మొహం ఉన్నదా?! | n the coming days, Irrigation Water Wll Be Provided To 20 Lakh Acres In The Joint District | Sakshi
Sakshi News home page

మొహం ఉన్నదా?!

Published Thu, Nov 22 2018 9:18 AM | Last Updated on Thu, Nov 22 2018 10:26 AM

n the coming days, Irrigation Water Wll Be Provided To 20 Lakh Acres In The Joint District - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  పాలమూరు ప్రాంతానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీరని ద్రోహం తలపెట్టారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దుయ్యబట్టారు. తెలంగాణపై విషం చిమ్మే టీడీపీ ఏ ముఖం పెట్టుకొని పాలమూరు జిల్లాలో పోటీ చేస్తదని నిలదీశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జడ్చర్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డికి మద్దతుగా బుధవారం జడ్చర్లలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు.

తొమ్మిదేళ్లు సీఎంగా చంద్రబాబు పాలమూరు ప్రాంతాన్ని దత్తత తీసుకొని వలసలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారని ధ్వజమెత్తారు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం పచ్చబడకుండా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఢిల్లీకి లేఖలు రాసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.. ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులు కోర్టుల్లో కేసులు వేశారు.. అయినా రైతుల సంక్షేమం కోరి అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నం.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ రెండు పార్టీల నేతలు కూటమిగా జట్టుకట్టి వస్తున్నరు..

అసలు ప్రజలను ఓట్లు అడిగేందుకు ఆ నేతలకు మొహం ఉన్నదా? ఏం చెప్పి మళ్లీ ఓట్లు అడుగుతరు? ఇప్పటికే నేనోసారి బాబును తరిమికొడితే పారిపోయిండు.. ఈసారి మాత్రం ఆ పనిచేయాల్సింది ప్రజలే!జిల్లాలో రెండు చోట్ల పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేసి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. సూచించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే... 


తొమ్మిదేళ్లు దత్తత తీసుకున్నన్నా..
ఈ జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో.. ఏ ముఖం పెట్టుకొని పోటీ చేస్తున్నరు? ఇదే చంద్రబాబు నాయుడు 9 ఏళ్లు సీఎంగా ఉం డి... మహబూబ్‌నగర్‌ జిల్లాను దత్తత తీసుకొన్న అని మాట్లాడిండు. అభివృద్ధి చేయడానికి తొమ్మిదేళ్లు సరిపోవా? ఇయాల మనం నాలుగేళ్లలో కల్వకుర్తిని పూర్తి చేయలేదా? భీమా, నెట్టెంపాడు పూర్తి చేసి 8.5లక్షల ఎకరాలకు నీరు తీసుకోలేదా?

కోయిల్‌సాగర్‌ లిఫ్టు పూర్తి చేసి చెరువులు నింపుకోలేదా? కొత్త ప్రాజెక్టు పాలమూరు–రంగారెడ్డిని చకచక పనులు చేసుకుంటలేమా? కర్వెన రిజర్వాయర్‌ కళ్ల ముందే ఉన్నది, వట్టెం, నార్లాపూర్‌ రిజర్వాయర్ల పనులు జరుగుతున్నయి. షాద్‌నగర్‌లో లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్‌ నిర్మాణం జరగబోతున్నది. ఎంత త్వరగా.. నాలుగేళ్లలో కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రి ఒక్క పాలమూరు జిల్లాలోనే ఇన్ని రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయగలిగామంటే.. చంద్రబాబు తొమ్మిదేళ్లలో ఎందుకు చేయలేదని అడుగుతున్నా.  


గట్టి జవాబు చెబుదామా? 
పాలమూరు జిల్లా ప్రజలారా.. మీ వేలితోనే మీ కన్ను పొడిచేస్తా. మిమ్మల్ని అమాయకులను చేసో.. నాలుగు డబ్బులిచ్చో.. టక్కుటమార విద్యలతో మీ పాలమూరును మీతోనే బంద్‌ చేయిస్తా. దయాకర్‌రెడ్డిని మక్తల్‌లో గెలిపించి చూపిస్తా అని చంద్రబాబు చెబుతున్నాడు. అంటే మక్తల్‌లో టీడీపీని గెలిపిద్దామా.. లేదంటే చంద్రబాబుకు గట్టి జవాబు చెప్పాల్నా అనేది పాలమూరు ప్రజలు గట్టి నిర్ణయం చేయాలి.

పాలమూరు జర్నలిస్టులు ఇక్కడి బిడ్డలుగా.. నేను చెప్పే మాటలు నిజమా కాదా? నిజమే అయితే మీరు మంచి విశ్లేషణలు చేసి జిల్లా ప్రజలకు చైతన్యం చేయాలి. లేకుంటే మనం ఇబ్బందుల పాలైతం. జర్నలిస్టు మిత్రులకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నా. పాలమూరు గోస ఇప్పుడిప్పుడే తీరే పరిస్థితి వస్తున్నది. ఇయాల మహాకూటమి పేరు మీద చంద్రబాబు మళ్లీ తెలంగాణలో దూరిపోయి మీ ఇంట్లోకి వచ్చి కొట్టి పోతా అంటున్నడు.

చంద్రబాబుకు ఓటేసి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపుకుందామా, లేదు డిపాజిట్‌ రాకుండా ఓడగొట్టి బుద్ధి చెబుదామా.. అనేది పాలమూరు ప్రజలు నిర్ణయం చేయాలి. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. బాబు ఏ విధంగా సిగ్గు లేకుండా భుజాల మీద మోస్తున్నరని కాంగ్రెస్‌ నాయకులను కూడా అడగాలని కోరుతున్నా.  


కాంగ్రెస్సోళ్లు కూడా కేసులే ఏసిండ్రు.. 
కాంగ్రెస్‌ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలుగా నిలుచున్నరు. ఒకాయన పవన్‌కుమార్‌రెడ్డి దేవరకద్రలో, మరొకరు హర్షవర్ధన్‌రెడ్డి కొల్లాపూర్‌లో నిలబడుతున్నరు. ఇంకొకడు నాగం జనార్ధన్‌రెడ్డి అని నాగర్‌కర్నూల్‌లో ఉన్నడు. వీళ్లు ముగ్గురు కలిసి పాలమూరు ఎత్తిపోతల పథకం మీద 35 కేసులు వేసిండ్రు పుణ్యాత్ములు. భూములను ఖరీదు చేద్దామంటే.. ఈ ముగ్గురు కూడా ఎకరానికి రూ.50లక్షలు, రూ.30లక్షలు కావాలంటూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు.

ఇదేనా వీళ్లు పనిచేసే పద్ధతి. కరువుతో సతమతమయ్యే జిల్లా. ఊరుకొకటి బొంబై బస్సులున్నయి. జిల్లా దుఖం పోవాలనా, లేదా? భారతదేశం మొత్తం మీద పాలమూరుకు దండం పెట్టి చెబుతున్నా.. నేను మీ బిడ్డను. నా పోరాటానికి భుజం తట్టాలి. పోరాటం ఆగలేదు. ఇంకా దుర్మార్గులు ఉడుములాగా చొరబడి దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నరు.  


20లక్షల ఎకరాలకు సాగునీరు.. 
రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ఈ నాలుగేళ్లలోనే పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పాలమూరు జిల్లాలో దాదాపు పూర్తి చేసుకున్నాం. ఇంకా కేవలం పది శాతం పనులు మాత్రమే మిగిలినయి. ఉమ్మడి జిల్లాలో ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు సాగునీరు పారించుకోగలుగుతున్నాం. వలసలు మాయమైపోయి.. బొంబై బస్సులు బంద్‌ అయితున్నయి.

హైదరాబాద్‌లో ఉంటున్న ఇదే జిల్లాలోని వనపర్తి, కొల్లాపూర్‌ ప్రాంతాల ప్రజలు రేషన్‌కార్డులు మాకు ఊళ్లో ఇవ్వండి అని చెప్పి తిరిగొచ్చి గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. ఖచ్చితంగా పాలమూరు కరువు తీరాలే. పాత జిల్లా మొత్తం కలిపి 20 లక్షల ఎకరాలు సాగులోకి రావాలి. ఒక్క జడ్చర్ల నియోజకవర్గంలోనే 1.50లక్షల ఎకరాల పైచిలుకు సాగులోకి రావాలని చెప్పి లక్ష్మారెడ్డి గారు ఉదండాపూర్‌ వద్ద పట్టుబట్టి రిజర్వాయర్‌ పనులు చేయిస్తున్నారు. అవి అయిపోగానే కల్వకుర్తి, జడ్చర్ల, నారాయణపేట, కొడంగల్, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలకు సాగునీరు అందుతది. 


సిగ్గులేకుండా లేఖలు రాసిండు.. 
చంద్రబాబు పాలనలో పాలమూరులో వేసిన పునాది రాళ్లు తీసుకుపోయి కృష్ణా నదిలో అడ్డం వేస్తే అదే పెద్ద డ్యామ్‌ అయితది. తద్వారా మనకు నీళ్లు వస్తయని ఇది వరకే ఒకసారి చెప్పిన. పాలమూరును తొమ్మిదేళ్లు దత్తత తీసుకొని వలస జిల్లాగా మార్చిన చంద్రబాబు.. ఇయాల పాలమూరు ఎత్తిపోతల పథకం కడుతుంటే కట్టవద్దని ఢిల్లీకి లేఖలు రాసిండు.

అలాంటి ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతడు? దయచేసి పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచించాలి. మీతో కోరేదొక్కటే.. ఎన్నికల్లో కన్‌ప్యూజ్‌ కావొద్దు, ఆలోచన చేయాలి. మన ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న వ్యక్తికి ఓట్లేయడానికి మనేమేమైన ఎడ్డొళ్లమా, అంత అమాయకులమా? దయచేసి పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలి.  


ప్రతీ కార్యకర్త లక్ష్మారెడ్డి అనుకుని పనిచేయాలి 
జడ్చర్ల టౌన్‌: సీఎం కేసీఆర్‌ సభకు వచ్చిన ప్రతీ కార్యకర్త, మహిళ లక్ష్మారెడ్డిగా భావించుకుని 15 రోజులు కష్టపడి అత్యధిక మెజార్టీ తీసుకువచ్చేందుకు కృషిచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత పిలుపునిచ్చారు. జడ్చర్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్‌ వెళ్లాక ఆమె హాజరైన ప్రజలు, కార్యకర్తలు, మహిళలకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

సభ నుంచి సీఎం కేసీఆర్‌ ఎంతో ఉత్సాహంగా వెళ్లారని, ఆయన ఉత్సాహం మరింత రెట్టింపు చేసేందుకు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీని అందించాలని కోరారు. రానున్న 15రోజులు అత్యంత కీలకమని, ఇన్నాళ్లు పార్టీకోసం పాటుపడిన వారంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన భర్త అహర్నిశలు పాటుపడుతున్నారని, అదే స్ఫూర్తి కొనసాగించాలంటే ప్రజలు, కార్యకర్తలు కూడా సహకరించాలని విజ్ఞప్తిచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement