అసదుద్దీన్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి
కిషన్‌రెడ్డి డిమాండ్
* ఎంఐఎం గుర్తింపును రద్దుచేయాలని ఈసీని కోరతాం
సాక్షి, హైదరాబాద్: ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు మెమెన్‌కు ఉరిశిక్ష అంశంపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహపూరితమైనవని, ఆయనపై క్రిమినల్‌కేసు పెట్టాలని బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి శుక్రవారం డిమాండ్‌చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసదుద్దీన్ హైదరాబాద్‌లో స్పందించినందువల్ల తెలంగాణ ప్రభుత్వం తక్షణం చర్య తీసుకోవాలన్నారు.
ముంబై బాంబుపేలుళ్ల కేసులో దేశంలోని న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేసే విధంగా ఒవైసీ వ్యాఖ్యలున్నాయన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎంఐఎం గుర్తింపును రద్దుచేయాలని తమ పార్టీ తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు. శుక్రవా రం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ 1993లో ముంబై బాంబుపేలుళ్ల కారణంగా 270 మంది మరణించి, 700 మంది తీవ్రగాయాలకు గురైన ఘటనలకు బాధ్యులైన దావూద్ ఇబ్రహీం, అతని అనుచరుడు యాకూబ్ మెమెన్‌పై అన్ని న్యాయస్థానాలు మరణశిక్షను ఖరారు చేశాయన్నారు.
ఈ శిక్ష అమలుపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో పడిందన్న వార్తల నేపథ్యంలో అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవన్నారు. గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేసినపుడు పోలీసులు ఆయనపై కేసుపెట్టి అరెస్ట్‌చేసిన విషయాన్ని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు విషయం పై రాష్ట్ర సర్కార్ అఖిలపక్షభేటీని నిర్వహించాలన్నా రు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు పనుల కోసం వేలకోట్లు ఖర్చుచేసినందున, ఇప్పుడు మార్పునకు కారణాలు, దానివల్ల కలిగే లాభాలు, పాతదాని వల్ల నష్టాలను వివరించాలన్నారు.
సమ్మె లో పాల్గొన్న 1,300 మంది జీహెచ్‌ఎంసీ కార్మికులను విధుల్లోంచి తొలగిస్తామనడం సరికాదని, వారి పక్షాన బీజేపీ పోరాడుతుందన్నారు. ఉస్మానియా ఆసుపత్రి తరలింపు విషయంలో సీఎం కేసీఆర్ అన్నిపార్టీలతోనూ మాట్లాడాలన్నారు. ఆసుపత్రిలో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయనీ, దాని తరలింపునకు తాము వ్యతిరేకం కాదన్నారు. అన్ని పార్టీలతో మాట్లాడితే విలువైన సూచనలు అందుతాయన్నారు.