-16న బ్రహ్మోత్సవ తరహాలో గరుడ సేవ,
27న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- సీసీ కెమెరాలతో నిఘా
- రోజూ 7 లక్షల లడ్డూల నిల్వ
సాక్షి,తిరుమల
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్టోబరు 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధానంగా శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో వాహన సేవలు తిలకించేలా భక్తులకోసం గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే తూర్పుమాడ వీధిలో దాదాపుగా ఈ పనులు పూర్తి చేశారు. దక్షిణ, పడమర,ఉత్తరమాడ వీధుల్లో కొనసాగుతున్నాయి. ఆలయంతోపాటు కూడళ్లలో భారీ కటౌట్లు ఏర్పాటు చసేందుకు విద్యుత్ అలంకరణ పనులు సాగుతున్నాయి. ఇక ఆలయ నాలుగు మాడ వీధులు రంగుల రంగవళ్లులతో శోభాయమానంగా కనిపిస్తున్నాయి. ఆలయానికి ఇప్పటికే తెల్లసున్నం అలంకరణ చేశారు.
సీసీ కెమెరా నిఘా
బ్రహ్మోత్సవాల భద్రత కోసం తిరుమలలోని టీటీడీ సీసీ కెమెరా, నిఘా వ్యవస్థతోపాటు అర్బన్‌జిల్లా పోలీసు విభాగాలు అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నాయి. ఇప్పటికే ఉత్సవాల భద్రతపై డీజీపీ సాంబశివరావు ఆదేశాలతో రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకరరావు, తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్‌పి జయలక్ష్మి పలుమార్లు పర్యటించారు. రోజూ 3 వేల నుండి 3500 మంది పోలీసు భద్రత వినియోగించాలని నిర్ణయించారు. గరుడ సేవ రోజున అదనంగా మరో వెయ్యి మందిని రప్పించనున్నారు. వీటితోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, ఆక్టోపస్, ఇతర నిఘా సంస్థల సిబ్బంది పరస్పర సహకారం అందించుకోవాలని నిర్ణయించారు.
రోజూ 7 లక్షల లడ్డూల నిల్వ
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తరలివచ్చే భక్తుల కోసం రోజూ ఏడు లక్షల లడ్డూలు నిల్వ ఉండాలని టీటీడీ నిర్ణయించింది. వీటి తయారీకి కోసం అదనపు సిబ్బందిని నియమించారు. ఆలయంలోని ప్రధాన పోటు, అదనపు పోటుతోపాటు ఆలయం వెలుపల బూందీ పోటులోనూ తయారీ కోసం అదనపు ఏర్పాట్లు చేశారు.
16న బ్రహ్మోత్సవం తరహాలో గరుడోత్సవం
ఈ 16వ తేదిన పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన గరుడ సేవ ఊరేగింపులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిశీలించేందుకు పున్నమి గరుడ సేవను బ్రహ్మోత్సవం తరహాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇక 27న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.