సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్ మల్లికార్జున, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు
సాక్షి,విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. పీఎం, సీఎం పర్యటనల నేపథ్యంలో గురువారం ఆయన సర్క్యూట్ హౌస్‌లో పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను టీటీడీ చైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మేయర్ గొలగాని హరివెంకటకుమారితో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి దాదాపు రెండు లక్షల మంది.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి లక్ష మంది వరకు ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని.. అందుకు సుమారు 30 ఎకరాల ప్రాంగణంలో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం తగదని హితవు పలికారు.
ఇది రాజకీయ సభ కాదని.. అభివృద్ధికి సంబంధించిన సభ అన్నారు. రూ.15 వేల కోట్ల అభివృద్ధి పనులంటే చాలా తక్కువని అంటున్న చంద్రబాబు.. తను ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారని ఆరోపించారు. ఆయన దోచుకున్న రూ.5 లక్షల కోట్లతో పోల్చితే ఈ రూ.15 వేల కోట్లు తక్కువేనని ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వే జోన్ విషయమై ప్రధానితో చర్చిస్తామని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
సభా ప్రాంగణంలోని ఓ భాగం
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు ఎప్పుడూ వ్యతిరేకమే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ అనేక ఉద్యమాలు, పాదయాత్రలు, నిరసనలు చేపట్టిందని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ వ్యతిరేకమేనన్నారు. స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి వాటా కూడా లేదని, ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి చెందిందన్నారు.
ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి బీజేపీ వాళ్లను అడిగితే బాగుంటుందని సూచించారు. చెట్లను తొలగించిన చోట రెట్టింపుగా మొక్కలు నాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ విశాఖ ఉత్తర సమన్వయకర్త కె.కె.రాజు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment