ప్రజాపక్షమా.. బాబు పక్షమా!
టీటీడీపీ నేతలు తేల్చుకోవాలి: మంత్రి జూపల్లి
* పాలమూరు ఎత్తిపోతలపై వైఖరి స్పష్టం చేయాలి
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుకూలమో కాదో తేల్చకుండా తెలంగాణ టీడీపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఈ విషయంలో టీటీడీపీ నేతలు తాము ప్రజల పక్షమో, చంద్రబాబు పక్షమో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో జూపల్లి విలేకరులతో మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావుకు బహిరంగ లేఖ రాయడాన్ని తప్పుబట్టారు.
లేఖలో పేర్కొన్నట్లుగా టీడీపీ హయాం లో తెలంగాణకు నీటి ప్రాజెక్టులపై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. భీమా ఎత్తిపోతల పథకానికి 1985లోనే అన్ని అనుమతులు వచ్చినా, 1985 నుంచి 2004 మధ్యలో ఐదేళ్లు మినహా టీడీపీ అధికారంలోనే ఉన్నా ప్రాజెక్టుకు ఒక్క రూపాయి ఖర్చుపెట్టలేదని జూపల్లి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు రూపాయి ఖర్చుపెట్టినట్లు రుజువు చేస్తానంటే శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు వస్తానని, రావుల ఆ రికార్డులతో రావాలని అన్నారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులకు కలిపి రూ.10 కోట్లు ఖర్చుపెట్టినట్లు రుజువు చేస్తారా అని సవాల్ చేశారు. చంద్రబాబు 1999 ఎన్నికల ముందు కల్వకుర్తి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, అదే ప్రాజెక్టుకు 2004 ఎన్నికల ముందు మరోసారి కొబ్బరికాయ కొట్టారని జూపల్లి గుర్తు చేశారు. ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదని, బాబు మొరగమంటే మొరగడమే తెలుసని ఎద్దేవా చేశారు.
సవాల్‌కు సిద్ధం: రావుల
మహబూబ్‌నగర్ జిల్లాలోని భీమా ప్రాజెక్టుకు నాటి ఏపీ సీఎంగా చంద్రబాబు నిధులు ఖర్చు చేశారని రుజువు చేస్తామని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. భీమా ప్రాజెక్టుకు చంద్రబాబు ఒక్క రూపాయి ఖర్చుచేశాడని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని మంత్రి జూపల్లి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామన్నారు. సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భీమా ప్రాజెక్టులో అంతర్భాగమని మంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు.
బాబు హయాంలోనే ఈ రిజర్వాయరు నిర్మాణమైందన్నారు. గతంలో టీడీపీలో ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఇప్పుడు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని, టీడీపీ హయాంలో మహబూబ్‌నగర్‌కు సాగునీటి రంగంలో అభివృద్ధి జరగలేదని ఆ ఫిరాయింపు నాయకులతో చెప్పించగలుగుతారా? అని రావుల ప్రశ్నించారు.