాద్: ప్రత్యూషలాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంక్షేమం కోసం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పటికే రూపొందించిన పథకాలు, ప్రతిపాదనల వివరాలను తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై సుమోటోగా హైకోర్టు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాజ్యాన్ని పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఏఎస్‌జీ) ఎస్.శరత్‌కుమార్ వాదనలు విని పించారు. ప్రత్యూష సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలియజేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ...
ప్రత్యూష గురించి కోర్టు పట్టించుకుంది కాబట్టి, ఆమె ప్రస్తుతం సురక్షిత స్థితిలో ఉన్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరి విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి అలాంటి వారి సంరక్షణ కోసం తగిన చర్యలు చేపట్టాలని సూచిం చింది. ప్రత్యూషలాగే ఏపీలో ఓ బాలిక ఉదంతం గురించి ఆ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తమ దృష్టికి తీసుకొచ్చారని పేర్కొంది. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఏమిటో చెప్పాలని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.
ప్రత్యూష లాంటి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి
Published Fri, Aug 21 2015 1:54 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement