ఏపీ హైకోర్టుకు నిధులపై మూణ్నెల్లలో నిర్ణయం తీసుకోండి
* కేంద్రానికి హైకోర్టు ఆదేశం
* రాష్ట్ర ప్రభుత్వ ‘సవరణ’ పిటిషన్‌పై విచారణ
* కేంద్రానికి, ఏపీ సీఎస్ తదితరులకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన నిధుల కేటాయింపు విషయంలో మూడు నెలల్లోపు తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం నిధులను కేటాయించాక వాటిని శాశ్వత హైకోర్టు ఏర్పాటుకు ఖర్చు చేయాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై గత మే 1న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులైన కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలువురు న్యాయవాదులకు నోటీసులు జారీ చేసింది. తమ వ్యాజ్యాలను విచారణకు స్వీకరించి ప్రతివాదులందరికీ నోటీసులివ్వాలన్న అడ్వకేట్ జనరల్ కె.రామకష్ణారెడ్డి వాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఏపీ ఏజీ పి.వేణుగోపాల్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.
తెలంగాణ ప్రభుత్వ వాదన ఇదీ...
‘‘ఏపీ హైకోర్టు ఆ రాష్ట్ర భూభాగంలోనే ఉండాలని మే 1 నాటి తీర్పులో అప్పటి ధర్మాసనం చెప్పింది. ఏపీ హైకోర్టును తెలంగాణలో ఎక్కడా ఏర్పాటు చేసేందుకు చట్టం అనుమతించడం లేదని, అది శాశ్వత ప్రతిపాదకన ఏర్పడాలే తప్ప తాత్కాలికంగా కాదని కూడా పేర్కొంది. కానీ ఇలా చెప్పడం రాజ్యాంగంలోని 214, 366(14) అధికరణలకు విరుద్ధం. ఎందుకంటే హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన ప్రదేశాన్ని విభజన చట్టంలోని సెక్షన్ 31(2) ప్రకారం రాష్ట్రపతి నోటిఫై చేస్తారు.
ధర్మాసనం తీర్పు ఇందుకు విరుద్ధంగా ఉంది గనుక దాన్ని సవరించండి’’ అని తెలంగాణ ప్రభుత్వం అనుబంధ పిటిషన్‌లో కోరింది. హైకోర్టు విభజనపై దాఖలైన వ్యాజ్యాల్లో తీర్పును వాయిదా వేశాక అప్పటి ధర్మాసనం తనంతతానుగా కొన్ని ప్రశ్నలను లేవనెత్తిందని గుర్తు చేసింది. ‘‘తీర్పు వెలువడ్డాకే ఈ ప్రశ్నల గురించి తెలిసింది. దాంతో వాటికి సమాధానం చెప్పే అవకాశం లేకుండా పోయింది’’ అని పేర్కొంది.