మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమం | Mission Kakatiya Great program : Water Man of India Rajender Singh | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమం

Published Thu, Aug 6 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమం

మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమం

సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ గొప్ప కార్యక్రమం అని మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్‌సింగ్ కితాబిచ్చారు. కాకతీయుల నుంచి అందిన వారసత్వ సంసృ్కతిని పునరుద్ధరిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వాలే ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు నడిపిం చలేవని, పౌర సమాజం సైతం అండగా నిలిచినప్పుడే ఇది విజయవంతం అవుతుందని అన్నారు.

చెరువుల పూడికను స్వచ్ఛందంగా తరలించేలా ప్రజలను ప్రోత్సహించడం, వారిని భాగస్వాములను చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆయన నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావుతో పాటు ఇతర అధికారులను నీటిపారుదల శాఖ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చెరువుల పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రితో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘చెరువులు తెలంగాణ సంసృ్కతికి ప్రతీకలు. మధ్యలో చెరువుల సంసృ్కతికి అవాంతరాలు ఎదురైనా వాటిని ప్రస్తుతం పునరుద్ధరిస్తున్నారు. వారసత్వ చెరువులను గుర్తించడం ఒక ఎత్తై, పంటల ఉత్పాదకత పెరిగేలా పూడిక మట్టిని తరలించేందుకు సమాజాన్ని ప్రోత్సహించడం నా ఆలోచనలకు దగ్గరగా ఉంది’ అని అన్నారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.25వేల కోట్ల మేర కేటాయించడం గొప్పవిషయమని కొనియాడారు. రాష్ట్రంలో వర్షపాతానికి అనుగుణంగా పంటల విధానాన్ని అనుసరించాలని, దీనికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారం తీసుకోవాలని ఆయన సూచించారు.
 
చెరువుల పరిరక్షణకు చట్టం: హరీశ్‌రావు
అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ‘త్వరలోనే ప్రభుత్వం చెరువుల పరిరక్షణ కోసం చట్టాన్ని తీసుకురాబోతోంది. పట్టణీకరణ నేపథ్యంలో చెరువులు మాయం అవుతున్నాయి. ఈ దృష్ట్యా అటవీ చట్టం మాదిరే చెరువుల కబ్జాలకు పాల్పడితే జైలుకు పంపే రీతిలో చట్టాన్ని తీసుకురానున్నాం’ అని తెలిపారు. మిషన్ కాకతీయ లక్ష్యాలను మంత్రి, రాజేందర్‌సింగ్‌కు వివరించారు. కాగా, రాజేందర్‌సింగ్ నేతృత్వంలోని బృందం గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించి.. అక్కడ మిషన్ కాకతీయ పనులను పరిశీలిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement