విశాఖ స్టీల్స్‌కు గనులు కేటాయించండి
న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం కోసం సొంత గనులను కేటాయించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కోరారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు మిగిలిన ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్స్‌కు సొంత గనులు లేకపోవడంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,421 కోట్ల నష్టాలను చవిచూసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో సొంత గనులు ఉన్న స్టీల్ సంస్థలకు రూ.500లకే టన్ను ముడి సరుకు దొరుకుతుంటే విశాఖ స్టీల్స్‌కు మాత్రం టన్నుకు రూ.4500 ఖర్చు అవుతోందని తెలిపారు. మార్కెట్లో నిలబడాలంటే ఉత్పత్తులను మాత్రం మిగతా సంస్థలకు సమానంగా అమ్మాల్సి రావడంతో భారీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. ఇటువంటి పరిస్థతిల్లో సంస్థను కాపాడుకోవాలంటే తక్షణమే విశాఖ స్టీల్స్‌కు సొతం ఇనుప ఖనిజం గనులను కేటాయించాలని ప్రధానిని కోరారు. ఈ విషయంలో ఆలస్యం జరిగితే అది సంస్థ మనుగడకే ప్రమాదమని, సొంత గనులను కేటాయిస్తూ తక్షణమే గనుల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.