శ్రీవారి లడ్డూలో పిన్ను
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూలో పిన్ను కనిపించింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీవారి లడ్డూలు అందించేందుకు హైదరాబాద్ కు చెందిన శ్రీవారి సేవకులు సోమవారం తిరుమలకు వచ్చారు. భక్తులకు వారు లడ్డూలు మంజూరు చేస్తుండగా, ఓ లడ్డూలో పిన్ను ఉందంటూ ఓ భక్తుడు దాన్ని తిరిగిచ్చేశాడు. లడ్డూలో ఉన్న పిన్ను చూసి శ్రీవారి సేవకులు కూడా కంగుతిన్నారు. దాన్ని కొందరు ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
భక్తులు ఇచ్చిన లడ్డూలో పిన్ను కనిపించిన మాట వాస్తవమేనని, దాన్ని టీటీడీ సిబ్బంది తీసుకుని డ్యామేజీ కింద రాసుకున్నారని శ్రీవారి సేవకుడు ఒకరు మంగళవారం మీడియాకు తెలిపారు. లడ్డూ తయారీ, నాణ్యత విషయంలో టీటీడీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటం గమనార్హం. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణనించారు. ఆ మేరకు పొరపాట్లకు సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తున్నారు.